breaking news
Corporate Spying
-
‘పర్యావరణ’ సంయుక్త కార్యదర్శి పీఎస్ అరెస్ట్
న్యూఢిల్లీ: కార్పొరేట్ గూఢచర్యం కేసు వ్యవహారం తాజాగా పర్యావరణ మంత్రిత్వశాఖను తాకింది. కార్పొరేట్ గూఢచర్యం వ్యవహారం లో పోలీసులు గురువారం ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిలో పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖలోని సంయుక్త కార్యదర్శికి పీఎస్‌గా వ్యవహరిస్తున్న జితేందర్ నాగ్‌పాల్‌తోపాటు ఓ యూపీఎస్సీ సభ్యునికి పీఏగా ఉంటున్న విపన్‌కుమార్ ఉన్నారు. వీరిద్దరినీ గురువారం అరెస్ట్ చేసినట్టు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(క్రైమ్) రవీంద్ర యాదవ్ వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి క్రైమ్‌బ్రాంచ్ రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం తెలిసిం దే. ఇప్పటివరకు మొత్తంగా 16 మందిని అరెస్ట్ చేసింది. తాజా అరెస్టులు రెండో ఎఫ్ఐఆర్కు సంబంధించినవి. ఇందులో ఇంధన కన్సల్టెంట్ లోకేశ్ శర్మతోసహా ఐదుగురు పేర్లు ఉన్నాయి. విపన్‌కుమార్ ఇంతకుముందు పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖలో పనిచేశారు. అక్కడ తనకున్న సంబంధాలతో కీలకమైన రహస్య పత్రాలను తస్కరించి.. లోకేశ్ వర్మకు అప్పగించేవాడని వెల్లడైంది. పోలీసులు లోకేశ్‌ను విచారించిన సందర్భంగా విపన్‌కుమార్, జితేందర్ నాగ్‌పాల్‌ల పేర్లు బయటకు వచ్చినట్టు సమాచారం. -
‘బొగ్గు’లోనూ గూఢచర్యం!
* కోల్, విద్యుత్ శాఖల రహస్య పత్రాల చేరవేత * ఆరోపణలపై ఒకరి అరెస్టు.. అదుపులో మరో ఆరుగురు న్యూఢిల్లీ: కార్పొరేట్ గూఢచర్యం ఒక్క చమురుశాఖకే పరిమితం కాలేదు! బొగ్గు, విద్యుత్ శాఖల్లో కూడా ఇదే తతంగం చోటుచేసుకుంది. తాజాగా ఈ రెండు శాఖల నుంచి రహస్య పత్రాలు బయటకు తరలించారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు నోయిడాలోని ఇన్ఫ్రా లైన్ కన్సల్టెన్సీ కంపెనీకి చెందిన లోకేశ్ శర్మ(33)ను అరెస్టు చేశారు. ఆయన నుంచి నకిలీ ఐడీ కార్డులు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మరో ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఢిల్లీలో విసృ్తతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. లోకేశ్‌ను సోమవారం చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా.. నిందితుడిని ఐదు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చమురుశాఖలో కీలక పత్రాల చోరీ కేసులో ఢిల్లీ పోలీసులు ఇప్పటికే 12 మందిని అరెస్టు చేయడం తెలిసిందే. వీరిలో శంతను సైకియా, ప్రయాస్ జైన్లను విచారించగా, లోకేశ్ పాత్ర వెలుగులోకి వచ్చింది. ‘ఈ రాకెట్లో లోకేశ్ కీలక పాత్ర పోషించాడు. పెట్రోలియం, బొగ్గు, విద్యుత్ శాఖల్లో పనిచేసే సిబ్బంది ద్వారా ఇతడు రహస్య డాక్యుమెంట్లను సేకరించేవాడు. వాటిని తన కంపెనీకి ఇవ్వడంతోపాటు బయట కూడా అమ్ముకునేవాడు అని ఢిల్లీ జాయింట్ కమిషనర్(క్రైం) రవీంద్ర తెలిపారు. చమురు శాఖలో వెలుగుచూసిన గూఢచర్యంతో సంబంధం లేకుండా దీన్ని వేరే కేసుగా పరిగణిస్తూ ఎఫ్ఐఆర్ దాఖలు చేశామని, లోకేశ్ ఇచ్చిన సమాచారంతో మరికొందరిని అరెస్టు చేస్తామని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. రహస్య పత్రాలను వీరు ఎలా చేరవేశారు, వాటి ద్వారా ఎవరు లబ్ధి పొందారని అడగ్గా.. లోకేశ్ అనుచరులను కూడా విచారిస్తే ఈ వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు.చమురు శాఖలో గూఢచర్యం కేసులో అరెస్టయిన నలుగురి నిందితులు లాల్తా ప్రసాద్, రాకేశ్, ప్రయాస్ జైన్, శంతను సైకియాలకు ఢిల్లీ కోర్టు మార్చి 6 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కస్టడీ గడువు ముగియడంతో పోలీసులు వారిని సోమవారం మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పోలీసులు తమతో ఖాళీ పేపర్లపై బలవంతంగా సంతకాలు తీసుకున్నారని వారు కోర్టుకు చెప్పారు. కేసు డైరీపై కోర్టు సంతకం చేయాలని వారి న్యాయవాది వాదించగా.. అందుకు కోర్టు సమ్మతించింది. సోదాలు జరగలేదు: రిలయన్స్ కార్పొరేట్ గూఢచర్యం కేసులో దేశవ్యాప్తంగా తమ కార్యాలయాలపై ఎక్కడా కూడా పోలీసులు దాడులు జరపలేదని అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. దర్యాప్తు అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలిపింది. రిలయన్స్ పవర్లో పనిచేసే ఓ ఉద్యోగి కార్యాలయంలోనే పోలీసులు సోదారుల జరిపారని, అయితే నేరానికి సంబంధించి ఆయన నుంచి ఎలాంటి సమాచారం లభ్యం కాలేదని వివరించింది. తమ వ్యాపారాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తావు లేదని స్పష్టంచేసింది. గూఢచర్యం కేసులో అరెస్టయిన ఐదుగురు కార్పొరేట్ అధికారుల్లో రిలయన్స్ గ్రూపుకు చెందిన రిషీ ఆనంద్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.