breaking news
CM survey
-
‘సర్వే’జన... శాసనసభ్యా..!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటివరకు ఏకచ్ఛత్రాధిపత్యం అనుకున్న ‘కోట’ల్లోకి ప్రవే శించేందుకు ప్రత్యర్థి పార్టీలతో పాటు సొంత పార్టీ నాయకులు కూడా పోటీ పడుతున్నారు. తేడా వస్తే ఎమ్మెల్యే టిక్కెట్టుకే ఎసరు రావచ్చేమోనన్న సంకేతాలు అధిష్టానం నుంచి అందుతున్నాయి. దీనికితోడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా నిర్వహిస్తున్న సర్వేలు గుబులు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై సర్వేలు జరిపించి మార్కులు వేసిన ముఖ్యమంత్రి ఈసారి మరింత పకడ్బందీగా క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ జరుపుతున్న ట్లు వస్తున్న వార్తలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అదే సమయంలో వివిధ పార్టీలు, సంస్థలు, యూనివర్సిటీ విద్యార్థులు నిర్వహించిన సర్వేలు అంటూ ‘2019లో గెలిచే ఎమ్మెల్యేలు’ పేరుతో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న అంకెలు, లెక్కలు ఉమ్మడి జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలను భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలు సైతం వివిధ వర్గాల ద్వారా సర్వేలు జరిపించుకునే పనిలో పడ్డారు. ఆయా నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను మంజూరు చేయించుకుంటూ, అభివృద్ధి పనుల పేరుతో జనంలోనే ఉండేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఎన్నికల హామీలకన్నా... స్థానిక అంశాలపై దృష్టి టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించిన దళితులకు మూడెకరాల సాగుభూమి, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం అమలు వివిధ కారణాల వల్ల ఆశించిన స్థాయిలో ఫలితమివ్వలేదు. మిషన్ కాకతీయ పథకంలో చెరువుల పూడికతీత సైతం పూర్తిస్థాయిలో సాగడం లేదు. మిషన్ భగీరథ కింద ఇంటింటికి రక్షిత మంచినీరు అందించే పథకం కూడా ఆలస్యం అవుతోంది. అదే సమయంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు, ఆసరా పింఛన్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతిసేవలు, కేసీఆర్ కిట్స్ వంటి పథకాలు జనం ఆదరణను చూరగొంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఇప్పుడు స్థానిక అంశాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ముఖ్యమంత్రి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే కార్యక్రమాలకు వచ్చే ఆదరణ అంతా సీఎంకే వెళుతున్న నేపథ్యంలో ‘మీరేం చేశారు’ అని జనం, విపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు పెండింగ్ ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టారు. హైదరాబాద్ సచివాలయం, ప్రగతిభవన్ల చుట్టూ తిరుగుతూ నియోజకవర్గంలో అందరి దృష్టిని ఆకర్షించే పనులు పూర్తి చేసేందుకు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ గానీ, టీఆర్ఎస్ తరుపున గాని నిర్వహించే సర్వేల్లో తమకు మంచి మార్కులు పడేలా చూసుకోవాలని యోచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుపున ఎమ్మెల్యే టిక్కెట్టుతో పాటు గెలుపు కూడా లక్ష్యంగా ప్రజల్లో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. సొంత పార్టీలో టిక్కెట్టు ఆశిస్తున్న నాయకులకు సైతం చెక్‌పెట్టే ధోరణితో సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజకీయ పావులు కదుపుతున్నారు. కొర్టా–చనాఖ బ్యారేజీతో ‘జోగు’ జోష్ దశాబ్ధాల కాలం నుంచి ఎన్నికల ప్రచార అస్త్రంగా మారిన పెన్‌గంగ కింద కొర్టా–చనాఖ బ్యారేజీ నిర్మాణంలో చొరవ చూపి మంత్రి జోగు రామన్న నియోజకవర్గ ప్రజల దృష్టిని ఆకర్షించారు. 50వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టును మంజూరు చేయించి పనులు ప్రారంభించడంలో మంత్రి కృషి గురించి కార్యకర్తలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. అలాగే ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రత్యేక దృష్టి పెట్టి అంతర్గత రోడ్లు, మిషన్ భగీరథ పనులు, ఇతర అభివృద్ధి పనులు చేపడుతూ సర్వేల్లో తన బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. ‘డబుల్’ ఇళ్ల నిర్మాణంలో మోడల్ ఐకే రెడ్డి గృహనిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నియోజకవర్గం నిర్మల్‌లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకం కింద చేపట్టిన పనులు వేగంగా సాగుతున్నాయి. వీటిని మోడల్‌గా చూపిస్తూ మిగతా లబ్ధిదారులకు సైతం ఇళ్లు నిర్మించి ఇస్తానని చెపుతున్నారు. నిర్మల్ నియోజకవర్గంలో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఆయన అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రి నిర్వహించిన రెండో విడత సర్వేలో ఆయన జిల్లాలో రెండోస్థానంలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయనే కీలకంగా ఉన్నారు. భారీ ప్రాజెక్టులు, ప్రజలతో సాన్నిహిత్యం కోనప్పకు ప్లస్ సీఎం సర్వేల్లో మొదటి స్థానంలో ఉన్న సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రజలతో