breaking news
chilli exporter
-
హైస్పీడ్ రైళ్లలో బంగ్లాకు మిర్చి ఎగుమతి
సాక్షి, అమరావతి/ సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్ –19 నేపథ్యంలో గుంటూరు వ్యాపారులు ఎగుమతులకు కొత్త మార్గం ఎంచుకున్నారు. గతంలో మాదిరిగా నౌకలు, లారీలు, గూడ్స్‌ల్లో కాకుండా హైస్పీడ్ పార్శిల్ రైళ్లలో విదేశాలకు వాణిజ్య పంటలు ఎగుమతి చేసి లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుతం ఈ విధానంలో బంగ్లాదేశ్‌కు మిర్చి ఎగుమతి చేస్తుండగా త్వరలో చైనా, వియత్నాం దేశాలకు కూడా ఎగుమతులకు హైస్పీడ్ రైళ్లు వినియోగించాలని యోచిస్తున్నారు. తక్కువ కాలంలో సరుకు ఎగుమతి అవుతుండటంతోపాటు సరిహద్దుల్లో ఎటువంటి సమస్యలు లేకపోవడంతో వ్యాపారులు ఈ విధానం పట్ల మొగ్గు చూపుతున్నారు. గుంటూరు రైల్వే డివిజన్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. హైస్పీడ్ రైళ్లలో మిర్చి ఎగుమతికి ఉన్నతాధికారుల నుంచి అనుమతి పొందింది. విదేశాలకు ఏటా రూ.3 వేల కోట్ల మిర్చి ► బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం మిర్చికి మంచి డిమాండ్ ఉంది. గుంటూరు కేంద్రంగా కొన్ని సంస్థలు ఏటా రూ.3 వేల కోట్ల విలువైన మిర్చి విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. ► చైనాకు రూ.1500 కోట్లు, బంగ్లాదేశ్‌కు రూ.1000 కోట్లు, వియత్నాంకు రూ.500 కోట్ల విలువైన పంట ఎగుమతి చేస్తున్నాయి. ► బంగ్లాదేశ్‌లో క్వింటా మిర్చికి రూ.13,500 నుంచి రూ.14,500 (తేజరకం) ధర లభిస్తోంది. లాక్డౌన్ ముగిశాక వ్యాపారులు నౌకలు, లారీలు, గూడ్స్‌ల్లో ఎగుమతి చేస్తున్నారు. ► అయితే ఎగుమతికి ఏడెనిమిది రోజుల సమయం పట్టడంతోపాటు దేశ సరిహద్దుల వద్ద లారీల అనుమతికి ఆలస్యమవుతోంది. ఈ లోగా ధరల్లో మార్పులు వస్తుండటంతో వ్యాపారులు, ఎగుమతిదారుల మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ► గుంటూరు రైల్వే డివిజన్ మిర్చి, అల్లం, ఉల్లి, పసుపు పంటల ఎగుమతికి హైస్పీడ్ పార్శిల్ రైళ్లను ప్రవేశపెడతామని ప్రకటించింది. లారీల కంటే తక్కువ ధర.. ► లారీలకు చెల్లించే సరుకు రవాణా చార్జీల కంటే రైళ్లలో ధరలు తక్కువగా ఉండటంతో వ్యాపారులు హైస్పీడ్ రైళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ► రోడ్డు మార్గం ద్వారా బంగ్లాదేశ్‌కు ఎండు మిర్చి రవాణాకు టన్నుకు రూ.7 వేలు. అదే పార్శిల్ రైళ్ల ద్వారా అయితే రూ.4,608 మాత్రమే. ► ఈ నెల 9 న గుంటూరు నుంచి బంగ్లాదేశ్‌లోని బెనాపోల్‌కు 16 పార్శిల్ వ్యాన్లతో కూడిన పార్శిల్ ఎక్స్‌ప్రెస్‌లో 384 టన్నుల ఎండు మిర్చి ఎగుమతి చేసిన వ్యాపారులు చార్జీలకింద రైల్వేకి రూ.17.60 లక్షలు చెల్లించారు. ► ఇతర రాష్ట్రాలకు బాయిల్డ్ రైస్ ఎగుమతికి ఎఫ్‌సీఐ అధికారులు తమను కలిసినట్టు గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ మోహన్‌రాజా మీడియాకు తెలిపారు. -
మోసపోయాం... ఆదుకోండి
గుంటూరు: గుంటూరుకు చెందిన ఇద్దరు మిర్చి వ్యాపారులు తమను మోసం చేశారంటూ చైనాకు చెందిన గుడాన్ అనే మహిళ బుధవారం అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చైనా, వియత్నాం దేశాల్లో ఓ సంస్థ ద్వారా గుడాన్ మిర్చి వ్యాపారం చేస్తున్నారు. రెండు నెలల కిందట గుంటూరుకు చెందిన బాబు ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన మధుబాబు, సుబ్బారావులు ఆన్లైన్లో గుడాన్‌తో వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్నారు. సుమారు రూ.46 లక్షల విలువజేసే మిర్చిని చైనా, వియత్నాంకు ఎగుమతి చేస్తామని వారు ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. దీంతో ఆమె డబ్బును ఆన్లైన్లోనే చెల్లించారు. తీరా రెండు నెలలు గడిచినా మిర్చిని పంపకపోవడంతో ఈనెల 14న అరండల్‌పేట పరిధిలోని సాలిపేటలో ఉన్న ఆఫీసులో మధుబాబు, సుబ్బారావులను గుడాన్ సంప్రదించారు. దీంతో మధుబాబు, సుబ్బారావులు ఆమెను బెదిరించారు. దీంతో జిల్లా అర్బన్ ఎస్పీ గోపీనాథ్‌జెట్టిని గుడాన్ బుధవారం ఆశ్రయించారు. ఆయన ఆదేశాల మేరకు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఈ కేసును సీసీఎస్ పోలీసులకు బదిలీ చేశారు. గుడాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా గతంలో కూడా చైనాకు చెందిన మరో వ్యక్తిని మధుబాబు, సుబ్బారావులు మోసం చేసినట్లు సమాచారం.