breaking news
Concepts of meditation
-
ద్వేషం మనసుని బలహీనం చేస్తుంది
ధ్యాన భావనలు మనసు నిండా ద్వేషం నింపుకున్న వ్యక్తి ఎన్నటికీ విశ్రాంతిగా గానీ, ప్రశాంతంగా గానీ ఉండలేడు. మనలో ద్వేష భావం ఉన్నదంటే, ఎవరో చేస్తున్న తప్పుకు మనం శిక్ష అనుభవిస్తున్నామని! ఎవరైనా ఒక వ్యక్తి గానీ, ఏదైనా ఒక వస్తువు గానీ మనకు అశాంతిని కలుగజేస్తే, ముందు మనకు కలిగేది చిరాకు లేదా కోపం. ఈ చిరాకు, కోపం నిముషంలోనే ద్వేషంగా మారుతుంది. అయితే ఆ చిరాకు లేదా కోపం కాసేపే ఉంటుంది కానీ, వాటి నుంచి పుట్టిన ద్వేషం మాత్రం శాశ్వతంగా తిష్టవేసుకుని కూర్చుంటుంది మనసులో. అలా ఎందరి మీదో, ఎన్ని వస్తువుల మీదో, ఎన్ని పరిస్థితుల మీదో మనం ద్వేషం పెంచుకుంటూ పోతే మన మనసు పూర్తిగా దెబ్బతింటుంది. ఇక ఎన్నటికీ దాని ఆరోగ్యం బాగుండదు. అంటే మానసిక అనారోగ్యం ఏర్పడుతుంది. అందువల్ల సాధకులుగా మనం ద్వేషాన్ని చిన్న సమస్యగా తీసి పారేయకూడదు. అది ఒక తీవ్రమైన, శాశ్వతమైన సమస్య. దాన్ని ప్రత్యేకంగా ఒక పట్టుపట్టాలి. అది కూడా చాలాకాలం పాటు. లేకపోతే ద్వేషం ఎన్నటికీ పోదు. ఏదో ఆషామాషీగా తీసిపారేయకూడదు. అతి ముఖ్యమైన అంశంగా చేసుకోవాలి. అసలు ద్వేషం ఎందుకు కలుగుతుంది? నాకు అశాంతి కానీ, అవస్థ గానీ కలిగితే తట్టుకోలేను కాబట్టి. అంటే మనసు బలహీనంగా ఉన్నట్టన్నమాట. బలహీనమైన మనసు ప్రతి చిన్నదానికీ రుసరుసలాడుతుంది. ద్వేషాన్ని పెంచుతుంది. ఈ ద్వేషాన్ని దరిచేరనీయకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం మనసును దృఢపరచుకోవడం. శరీరానికి దెబ్బ తగిలితే ఏం చేస్తాం? చికిత్స చేస్తాం. అది బాధాకరంగా ఉండొచ్చు. అంతమాత్రాన శరీరాన్ని ద్వేషించము. అలాగే కొంతమందితో కఠినంగా వ్యవహరించాల్సి రావచ్చు. అందరినీ ఒకేలాగ చూడలేకపోవచ్చు. కానీ వాళ్ల మీద ద్వేషం పెంచుకోకుండా జాగ్రత్త పడాలి నేను. అంతేకాదు, వాళ్లు బాగుండాలని కోరుకోవాలి. వాళ్ల ఉన్నతి కోసం, పరిణతి కోసం దేవుని ప్రార్థించాలి. నా మనసు దృఢంగా ఉంటేనే అది సాధ్యమౌతుంది. ప్రార్థన ద్వారా, నాకు నేను సూచనలు ఇచ్చుకోవడం ద్వారా నేను నా మనసుని దృఢపరచుకోగలను. ప్రతి ప్రార్థన ముగిశాక నేను మరింత దృఢం అయినట్లు భావిస్తాను. నేను మరింత దృఢంగా ఉన్నానని నాకు నేను చెప్పుకుంటాను. దేవుని కృప వల్ల, నేను మానసికంగా దృఢంగా ఉన్నాను. ప్రపంచంలో ఎవరినీ ద్వేషించను. కేవలం నాకు హాని చేయడమే తన జీవిత ధ్యేయంగా భావించే, నా అత్యంత భయంకరమైన శత్రువుని సైతం ద్వేషించను. ఆ శత్రువు పరిణతి చెందనందుకు అతని మీద జాలి పడతాను. అతని ఉన్నతి కోసం కూడా దేవుని ప్రార్థిస్తాను. అతని వల్ల నేను అవస్థ పడినప్పటికీ నేను అతన్ని ద్వేషించాలనేం లేదు. అతన్ని నేను ప్రేమించలేకపోవచ్చు. అలా ప్రేమించగలగడానికి మరింత శక్తి కావాలి కానీ, ముందుగా ద్వేషాన్నయితే మనసులోకి రానీయకూడదు. ఎప్పుడైతే మనసులో ద్వేషానికి చోటులేదో, అప్పుడు ప్రేమించడానికి అవకాశాలు మెరుగవుతాయి. - స్వామి పరమార్థానంద (తెలుగు: మద్దూరి రాజ్యశ్రీ) -
మనోబలానికి ప్రార్థన దివ్యౌషధం
