breaking news
Central Ministry of Home Affairs
-
తెలంగాణకు మళ్లీ చుక్కెదురు
విద్యుత్ ఉద్యోగుల విభజన సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి మళ్లీ చుక్కెదురైంది. విద్యుత్ ఉద్యోగుల విభజన విభజన చట్టంలోని సెక్షన్ 82 ప్రకారం జరగలేదన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనతో కేంద్ర హోం శాఖ ఏకీభవించింది. ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)ల ఉద్యోగుల విషయంలో విభజనకు పూర్వం, అంటే 2014 జూన్ 1 నాటికి ఉన్న స్థితిని కొనసాగించాల్సిందిగా తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను తాజాగా ఆదేశించింది. కేంద్ర హోం శాఖ డెరైక్టర్ అశుతోష్ జైన్ తాజాగా ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఈ మేరకు లేఖ రాశారు. ఏపీ స్థానికత ఉన్న 1250 మంది ఉద్యోగులను తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలు జూన్ 9న మూకుమ్మడిగా ఏపీకి రిలీవ్ చేయడంతో వివాదం రేకెత్తిన విషయం తెలిసిందే. పుట్టిన ప్రాంతం ఆధారంగా ఉద్యోగులను విభజిస్తూ తెలంగాణ ట్రాన్స్‌కో ఏకపక్షంగా మార్గదర్శకాలు రూపొందించిందని, ఇది విభజన చట్టానికి విరుద్ధమని ఏపీ వాదిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ కూడా రాశారు. దానికి స్పందనగానే కేంద్ర హోంశాఖ తాజాగా రెండు రాష్ట్రాలకు లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు, స్వయంప్రతిపత్తి సంస్థల్లోని ఉద్యోగులను విభజన తర్వాత ఏడాది దాకా ఆయా సంస్థల్లోనే కొనసాగించాలని, వారి కేటాయింపుకు సంబంధించి సదరు సంస్థల పాలకవర్గాలు ఈ లోపు మార్గదర్శకాలు రూపొందించుకోవాలని విభజన చట్టంలోని సెక్షన్ 82 స్పష్టం చేస్తోందని కేంద్ర హోంశాఖ గుర్తు చేసింది. విద్యుత్ సంస్థల పాలక మండళ్లు ఈ నిబంధనను పాటించలేదంది. అవసరమైతే కేంద్రమే జోక్యం చేసుకుని పీఎస్‌యూల ఉద్యోగుల విభజన మార్గదర్శకాలను రూపొదించవచ్చని సెక్షన్ 80 పేర్కొంటోందని ప్రస్తావించింది. పీఎస్‌యూల ఉద్యోగుల కేటాయింపుల్లో మూడు ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించింది. వాటిపై శనివారంలోగా అభిప్రాయాలు తెలపాల్సిందిగా ఇరు రాష్ట్రాలకు సూచించింది. పీఎస్‌యూ ఉద్యోగుల విభజనపై కేంద్రం సూచించిన మూడు ప్రత్యామ్నాయాలు 1) విభజన చట్టంలోని సెక్షన్ 108 ప్రకారం పీఎస్ యూ ఉద్యోగుల విభజన బాధ్యతలను కమల్‌నాథన్ కమిటీకిగానీ, షీలా భిడే కమిటీకి గానీ కేంద్రం అప్పగిస్తుంది 2) మూడు నెలల్లోగా సమస్య పరిష్కారమయ్యేలా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా, ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలి 3) కమల్‌నాథన్ కమిటీ మార్గదర్శకాల ఆధారం గా పీఎస్‌యూల ఉద్యోగులవిభజన మార్గదర్శకాలు రూపొందించాలి. వివాదాలపై నిర్ణయాధికారం ఆ కమిటీకే అప్పగించాలి. ఉద్యోగసంఘాల పిటిషన్లు కొట్టివేత సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన మార్గదర్శకాలకు తెలంగాణ విద్యుత్‌శాఖ ముఖ్య కార్యదర్శి ఆమోదముద్ర వేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను, వాటికి అనుగుణంగా టీఎస్ ట్రాన్స్‌కో చైర్మన్ రూపొందించిన తుది జాబితా అమలును సవాల్ చేస్తూ వ్యాజ్యాలు దాఖలైన విషయం విదితమే. అయితే, వీటిలో తమనూ ప్రతివాదులుగా చేర్చుకోవాలంటూ టీవిద్యుత్ ఉద్యోగుల సంఘం, టీవిద్యుత్ అకౌంట్స్ అధికారుల సం ఘం వేర్వేరుగా దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. వీరి వాదనలు వినాల్సిన అవసరం లేదని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రెడ్డి కాంతారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
రాజధాని కమిటీ’ విధివిధానాలివీ..
