breaking news
chettam rammohan reddy
-
రాజన్నకా.. రామన్నకా ?!
నారాయణపేట : తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనే చర్చ సర్వత్రా సాగుతోంది. గతంలో ఉమ్మడి జిల్లా నుంచి లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావుకు మంత్రి పదవులు దక్కగా ఇందులో కృష్ణారావు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన స్థానంలో మరొకరికే కాకుండా ఉమ్మడి జిల్లా నుంచి ఇంకొకరికి కూడా మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇది పక్కన పెడితే ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో కొత్తగా నారాయణ జిల్లా ఏర్పడనుంది. తాజాగా జరిగిన సమావేశంలో ప్రతీ జిల్లాకు ఓ పదవి ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ సూచనప్రాయంగా వెల్లడించారు. దీంతో నారాయణపేట జిల్లాలో ఉన్న రెండు నియోజవర్గాల ఎమ్మెల్యేల్లో ఎవరికి ఏ పదవి దక్కుతుందన్న ఆసక్తి నెలకొంది. 17 నుంచి అసెంబ్లీ.. మంత్రి వర్గ విస్తరణ ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచాక సీఎంగా కేసీఆర్, రాష్ట్ర హోం శాఖ మంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు తొలి విడత అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా ఆ సమయంలోనే ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇదే క్రమంలో మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుందనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ మేరకు జిల్లాకో పదవి వచ్చేలా చూసేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ మేరకు కొత్తగా ఏర్పడనున్న నారాయణపేట జిల్లా నుంచి ఎవరికి పదవి దక్కుతుందనే అంశంపై చర్చ సాగుతోంది. ఈ జిల్లా పరిధిలో నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాలు ఉండనుండగా.. రెండింట్లోనూ టీఆర్ఎస్కే చెందిన ఎస్.రాజేందర్‌రెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడ్డి విజయం సాధించారు. మంత్రి వర్గంలో ‘పేట’ జిల్లాకు చాన్స్ నూతనంగా ఆవిర్భవించనున్న నారాయణపేట జిల్లా నుంచి నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నా రు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరు విజయం సాధించారు. అయితే, వీరిద్దరు కూడా గత ఎన్నికల్లోనూ గెలిచినా టీడీపీ, కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఇక ప్రజల ఆకాంక్ష మేరకు ఇటీవల ఎన్నికల ప్రచారంలో నారాయణపేటను జిల్లాగా మారుస్తామని చెప్పిన సీఎం కేసీఆర్.. ఆ హామీ మేరకు విజయం సాధించగానే ప్రకటన చేశారు. తాజాగా కొత్త జిల్లాల నుంచి ఎమ్మెల్యేలకు కూడా మంత్రివర్గంతో పాటు పాటు పార్లమెంటరీ కార్యదర్శులు తదితర పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు కేసీఆర్ స్వయంగా ప్రకటించడంతో నారాయణపేట జిల్లా వాసుల్లో ఆశలు చిగురించాయి. ఎవరికి ఆ వరం? నారాయణపేట కొత్త జిల్లాలో మక్తల్, నారాయణపేట నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ రెండు నియోజకవర్గాల నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా చిట్టెం రాంమోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో వీరిద్దరు కూడా మంత్రి వర్గం ఏర్పాటులో తమకు స్థానం దక్కుతుందనే ఆశిస్తున్నారు. ఒకవేళ మంత్రిగా కాకున్నా పార్లమెంట్ సెక్రటరీలుగానైనా అవకాశం వస్తుందనే ధీమాతో ఉన్నారు. నారాయణపేట ప్రజల ఆకాంక్షను కేసీఆర్‌కు వివరించి కొత్త జిల్లా ఏర్పాటులో తమ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి కీలకపాత్ర పోషించినందున ఆయనకు సముచిత స్థానం దక్కుతుందని టీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మక్తల్ నుంచి గెలిచిన రాంమోహన్‌రెడ్డి అనుయాయులు కూడా అదే భావనలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆయన కీలక నేత, సొంత సోదరి అయిన డీకే.అరుణను కాదని కేసీఆర్ మాటను గౌరవవించి టీఆర్ఎస్లో చేరిన నేపథ్యంలో రాంమోహన్‌రెడ్డికి మంచి అవకాశం దక్కుతుందని చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఎవరికి మంత్రి వర్గంలో స్థానం దక్కుతుంది, మరెవరికి పార్లమెంటరీ కార్యదర్శి పదవి దక్కొచ్చు..కొత్త జిల్లా నుంచి ఇద్దరికా లేక ఒకరికే పదవి వరిస్తుందన్న విషయం తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే! -
'ఆ ఇద్దరి ఎమ్మెల్యేల వివాదం వ్యక్తిగతం'
హైదరాబాద్: మహబూబ్‌నగర్‌లో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వివాదం వ్యక్తిగతమైందని పరిశ్రమలు, చక్కెర, చేనేత, జౌళి శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసమే వివాదం చేస్తున్నారని మండిపడ్డారు. గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ తన సోదరుడు ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డిని రక్షించుకునేందుకు యత్నిస్తోందని జూపల్లి విమర్శించారు. ప్రజా సమస్యలు పట్టకుండా రాజకీయ ఉనికి కోసం కాంగ్రెస్ విమర్శలు చేస్తోందని దుయ్యబట్టారు. ఈ వివాదంలో ఇద్దరు నేతలదీ తప్పు ఉందని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి తెలిపారు. కాగా, మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజుల మధ్య వాగ్వివాదం జరిగిన సంగతి తెలిసిందే.