breaking news
Chain robbers
-
దొంగలొస్తున్నారు..! జాగ్రత్త..!
దొంగలు.. గొలుసు దొంగలు వస్తున్నారు. జాగ్రత్త.. మహిళలంతా జర జాగ్రత్త. ‘పోలీస్ కమిషనరేట్‌లో ఉన్నాం.. మనకేం భయం..!!’ అనుకుని, ఏమరుపాటుగా... అజాగ్రత్తగా ఉండకండి. ఎందుకంటే... పోలీస్ కమిషనరేట్ పరిధిలో గొలుసు దొంగలు ఎక్కువయ్యారు. గొలుసు దొంగతనాలు పెరిగాయి. లబోదిబోమంటూ రోదిస్తున్న బాధిత మహిళల సంఖ్య పెరుగుతోంది. ప్చ్... దొంగలు మాత్రం పోలీసుల చేతికి చిక్కడం లేదు. అందుకే... పోలీస్ కమిషనరేట్‌లో ఉన్నామనుకుని, మనకేం కాదనుకుని ఏమరుపాటుగా, అజాగ్రత్తగా ఉండొద్దు. ఖమ్మంక్రైం: అది, ఖమ్మం త్రీటౌన్ ప్రాంతంలోని పంపింగ్ వెల్ రోడ్ ప్రాంతం. ఆమె పేరు వాణి. ఒక రోజున మధ్యాహ్నం వేళ బయటి నుంచి ఒంటరిగా నడుచుకుంటూ ఇంటికొచ్చింది. మెష్ డోర్ దగ్గరకు వేసింది. హాల్లో ఏదో పనిలో నిమగ్నమైంది. బెడ్రూంలో ఆమె భర్త నిద్రలో ఉన్నాడు. ఇంతలో, మెష్ డోర్ తీసుకుని ఎవడో లోనికొచ్చాడు. ఆమె గమనించేలోగానే దగ్గరగా వచ్చాడు. కత్తి తీసి ఆమె మెడపై ఆనించాడు. అరిస్తే కోసేస్తానని బెదిరించాడు. చేతిపై గాటు పెట్టాడు. గొలుసు లాక్కున్నాడు. పారిపోయాడు.. మాయమయ్యాడు. అది, ఖమ్మం వన్ టౌన్‌లోని ప్రభాత్ టాకీస్ రోడ్ ప్రాంతం. ఆ దంపతులు ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై ఇద్దరు ఆగంతకులు వెంబడించారు. వీరిని ఆ దంపతులు గమనించలేదు. ఆ ఆగంతకుల వాహనం దగ్గరగా వచ్చింది. ఒకడు, ఆమె మెడలోని గొలుసును లాక్కున్నాడు. ఆ వెన్వెంటనే ఆ వాహనం వాయు వేగంతో అక్కడి నుంచి మాయమైంది. ఆమె కింద పడిపోయింది. ఇది ఇటీవల జరిగింది. అది, ఖమ్మం వన్ టౌన్‌లోని ముస్తాఫానగర్ ప్రాంతం. ఓ వృద్ధురాలు ఒంటరిగా నడుచుకుంటూ వెళుతోంది. ఒకవైపు వయోభారం. మరోవైపు శారీరక అశక్తత. గొలుసు దొంగలు (చైన్ స్నాచర్లు) గమనించారు. ద్విచక్ర వాహనంపై నెమ్మదిగా అనుసరించారు. చుట్టుపక్కల వాతావరణం అనుకూలంగా ఉందనుకున్న క్షణాన, దగ్గరగా వచ్చారు. మెడలోని గొలుసును లాక్కున్నారు. క్షణాల్లో మాయమయ్యారు. మూడు రోజుల కిందట ఇది జరిగింది. అది, ఖమ్మం రూరల్ మండలంలోని బైపాస్ రోడ్ ప్రాంతం. ఓ ఇంట్లోకి ఆగంతకుడు జొరబడ్డాడు. అప్పుడు ఆ ఇంట్లో ఆమె ఒక్కతే ఉంది. ఆమెను బెదిరించి మెడలోని గొలుసును లాక్కున్నాడు. ఈ హఠాత్పరిణామం నుంచి ఆమె బయటపడి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారంతా వచ్చారు. అప్పటికే ఆ దొంగ మాయమయ్యాడు. ఇది నెల క్రితం జరిగింది. దేనికి సూచిక..? పైన ఇచ్చిన నాలుగు ఘటనలు మచ్చుకు కొన్ని మాత్రమే. వీటి నుంచి మనం తెలుసుకోవాల్సింది, గ్రహించాల్సింది ఏమిటంటే... నగరంలో గొలుసు దొంగలు నిర్భయంగా సంచరిస్తున్నారు. ఎంత నిర్భయంగా అంటే... ఏకంగా ఇంట్లోకి