breaking news
Computer Program Mission
-
ఈవీఎంల హ్యాకింగ్ చాలా సులభం: ఎలన్ మస్క్
సాక్షి, అమరావతి: ఈవీఎంలను (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు) చాలా సులభంగా హ్యాక్ చేయవచ్చని టెక్ దిగ్గజం, టెస్లా అధినేత ఎలన్ మస్క్ పునరుద్ఘాటించారు. పారదర్శకత కోసం బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలని మరోసారి గట్టిగా సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంతో ఇష్టపడే నిపుణుడిగా తాను ఈ మాట చెబుతున్నట్లు స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ తరపున ప్రచారం నిర్వహిస్తున్న ఎలన్ మస్క్ రెండు రోజుల క్రితం పెన్సిల్వేనియాలోని ఫిలడెలి్ఫయాలో జరిగిన బహిరంగ సభలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.ఓ అభ్యర్థి గెలిచేలా రీ ప్రోగ్రామింగ్ చేయవచ్చు..ఈవీఎంల పనితీరుపై ఎలన్ మస్క్ తొలి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈవీఎంలలో కాలం చెల్లిన మైక్రోసాఫ్ట్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నారని, దీంతో వీటిని హ్యాక్ చేయడం అత్యంత సులభమని, ఈ విషయాన్ని ఒక టెక్నాలజీ నిపుణుడిగా చెబుతున్నట్లు జూలైలో మస్క్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. 2017లో సెనేట్ ఇంటెలిజెన్స్ విచారణలో ఈ విషయం బయటపడిందని, ఓ అభ్యర్థి గెలిచే విధంగా ఓట్లను దొంగిలిస్తూ ఈవీఎంలను రీ ప్రోగ్రామింగ్ చేయవచ్చని స్పష్టం చేశారు. అమెరికా ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సహా మరే విధంగానూ ఎల్రక్టానిక్ ఓటింగ్ పద్ధతిని వినియోగించకూడదని మస్క్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.ఈవీఎంల సాఫ్ట్వేర్ ఉత్తమం కాదు.. ‘ఈవీఎంలను చాలా సులభంగా హ్యాక్ చేయవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వం ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ను ఇంకా చాలా తేలిగ్గా హ్యాక్ చేయవచ్చు. నాకు కంప్యూటర్ అంటే ఇష్టం. అయితే కంప్యూటర్లు ఓటింగ్ ట్యాబ్‌లేషన్‌ను కలిగి ఉండకూడదు. ఈవీఎంల్లో వినియోగిస్తున్న సాఫ్ట్వేర్ ఉత్తమమైనది కాదు. ఎన్నికల్లో పేపరు బ్యాలెట్లు మాత్రమే ఉపయోగించాలి. ప్రతి వ్యక్తి నేరుగా పోలింగ్ బూత్ వద్దకు వచ్చి లైన్లో నిలబడి ఓటింగ్ హక్కు వినియోగించుకోవాలి’ అని మస్క్ పేర్కొన్నారు. ఈవీఎంల ద్వారా భారత్‌లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ తీరుపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా ఎలన్ మస్క్ వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారి తీశాయి. ఈవీఎంల ద్వారా కాకుండా పారదర్శకత కోసం బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సైతం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. -
ఆర్టీఓలో అందుబాటులో లేని డ్రైవింగ్ యంత్రాలు
సాక్షి, ముంబై : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్టీఓ కార్యాలయాలలో డ్రైవింగ్‌పై శిక్షణనిచ్చే యంత్రాలను అమర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. కొన్ని ఆర్టీఓ కార్యాలయాలలో వీటిని అమర్చినప్పటికీ అవి పని చేయడం లేదు. కంప్యూటర్ స్క్రీన్‌పై శిక్షణనిచ్చే ఈ యంత్రాలను ఎన్నింటిని అమర్చాలో కూడా నిర్ణయించలేదు. రోడ్డుపై వాహనాన్ని సురక్షితంగా నడిపేందుకు గాను కంప్యూటర్ ప్రోగ్రామ్ మిషన్‌పై ఆర్టీఓ కార్యాలయాలలో ఈ శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఆర్టీఓ కార్యాలయాలలో డ్రైవర్లకు డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించే సమయంలో శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహించే పరికరాలు కూడా సక్రమంగా లేవన్న విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఓ ఆర్టీఓ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ డ్రైవింగ్‌పై శిక్షణనిచ్చే యంత్రాలను అమర్చడంలో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదన్నారు. ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత అంధేరీ, తాడ్‌దేవ్ ఆర్టీఓలలో వీటిని ఏర్పాటు చేసినట్లు ఆ అధికారి తెలిపారు. ఇదిలా వుండగా అంధేరీలో ఉన్న ఈ యంత్రం గత కొన్ని రోజులుగా పని చేయడం లేదు. ఈ పరికరం ఎంతో ఖరీదైనది కావడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పరికరాన్ని అమర్చడంలో జాప్యం చేస్తుందని మరో అధికారి చెప్పారు. అయితే ఈ డ్రైవింగ్ శిక్షణ యంత్రాలకు గాను ఒక్కోదానికి రూ.ఆరు నుంచి ఏడు లక్షల వరకు ఖర్చు అవుతోందని అన్నారు. ప్రస్తుతం బస్ డ్రైవింగ్ కోసం ఈ శిక్షణ యంత్రాలు వెస్టర్న్ ఇండియా ఆటోమొబైల్ అసోసియేషన్ (డబ్ల్యూఐఏఏ) డ్రైవింగ్ సెంటర్ చర్చ్‌గేట్‌లో అందుబాటులో ఉన్నాయి.