breaking news
CHITURU
-
తిరుమలలో కేసీఆర్, కేఈ కుటుంబ సభ్యులు
సాక్షి, తిరుపతి: ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీవారి దర్శనానికి తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. శ్రీవారి ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనం కోసం లక్షలాది మంది తిరుమలకు చేరుకోవడంతో రద్దీ కారణంగా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటుచేసిన తాత్కాలిక షెడ్డుల్లో కూడా భక్తులు నిండిపోవడంతో మిగతావారిని తిరువీధిలోకి టీటీడీ ఆధికారులు తరలిస్తున్నారు. మంగళవారం వేకువ జామున రెండు గంటలకు వీఐపీలకు శ్రీవారి దర్శనం కల్పిస్తామని, ఉదయం ఐదు గంటల నుంచి సామాన్యలకు దర్శనం ఉంటుందని టీటీడీ ఆధికారులు తెలిపారు. రాష్ట్రంలో చలి తీవ్రత పెరగడంతో తిరుమలలోని చిన్న పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలకు చేరుకున్న ప్రముఖులు ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. టీఆర్ఎస్ నేత హరీశ్ రావు, ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్టమూర్తి తదితరులు కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అదుపుతప్పి ఆటో బోల్తా
వీరాపురం(చింతూరు), న్యూస్‌లైన్ : ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో వారం రోజుల పసికందు మృతిచెందింది. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దుర్ఘటన ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్ జాతీయ రహదారిలోని చింతూరు మండలం వీరాపురం వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. చింతూరు నుంచి చిడుమూరుకు వెళ్తున్న క్రమంలో వీరాపురం సమీపంలోని క్రషర్మిల్లు దాటగానే డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో అదుపుతప్పిన ఆటో గోతిలోకి బోల్తాపడినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ ఘటనలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కుంటకు చెందిన బుడంపర్తి లక్ష్మి, బుడంపర్తి శాంతమ్మ, ఆసిరిగూడేనికి చెందిన మడకం మంగ, బొడ్డుం కింజం(3), సోడె పొద్దమ్మ, మడకం ధనితో పాటు పొద్దమ్మకు చెందిన వారం రోజుల పాపకు తీవ్ర గాయాలయ్యాయి. వీరితోపాటు చిడుమూరుకు చెందిన బొక్కిలి పొదయ్య, బొక్కిలి సుబ్బయ్య, చింతూరుకు చెందిన డ్రైవర్, వార్డు మెంబర్ మడకం రమణ, సుబ్రహ్మణ్యం కూడా గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో చింతూరుకు చెందిన 108 వాహనం అందుబాటులో లేదు. దీంతో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 108 వాహనం, ఆటోల ద్వారా క్షతగాత్రులను చింతూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పొద్దమ్మకు చెందిన పసికందు మృతిచెందింది. బొక్కిలి పొదయ్య, డ్రైవర్ రమణ, లక్ష్మి, శాంతమ్మ, మంగ, కింజం పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం అంబులెన్సుల ద్వారా భద్రాచలం తరలించారు. ఈ ఘటనపై చింతూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్యం కోసం వచ్చి... ఆసిరిగూడేనికి చెందిన పొద్దమ్మ తన వారం రోజుల పాపకు ఆరోగ్యం బాగలేకపోవడంతో చింతూరులోని ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లింది. తల్లి ధని, సోదరి మంగను కూడా తోడుగా తీసుకెళ్లింది. తిరుగు ప్రయాణంలో ప్రమాదం చోటుచేసుకోగా బిడ్డను కోల్పోవాల్సి వచ్చింది. తల్లి, సోదరి తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి వరకు తన ఒడిలో పాలు తాగిన చిన్నారి విగతజీవిగా మారడంతో పొద్దమ్మ బోరున విలపిం చింది. వీరితో పాటు అదే గ్రామానికి చెందిన బొడ్డుం కింజం(3)కు కూడా అనారోగ్యంగా ఉండడంతో కుటుంబ సభ్యులు చింతూరు ఆస్పత్రిలో చూపించి తీసుకెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. దీంతో ఆ చిన్నారి తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుంటకు చెందిన లక్ష్మి, శాంతమ్మ చింతూరులో ఓ శుభకార్యానికి హాజరై వస్తుండగా, చిడుమూకు చెందిన పొదయ్య, సుబ్బయ్య బ్యాంకు పని నిమిత్తం చింతూరు వచ్చి తిరిగి వెళ్తున్నారు. మరికొద్ది నిమిషాల్లో గమ్యస్థానాలకు చేరుకోనండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద వార్త తెలుసుకుని పలు పార్టీల నాయకులు క్షతగాత్రులను ఆస్పత్రిలో పరామర్శించారు.