జొరబడి, అరిస్తే చంపుతానని బెదిరించి, మెడలోని గొలుసును లాక్కుని పారిపోయేటంత...! పోలీసులు పట్టుకుంటారనిగానీ, జనాలకు దొరికిపోతామనిగానీ ఈ గొలుసు దొంగలు ఏమాత్రం భయపడడం లేదు. పైన ఇచ్చిన నాలుగు ఘటనల్లో ఒక్క దొంగ కూడా అటు పోలీసులకుగానీ, ఇటు జనాలకుగానీ పట్టుబడలేదు. ఒకప్పుడు, గొలుసు దొంగతనాలంటే.. రాత్రి వేళలోనో, నిర్మానుష్య ప్రాంతంలోనో, మహిళలు ఒంటరిగా వెళుతున్నప్పుడో జరుగుతాయని ఇప్పటివరకూ మనకు తెలిసిన విషయం. కానీ, ఏకం గా ఇంట్లోకి జొరబడి గొలుసులు లాక్కెళుతున్నా కూడా పోలీసులు దొరికించుకోలేరని, జనాలు పట్టుకోలేరని దొంగలు ధీమాతో ఉన్నట్టున్నారు. మన కమిషనరేట్ పోలీసుల వైఫల్యానికి, మన మహిళల ఏమరుపాటుకు–అజాగ్రత్తకు, మన జనాలు అప్రమత్తంగా లేరనడానికి ఇవి సూచికలు. ఏమిటి చేయడం...? ‘ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్’ అన్నారు మన పెద్దలు. ‘ఏదేని సమస్య వచ్చిన తరువాత పరిష్కరించుకోవడం కాదు. అసలు ఆ సమస్యనే రాకుండా చూసుకోవడం మేలు’ అనేది దీనర్థం. మన రక్షణ బాధ్యతను మనంగానీ, మనవాళ్లుగానీ, మన చుట్టుపక్కల వాళ్లుగానీ.. ఎవ్వరూ పట్టించుకోకుండా, ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకుం డా.. మన పోలీసులపై భరోసాతో ఉంటే... ఇదిగో, ఇలాగే జరుగుతుంది. ఇకనైనా, ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాలి. గొలుసు దొంగతనాల తీరుపై, దొంగల సంచారంపై అవగాహన పెంచుకోవాలి. తదనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ‘మన అప్రమత్తతమే మనకు రక్ష’ అనే విషయాన్ని సదా గమనంలో ఉంచుకోవాలి. దొంగలొస్తున్నారు... ! జాగ్రత్త..!! -
తెగబడిన గొలుసు దొంగలు
నగరంలో గొలుసు దొంగలు మరో సారి తెగబడ్డారు. శనివారం ఒకే రోజు పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. శుభ కార్యానికి వెళ్లి వస్తుండగా.. కాచిగూడ: భర్తతో కలిసి శుభకార్యానికి హాజరై బైక్‌పై ఇంటికి వెస్తున్న మహిళ మెడలోంచి ఎనిమిదిన్నర తులాల బంగారు గొలుసు గుర్తుతెలియని వ్యక్తులు తెంపుకుపోయిన సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. డీఎస్సై కృష్ణయ్య కథనం మేరకు.. రాంకోఠికి చెందిన స్వర్ణలత (53) శుక్రవారం రాత్రి హిమాయత్‌నగర్‌లో శుభకార్యానికి వెల్లి భర్తతో కలిసి బైక్‌పై ఇంటికి తిరిగివస్తుండగా నారాయణగూడలోని క్రిస్టియన్ శ్మశాన వాటిక సమీపంలో వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలోని ఎనిమిదిన్నర తులాల బంగారు ఆభరణాలను తెంచుకొని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నారాయణగూడ డీఎస్సై కృష్ణయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరికరాలు తెమ్మన్నారని చెప్పి.. జగద్గిరిగుట్ట: పరికరాలు తీసుకురావడానికి