breaking news
chilkur district
-
ఏక్ నిరంజన్.. ఓ ఉపాధ్యాయుడి నిరీక్షణ
చిలుకూరు: ఆ పాఠశాలలో ఇప్పటివరకు ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు ఇంటింటా తిరిగినా ఎవరూ తమ పిల్లలను పాఠశాలకు పంపలేదు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కొమ్మబండ తండా ప్రాథమిక పాఠశాల ప్రారంభంలో విద్యార్థులతో కళకళలాడింది. పదేళ్లుగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. గత విద్యాసంవత్సరం ఈ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. ఆ ముగ్గురు విద్యార్థులు కూడా ఈ ఏడాది ప్రైవేట్ స్కూల్ బాటపట్టారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు లేరని, ఇంగ్లిష్ మీడియంలో చెప్పడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. రోజూ ఉపాధ్యాయుడు రావడం.. పాఠశాల తాళాలు తీయడం.. విద్యార్థుల కోసం ఎదురుచూస్తుండటం సాధారణమైంది. గ్రామంలో మొత్తం 103 ఇళ్లు, 700 జనాభా ఉంది. ఈ గ్రామం నుంచి ఆటోలో ప్రైవేట్ పాఠశాలకు సుమారు 10మంది వరకు వెళ్తారు. మిగిలిన కొందరు విద్యార్థులు జెర్రిపోతులగూడెం ప్రాథమిక పాఠశాలకు వెళ్తున్నారు. ఇది కూడా చదవండి: తెలంగాణలో ఐదు జిల్లాలపై సర్కార్ ఫోకస్.. కార్పొరేషన్లుగా పెద్ద మున్సిపాలిటీలు! -
ప్రైవేటు వ్యక్తితో పిల్లలకు విద్యాబోధన
చిలుకూరు, న్యూస్‌లైన్ : అతను ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. సీనియర్ కావడంతో వేతనమూ ఎక్కువే. రోజూ పాఠశాలకు వెళ్లడం బోర్ కొట్టింది కాబోలు. మండల స్థాయి అధికారులను, తోటి ఉపాధ్యాయులను మచ్చిక చేసుకున్నాడు. ఓ ప్రైవేటు వ్యక్తిని తన స్థానంలో ఉపాధ్యాయుడిగా నియమించాడు. సొంతంగా వేతనం ఇస్తూ పాఠాలు చెప్పిస్తున్నాడు. ఇతను మాత్రం నెలనాడు ప్రభుత్వ వేతనం తీసుకుంటూ విద్యావ్యవస్థను మోసం చేస్తున్నాడు. గ్రామస్తులకు విషయం తెలియడంతో అతని నిర్వాకం బయటికి పొక్కింది. చిలుకూరు మండలం ఆర్లెగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఇందులో ఓ సీనియర్ ఉపాధ్యాయుడి వేతనం అక్షరాల 53వేల రూపాయలు. మండలంలోనే అత్యధిక వేతనం ఇది. ఇంత జీతం తీసుకుంటూ పాఠశాలకు రాడు. మండల అధికారిని, పాఠశాల ఉపాధ్యాయులను మచ్చిక చేసుకున్నాడు. ప్రైవేటు వ్యక్తిని తన స్థానంలో నియమించుకున్నాడు. అతనికి నెలకు రూ.3వేల వేతనం ఇస్తూ విద్యాబోధన చేయిస్తున్నాడు. ఈ వ్యవహారం కొన్ని నెలలుగా సాగుతున్నట్టు తెలిసింది. అందరినీ మచ్చిక చేసుకోవడంతో విషయం బయటికి పొక్కలేదు. ఇటీవల గ్రామస్తులకు ఈ విషయం పూర్తిస్థాయిలో తెలిసింది. దీంతో కొంతమంది శనివారం పాఠశాలకు వెళ్లి ప్రధానోపాధ్యాయుడితో ఘర్షణకు దిగారు. ఉపాధ్యాయుడి నిర్వాకాన్ని కలెక్టర్, డీఈఓ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించి వెళ్లారు. కాగా సదరు ఉపాధ్యాయుడికి గ్రామస్తులు ఘర్షణకు దిగిన విషయం తెలియడంతో వెంటనే చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు పైరవీ చేస్తున్నట్టు సమాచారం. ఎంఈఓ వివరణ ఈ విషయమై ఎంఈఓ ఈశ్వర్రావును వివరణ కోరగా ఆర్లెగూడెం పాఠశాలలో ప్రైవేటుగా వ్యక్తిని నియమించి పాఠాలు బోధించడంతో నిబంధనలకు వ్యతిరేకమని తెలిపారు. దీనిపై గ్రామస్తులు గొడ వ చేసిన మాట వాస్తవమేనన్నారు. వెంటనే సదరు ప్రైవేటు వ్యక్తిని తొలగిస్తామని, ఉపాధ్యాయుడు సోమవారం నుంచి పాఠశాలకు రావాలని చెప్పినట్టు తెలిపారు.