breaking news
Charges of corruption
-
సీఎం పళనిస్వామిపై సీబీఐ విచారణ
చెన్నై: రోడ్డు కాంట్రాక్టు పనుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై సీబీఐ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో చేపట్టిన రూ.3,500 కోట్ల విలువైన కాంట్రాక్టు పనులను ముఖ్యమంత్రి పళనిస్వామి తన బంధువులకు, బినామీలకు అప్పగించారని ఆరోపిస్తూ డీఎంకే నేత ఆర్ఎస్ భారతి గతంలో పిటిషన్ వేశారు. ఈ కేసులో డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్(డీవీఏసీ) అందజేసిన నివేదికను పరిశీలించిన జస్టిస్ ఏడీ జగదీశ్ చంద్ర శుక్రవారం ఈ ఆదేశాలిచ్చారు. దర్యాప్తునకు సంబంధించిన అన్ని పత్రాలను వారంలోగా సీబీఐకి అందజేయాలని డీవీఏసీని ఆదేశిస్తూ.. ప్రాథమిక విచారణ నివేదికను మూడు నెలల్లోగా అందజేయాలని సీబీఐని కోరారు. రాష్ట్రంలో చేపట్టిన రోడ్డు కాంట్రాక్టు పనుల్లో అవకతవకలు జరిగాయనీ, వీటిపై డీవీఏసీ విచారణకు ఆదేశించాలని కోరుతూ డీఎంకే నేత భారతి జూన్లో హైకోర్టులో పిటిషన్ వేశారు. స్పందించిన న్యాయస్థానం.. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని, రోజువారీ నివేదికను అందజేయాలని డీవీఏసీని సెప్టెంబర్ 12వ తేదీన ఆదేశించింది. అయితే, డీవీఏసీ దర్యాప్తు సీఎం పళనిస్వామికి అనుకూలంగా సాగుతోందని ఈనెల 9న జరిగిన విచారణ సందర్భంగా పిటిషనర్ భారతి అనుమానాలు వ్యక్తం చేయడంతో సీబీఐ విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు తాజాగా ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీఎం రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. -
ఆరోపణలు ఉన్న అధికారులకు చెక్!
డీఈవో జాబితాల్లో మార్పులు చేసిన డిప్యూటీ సీఎం కడియం సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారుల (డీఈవో) జాబితాను సోమవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రభుత్వం ఖరారు చేసింది. అవినీతి ఆరోపణలు ఉన్న అధికారులను కీలకమైన జిల్లాల్లో డీఈవోలుగా నియమించేందుకు విద్యాశాఖ ప్రతిపాదించిన జాబితాను ఊటంకిస్తూ సోమవారం ‘ఆరోపణలు ఉన్న వారికి అందలం!’ శీర్షికన సాక్షి ప్రచురించిన కథనంపై కడియం శ్రీహరి స్పందించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కీలకమైన జిల్లాల్లో డీఈవోలుగా నియమించేందుకు ఎలా ప్రతిపాదనలు పంపించారని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. విద్యాశాఖ పంపిన జాబితాలోని జిల్లాల కేటాయింపులకు ఆయన మార్పులు చేశారు. ఆరోపణలు ఉన్న అధికారులకు చెక్ పెడుతూ తాజా జాబితాను రూపొందించి ఆమోదించారు. అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.