వచ్చానని చెప్పి ఓ మహిళ మెడలో నుంచి ఆగంతకుడు రెండు తులాల బంగారు గొలుసు తెంపుకెళ్లిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కుషాల్కర్ కథనం ప్రకారం.. సంజయ్‌పురి కాలనీకి చెందిన జనార్ధన్ టైల్స్ పనులు చేసేవాడు. శనివారం ఉదయం అతని భార్య జయలక్ష్మి ఇంటిపై బట్టలు ఆరేస్తుండగా అక్కడికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి సార్ టైల్స్ వేయడానికి సామాను తీసుకు రావాలని తనను పంపినట్లు చెప్పాడు. దీంతో ఆమె అతని గుర్తించలేదని సార్‌తో ఫోన్లో మాట్లాడించాలని చెప్పడంతో అతను ఫోన్ చేస్తున్నట్లు నటించి ఫోన్ కలవడం లేదని చెప్పాడు. దీంతో జయలక్ష్మి తన సెల్ నుంచి భర్తకు ఫోన్ చేస్తుండగా అతను ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసు, సెల్ఫోన్లను లాక్కుని పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహిళను బెదిరించి.. జియాగూడ: మహిళను బెదిరించి బంగారు ఆభరణాలు దోచుకున్న సంఘటన కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రాంమోహన్‌రావు కథనం ప్రకారం..న్యూ గంగానగర్‌లో మాందాల రమేష్, రాధ దంపతులు నివాసం ఉంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు వారి ఇంటి కాంపౌండ్‌లోకి చొరబడ్డారు. అప్పుడే గదిలో నుంచి బయటకు వచ్చిన రాధను బెదిరించి నోట్లో గుడ్డలు కుక్కి ఆమె మెడలో నుంచి నాలుగు తులాల పుస్తెలతాడు, కమ్మలు, కాలి గొలుసులు ఎత్తుకెళ్లారు. వీటి విలువ రూ.1.20 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గుడికి వెళ్లి వస్తుండగా... బన్సీలాల్‌పేట్: దైవ దర్శనం కోసం వెళ్లి వస్తున్న మహిళ మెడలో నుంచి పుస్తెల తాడు తెంపుకెళ్లిన సంఘటన గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బన్సీలాల్‌పేట్‌కు చెందిన ప్రేమ్‌కుమార్, అతని భార్య శైలజతో కలిసి లోయర్‌ట్యాంక్‌బండ్‌లోని కట్టమైసమ్మ దేవాలయానికి వెళ్లి తిరిగివస్తుండగా జీరా అనాథ శరణాలయం సమీపంలో వెనుక నుంచి బైక్‌పై వచ్చిన దొంగలు శైలజ మెడలోని పుస్తెలతాడు, నల్లపూసల దండను లాక్కొని వెళ్లారు. గాంధీనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. లంబాకు జైలుశిక్ష సాక్షి, సిటీబ్యూరో: జంట పోలీసు కమిషనరేట్ల పరిధిలో దాదాపు 383 బంగారు గొలుసు దొంతనాలకు ప్పాడిన కరుడుగట్టిన చైన్ స్నాచర్ సయ్యద్ హుస్సేన్ అలియాస్ లంబా హుస్సేన్ అలియాస్ లంబాకు నాంపల్లి నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ శనివారం జైలు శిక్ష విధించింది. గత ఏడాది కాచిగూడ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన రెండు చైన్ స్నాచింగ్ కేసుల్లో ఇతడికి ఒక్కో కేసులో ఏడాదిన్నర జైలు శిక్ష విధించినట్లు ఈస్ట్‌జోన్ పోలీసులు తెలిపారు.