ధ్యాన భావనలు మనసుని తొలిచివేసే ఆలోచనల్లో భయం ఒకటి. భయం సార్వజనీనం. పశుపక్ష్యాదులకు కూడా ఉంటుందీ భయం. భయాన్ని మన జీవితంలో అనేక రకాల బెంగలతో భవిష్యత్తు, కుటుంబం, పని లేదా వ్యాపారాల గురించి వెలిబుచ్చుతాం. కొన్ని బెంగలు చిన్నవిగా ఉంటే, కొన్ని తీవ్రంగా ఉంటాయి. ఇది మన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాలకు మంచిది కాదని మనందరికీ తెలుసు. బెంగపడి సాధించేదేమీ లేదని కూడా తెలుసు. మనకు భవిష్యత్తులో రాసిపెట్టి ఉన్నదాన్ని, మనం బెంగపడడం వల్ల ఏమీ మార్చలేమనీ తెలుసు. అయినప్పటికీ మనం బెంగపడి, కంగారు పడి, దిగులు చెంది, భయపడి పోతుంటాం. దీన్ని బట్టి ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఈ సమస్య మన వివేకానికి సంబంధించినది కాదు. అలాగయితే భయం తొలగిపోవాలి. మరి సమస్య ఎక్కడుంది? మన మనసులో, మన మానసిక అలవాట్లలో ఉందన్నమాట. సగం మానసిక సమస్యలు నా భావపరమైన అలవాట్ల నుంచి వస్తాయి. ఈ అలవాట్లు నేను నా మనసులో పదేపదే భావాలను తిరగదోడటం వల్ల ఏర్పడతాయి. ఇప్పుడు భావాలు నా అంతఃచేతన మనసులో లోతుగా ఉన్నాయి. వాటిని సంస్కారాలు లేదా వాసనలు అంటారు. వాటిని నేను పారద్రోలాలంటే, నేను వాటిని ప్రయత్నపూర్వకంగా బయటకు లాగి, వాటి వ్యతిరేక భావాలను సాధన చేయాలి. నేను ప్రశాంతంగా కూర్చొని, నా బెంగలనన్నిటినీ పైకి లాగి, వాటిని బయట పెట్టి, వాటి కింద దాగిన గట్టి మనసును కనుక్కోవాలి. నేను బెంగపడడం లేదని నాకు నేనే చెప్పుకోవాలి. మొదట్లో అది యాంత్రికంగా ఉండవచ్చు. లేదా చూడడానికి అలా ఉండవచ్చు. కానీ రానురాను అది నేను అలవరచుకున్న ఒక సానుకూల ఆలోచన అవుతుంది. ఈ కొత్త అలవాటును పెంపొందించుకోడానికి, నేను దేవుని సహాయం కోరుతాను. నాకు బలాన్నివ్వమని వేడుకుంటాను. ‘ఓ దేవా! నా భవిష్యత్తును, అది ఎలాగున్నా సరే, మనస్ఫూర్తిగా ఆహ్వానించే శక్తిని ఇవ్వు నాకు. నా భవిష్యత్తు గానీ, నా కుటుంబ భవిష్యత్తుగానీ, నా దేశ భవిష్యత్తుగానీ ఎలా ఉంటుందో నాకు తెలియదు. అది మంచీచెడుల మేలు కలయికగా ఉంటుందని మాత్రం నాకు తెలుసు. నేను వాటిని అనుభవించక తప్పదు. ఎందుకంటే నేను భూమ్మీద పుట్టిందే నా కర్మఫలాన్ని హరింపజేయడానికి. వాటిని నేను ఆడించలేను. తప్పించుకోలేను. అందుకని ఏ విధమైన బెంగకూ లోను కాకుండా, వాటిని ప్రశాంతంగా ఆహ్వానించేందుకు నాకు శక్తి కావాలి’. ప్రార్థన చేస్తే నా శక్తి పెరుగుతుందని మొదట నేను నమ్మాను. మనసారా, భక్తితో చేసిన ప్రతి ప్రార్థన తర్వాతా నేను మరింత శక్తిని పుంజుకున్నాను. ఆ శక్తిని నేను గ్రహించుకుని, నేనిప్పుడు మరింత శక్తిమంతంగా ఉన్నాను. నా జీవితంలో ఎటువంటి సంఘటననైనా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాను అని నాకు నేనే చెప్పుకుంటాను. నా వృద్ధాప్యం, అనారోగ్యం, మరణం, కుటుంబ సభ్యుల జీవితాలలో ఒడిదుడుకులు, వ్యాపారంలో లాభనష్టాలు ఏవి కలిగినా సరే నాకిక బెంగ లేదు. నేను ఇక కంగారుపడను. నేను ఇక దిగులు చెందను. మిన్ను విరిగి మీదపడ్డా దాన్ని ఎదుర్కోడానికి నేను సిద్ధం. నేను విశ్రాంతిగా ఉన్నాను. నేను విశ్రాంతిగా ఉన్నాను. నేను విశ్రాంతిగా ఉన్నాను. శాంతోహం శాంతోహం శాంతోహం. - స్వామి పరమార్థానంద (తెలుగు: మద్దూరి రాజ్యశ్రీ)