breaking news
Crop break
-
నిబంధనలకు ‘పొగ’బెట్టారు!
సాక్షి,కల్లూరు: కర్నూలు సమీపంలోని భారీ పరిశ్రమలు నిబంధనలకు విరుద్ధంగా పగలు, రాత్రి అనే తేడా లేకుండా పొగలు చిమ్ముతున్నాయి. ఫలితంగా సమీపంలోని గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్లూరు మండల పరిధిలో పందిపాడు, లక్ష్మీపురం గ్రామాల మధ్య ఐరన్ (టీఎంటీ) పరిశ్రమ రెండు నెలల క్రితం పునః ప్రారంభమైంది. దీని నుంచి పొగ విపరీతంగా బయటకు వస్తోంది. పరిశ్రమ చుట్టూ ఉన్న పొలాలు పొగ చూరి పనికిరాకుండా పోతున్నాయి. పొగ వాసనను భరించలేక పక్కనే ఉన్న సిమెంట్ ఇటుకల పరిశ్రమకు కార్మికులు రావడం మానేశారు. టీఎంటీ పరిశ్రమకు అనుబంధంగా బాయిలింగ్ ఐరన్ పరిశ్రమ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలిస్తోంది. ఇదే జరిగితే బాయిలింగ్ పరిశ్రమ నుంచి వచ్చే పొగ, దుమ్ము, ధూళి పైర్లపై పడి పంటలు పండే పరిస్థితులు ఉండబోవని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిబంధనలు పాటించాలి పరిశ్రమల నుంచి వస్తున్న పొగ, దుమ్ము, ధూళితో వాహనదారులు, సమీప గ్రామాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి బోర్డు నిబంధనల మేరకు పరిశ్రమలను నడపాలి. నిబంధనలకు విరుద్ధంగా నడిచే పరిశ్రమలను సీజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – ఎల్లరాముడు, ఐఎఫ్టీయూ జిల్లా నాయకుడు -
పంట విరామం దిశగా కోనసీమ రైతులు
తీరప్రాంత మండలాల్లో తరచూ ముంపు రాజమండ్రి : సాగు సమ్మె చేసి నాలుగేళ్లు కావస్తున్నా తమ డిమాండ్లు పరిష్కారం కాకపోవడం, సాగు కష్టతరంగా మారడంతో ప్రస్తుత ఖరీఫ్ సాగుకు స్వచ్ఛందంగా విరామం ప్రకటించేందుకు కోనసీమ రైతులు సిద్ధమవుతున్నారు. పెరిగిన పెట్టుబడికి తగిన రాబడి లేకపోవడం, కొద్దిపాటి వర్షానికే మురుగునీటి కాల్వలు పొంగిపొర్లడం, తీరప్రాంత మండలాల్లో సముద్రం పోటెత్తినప్పుడు చేలను ఉప్పునీరు ముంచెత్తి పంట నష్టపోవడం కోనసీమ రైతులకు పరిపాటిగా మారింది. తీరంలోని కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, మలికిపురం, సఖినేటిపల్లి తదితర మండలాల్లో రైతులు ఖరీఫ్ సాగు చేయరాదనే నిర్ణయానికి వచ్చారు. నాలుగేళ్లు కావస్తున్నా అదే పరిస్థితి ధాన్యం దిగుబడి రికార్డుస్థాయిలో వచ్చినా కొనే దిక్కులేక నష్టపోయిన కోనసీమ రైతులు 2011లో సాగుసమ్మె చేశారు. ఈనిర్ణయం అప్పటి ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాల్జేసింది. ఇది జరిగి నాలుగేళ్లు కావస్తున్నా పరిస్థితిలో మార్పు లేదు. సాగుచేసి నష్టాలను చవి చూసేకంటే వదులుకుంటే మేలనే అభిప్రాయం రైతులను పంట విరామానికి పురికొల్పుతోంది. సఖినేటిపల్లి, ఉప్పలగుప్తం, మలికిపురం, మండలాల్లో గత ఏడాది 3 వేల ఎకరాల్లో సాగును రైతులు వదులుకున్నారు. ఈ ఏడాది కూడా ఇక్కడ ఇదే పరిస్థితి. వీరికి మరికొన్ని గ్రామాల రైతులు తోడవడంతో కోనసీమలో ఈసారి సుమారు 10 వేల ఎకరాల్లో రైతులు పంటను వదులుకునే పరిస్థితి నెలకొంది. దీనిపై తీర మండలాల రైతు సంఘాల నేతలు, రైతులు సమావేశాలు ఏర్పాటు చేసి, పంట విరామమే మంచిదనే నిర్ణయానికి వచ్చారు.