సాన్నిహిత్యం ద్వారా తనకు ఎదురులేదనే రీతిలో కొనసాగుతున్నారు. ప్రాణహిత నదిపై రూ.65 కోట్లతో అంతర్రాష్ట్ర గూడెం బ్రిడ్జి, రూ.33 కోట్లతో పెంచికల్‌పేట బ్రిడ్జిల నిర్మాణంలో ఆయన పాత్ర కీలకం. కుమురంభీం ప్రాజెక్టు 90 శాతం పూర్తి కావడంతో సిర్పూర్ తాలుకాలోని 24వేల ఎకరాలకు త్వరలోనే నీరందించే పనిలో ఉన్నారు. గ్రామీణంతోపాటు పట్టణంపై ‘నడిపెల్లి’ దృష్టి ముఖ్యమంత్రి నిర్వహించిన తొలి విడత సర్వేలో వెనుకంజలో ఉండి రెండో సర్వే నాటికి మెరుగనిపించుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మంచిర్యాల పట్టణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లా కేంద్రంలో 100 పడకల ఆసుపత్రిని 250 పడకలకు అప్‌గ్రేడ్ చేయించేందుకు రూ.32.15 కోట్లు మంజూరు చేయించడం మంచి పరిణామం. అలాగే లక్సెట్టిపేటలో 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చేందుకు రూ.22.50 కోట్లు మంజూరు చేయించారు. మంచిర్యాల ఔటర్‌రింగ్ రోడ్డు ప్రాజెక్టు, కాలేజ్‌రోడ్డు నుంచి రూ.125 కోట్లతో అంతర్గాం బ్రిడ్జి మంజూరు కూడా ఎమ్మెల్యే ఖాతాలోకే రానుంది. గూడెం లిఫ్ట్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు సాగునీటి సౌకర్యం కల్పించిన ఆయన ఇప్పుడు గూడెం, కర్ణమామిడి, గుడిరేవు, గుల్లకోటలలో చిన్న తరహా ఎత్తిపోతల ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయించే పనిలో ఉన్నారు. ఆర్కేపీ ఓవర్‌బ్రిడ్జి కల నెరవేర్చనున్న ఓదెలు చెన్నూర్ నియోజకవర్గంలో రామకృష్ణాపూర్ రైల్వేగేట్ వద్ద బ్రిడ్జి నిర్మాణం స్థానికుల దశాబ్ధాల కల. ఈ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు కృషితో రైల్వే శాఖ ముందుకు వచ్చింది. బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు కోసం ఆర్థిక శాఖ నుంచి ఇటీవలే రూ.27.50 కోట్లు మంజూరు చేయించడంలో సఫలమయ్యారు. మందమర్రి సింగరేణి ప్రాంతంలో నెలకొన్న స్థానికుల నివాసాలకు సంబంధించి ఉన్న వివాదాలను సింగరేణి సంస్థతో మాట్లాడి పరిష్కరించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇటీవల పాదయాత్రలు చేపట్టి గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కల్పించే కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టారు. ∙ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నీల్వాయి వాగు మీద వంతెన, నెన్నెల నుంచి జంగంపేట వరకు రోడ్డు నిర్మాణాల కోసం భారీ ఎత్తున నిధులు మంజూరు చేయించారు. ∙ బోథ్‌లో ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాల కనెక్టివిటీ కోసం రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ∙ ముథోల్‌లో లోకేశ్వరం మండలంలో టిప్రి ఎత్తిపోతల పథకానికి రూ.80 కోట్లు మంజూరు చేయించడంలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కృషి చేశారు. ∙ ఖానాపూర్, ఆసిఫాబాద్‌లలోని గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయల కల్పన, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎమ్మెల్యేలు రేఖానాయక్, కోవ లక్ష్మి తమవంతు కృషి ముమ్మరం చేశారు. -
త్వరలో మంత్రివర్గ విస్తరణ?
-
త్వరలో మంత్రివర్గ విస్తరణ?
♦ సీఎం ముమ్మర కసరత్తు.. అతి త్వరలోనే ముహూర్తం? ♦ ముగ్గురు కొత్తవారికి అవకాశమంటున్న టీఆర్ఎస్ నేతలు ♦ పరిశీలనలో 15 మంది సీనియర్ ఎమ్మెల్యేల పేర్లు! సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గంలో అతి త్వరలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉందంటూ అధికార టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. గురువారం రోజంతా ఇదే వార్త హల్చల్ చేసింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం క్యాంపు కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో ఈ అంశంపై తీవ్రస్థాయిలో కసరత్తు చేసినట్టు పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. దేవాలయాల కమిటీ నియామకాలతో పాటు మంత్రివర్గ విస్తరణపైనే రోజంతా ఆయన కసరత్తు చేశారన్న వార్త టీఆర్ఎస్లో అంతర్గతంగా చక్కర్లు కొట్టింది. మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొద్ది రోజులుగా ఊహాగానాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. అది అతి త్వరలోనే జరుగుతుందనేందుకు తాజా కసరత్తే నిదర్శనమని ఆశావహ నేతలు చెబుతున్నారు. మంత్రివర్గం నుంచి ముగ్గురికి ఉద్వాసన పలికి వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని సీఎం నిర్ణయించారని కూడా టీఆర్ఎస్ వర్గాల్లో గట్టిగానే విన్పిస్తోంది. ఇందులో భాగంగానే సీనియర్ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం సర్వే కూడా చేయించినట్టు చర్చ నడుస్తోంది. ఆ సర్వే నివేదిక ఆధారంగా 15 మంది సీనియర్ ఎమ్మెల్యేల పేర్లను కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తున్నారని, అంతిమంగా వారిలో నుంచి ముగ్గురికి అవకాశం ఉంటుందని సీనియర్ నాయకులు కూడా చెబుతున్నారు. విస్తరణ అతి త్వరలోనే ఉంటుందని, అందుకు ముహుర్తం కూడా ఇప్పటికే ఖరారైందని వారు గట్టిగా చెబుతున్నారు!