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పాటుకు వివిధ ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయాలని.. అన్ని వనరులూ అందుబాటులో ఉండే ప్రాంతాన్ని సూచించాలని కేంద్ర హోంశాఖ సూచించింది. రాజధాని ఎంపిక కోసం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి విధివిధానాలను ఖరారు చేస్తూ హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఎస్.సురేశ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రాజధాని ఎంపికలో కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రం(ఆంధ్రప్రదేశ్) ఏర్పడ్డాక వచ్చే ప్రభుత్వం, పలు ఇతర వర్గాలతో చర్చలు జరిపి వాటి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచిం చారు. పర్యావరణానికి హాని జరగకుండా, తక్కువ ఖర్చుతో నిర్మించేందుకు అనువుగా ఉండాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానించేలా ఉండాలని సూచించారు. విధివిధానాలు ఇవీ.. 1.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏర్పాటుకు విభిన్న ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయాలి. ఏది మేలైన ప్రాంతమవుతుందో సరిపోల్చాలి. దీనిలో భాగంగా అందుబాటులో ఉన్న గణాంకాలు, ఇతర సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అంతేకాకుండా కొత్త రాజధాని ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రం(ఆంధ్రప్రదేశ్) ఏర్పడ్డాక వచ్చే ప్రభుత్వం, పలు ఇతర వర్గాలతో చర్చలు జరిపి వాటి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. 2. రాజధాని ప్రాంతాలను ఎంపిక చేసేందుకు, సిఫారసులు చేసేందుకు ఈ కింది అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఎ) తగినంత భూమి, నీరు, ఇతర సహజవనరుల లభ్యత ఉండాలి. డిగ్రేడెడ్ అటవీ భూమిని డీరిజర్వేషన్ చేసేందుకు వీలు కలిగి ఉండాలి. బి) పెరిగే జనాభాకు అనుగుణంగా పట్టణాభివృద్ధికి తగిన ప్రణాళిక రూపొందించాలి. ముఖ్యంగా రాజ్‌భవన్, అసెంబ్లీ, శాసనమండలి, సచివాలయం, హైకోర్టు, ఆఫీసు కార్యాలయాలు, అతిథి గృహాలు, నివాస భవనాలు, స్టేడియంలు, సమావేశ మందిరా లు, కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్లు, హాస్పిటళ్లు, పాఠశాలలు, కళాశాలలు, శిక్షణసంస్థలు, గ్రంథాలయాలు, మ్యూజియంలు, సినిమా థియేటర్లు, రిక్రియేషన్, పర్యాటక కేంద్రాలు, పార్కులు, మార్కెట్లు.. ఇలా అన్నింటికీ ఆ ప్రణాళికలో చోటుండాలి. సి) రాజధానిగా ఏర్పాటయ్యే ప్రాంతం నుంచి వివిధ జిల్లాలకు, ప్రస్తుత ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌కు, ఇతర నగరాలకు రోడ్డు, రైలు, విమానయాన రవాణా వ్యవస్థ కలిగి ఉండాలి. అలాగే రాజధానిగా ఏర్పాటయ్యే నగరంలో ర్యాపిడ్ మాస్ ట్రాన్సిట్ సిస్టమ్‌ను వృద్ధిపరిచేందుకు అవకాశం ఉండాలి. డి) ఈ ప్రాంతంలోని ఇతర ప్రముఖ నగరాలను అనుసంధానం చేస్తూ ఆర్థిక, సామాజిక, సాంస్కృతికపరమైన మౌలిక వసతులను అభివృద్ధిపరిచేందుకు అవకాశాలను అంచనావేయడం కమిటీ సిఫారసులు చేసేటప్పుడు ఈ కింది అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.. ఎ) ప్రస్తుతం ఉనికిలో ఉన్న వ్యవసాయ క్షేత్రాలు తొలగించకుండా చూడాలి. అలా చేపట్టాల్సి వస్తే అది చివరి ప్రత్యామ్నాయమే కావాలి. అలాగే ప్రజలను, ప్రజావాసాలను కూడా తరలించేలా ఉండకూడదు. అలా జరిగినా అది నామమాత్రమే కావాలి. బి) నీటి వనరులు సహా ఇతర స్థానిక పర్యావరణానికి ఏ మాత్రం హాని కలుగరాదు సి) ఘనీభవ, ద్రవీభవ కాలుష్యాలను అరికట్టేందుకు వేస్ట్ మేనేజ్మెంట్ను ఫోకస్ చేస్తూ పర్యావరణ అనుకూలమైన సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. డి) తుపాన్లు, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలపై అంచనా ఉండాలి. ఇ) నిర్మాణ వ్యయం, భూసేకరణకు ఖర్చు తక్కువయ్యేందుకు గల అవకాశాలను అంచనా వేయాలి.