breaking news
cent land scam
-
‘అవినీతి సెంటు’ నుంచి తప్పించుకునేదెలా?
‘సాక్షి’ కథనాలతో అధికార పార్టీ నేతల్లో కలవరం రైతులు నిలదీయడంతో అనంతవరం సీఆర్డీఏ కార్యాలయానికి తాళం భూ కుంభకోణం వాస్తవమేనన్న టీడీపీలోని ఓ వర్గం నేతలు సాక్షి, అమరావతి బ్యూరో: ఏపీ రాజధాని గ్రామాల్లో అవినీతి ‘సెంటు’ నుంచి తప్పించుకునేందుకు అధికార పార్టీ నేతలు, కొందరు సీఆర్డీఏ అధికారులు నానా తంటాలు పడుతున్నారు. భూ కబ్జాపై ‘సాక్షి’ పత్రిక తప్పుడు కథనాలు రాసిందని చెప్పడానికి టీడీపీ నేతలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా రెండ్రోజులుగా విలేకరుల సమావేశం అని చెప్పి రద్దు చేసుకుంటున్నారు. ఇదిలాఉంటే ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం రాత్రి వరకు తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయంలో అధికారులు రికార్డులతో కుస్తీ పడుతున్నారు. అనంతవరంలో సెంట్ల చొప్పున భూదోపిడీపై ‘సాక్షి’కి పక్కా ఆధారాలు ఎలా దొరికాయి? ఎవరి చ్చారు? అనే దానిపై టీడీపీ నేతలు విచారణ చేపట్టారు. మా భూమి ఎలా మాయమైంది? రాజధాని అమరావతి పరిధిలోని అనంతవరంలో భూ కుంభకోణంపై ‘సాక్షి’ పక్కా ఆధారాలతో వరుస కథనాలను ప్రచురించిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ నేతలు ‘సాక్షి’ ప్రతినిధులను బెదిరించడం, గ్రామస్తులను భయపెట్టడం వంటి చర్యలకు దిగారు. పత్రికలో వచ్చిన కథనాలు అవాస్తవం... తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు గానీ వాటిని బయటపెట్టడం లేదు. మరోవైపు సోమవారం ఉదయం సీఆర్డీఏ కార్యాలయానికి వచ్చిన అధికారులను గ్రామస్తులు చుట్టుముట్టారు. తమ భూమిలో నుంచి సెంట్ల చొప్పున స్థలం ఎలా మాయమైందని నిలదీశారు. అధికారులు ఏం సమాధానం చెప్పాలో తెలియక కార్యాలయానికి తాళం వేసుకుని వెళ్లిపోయారు. రైతులకు అన్యాయం జరిగితే సహించం రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ సహించలేక టీడీపీలోని ఓ వర్గం ప్రభుత్వ తీరును తప్పుబడుతోంది. భూ కుంభకోణంపై ‘సాక్షి’లో వచ్చిన కథనాలు వాస్తవమేనని ఆ వర్గం నేతలు స్పష్టం చేశారు. పొరపాట్లు ఉంటే సవరించుకుంటాం ‘‘100 రెవెన్యూ రికార్డులను పరిశీలించి భూ యజమానులను గుర్తించాం. ఫారం 9(1) ఇచ్చిన రైతుల భూముల వివరాలు, సర్వేలో వెల్లడైన భూముల వివరాలు ఒకేలా ఉండకపోవచ్చు. ఎక్కడైనా పొరపాట్లు ఉంటే సవరించుకుంటాం. సర్వే నంబర్ 270లో ఆరుగురు రైతులకు కలిపి 15 ఎకరాల 94 సెంట్లు పొలం ఉందన్నారు. వీరిలో బండల వెంకాయమ్మ అనే మహిళా రైతు 3 ఎకరాల 74 సెంట్లు సీఆర్డీఏకు ఇచ్చింది. అయితే సీఆర్డీఏ నిర్వహించిన సర్వేలో 3 ఎకరాల 39 సెంట్లు మాత్రమే ఉన్నట్టు తేలింది. ఈటీఎస్ ద్వారా సర్వే నిర్వహించగా 3 ఎకరాల 42 సెంట్లు ఉన్నట్లు తేలింది. దీంతో అందరికీ లెక్క సరిపోయింది. వెంకాయమ్మ ఇచ్చింది 3 ఎకరాల 74 సెంట్లు. డాక్యుమెంట్ల ప్రకారం అయితే సర్వే నంబర్లో ఉన్న 15 ఎకరాల 94 సెంట్లకు మరో 32 సెంట్లు అదనంగా చేర్చాల్సి ఉంది. ఈ అదనపు భూమిని సీఆర్డీఏ ఎక్కడ నుంచి తేవాలి? జమ్మిగుంపుల పద్మజ సర్వేనంబర్ 114 లో 1.95 ఎకరాలు ఉన్నట్టు చూపగా ఎకరం 90 సెంట్లకు సెటిల్ చేశాం. నెల్లూరి రావమ్మ సర్వేనెంబర్ 119/బిలో 1.99 సెంట్లు చూపగా 1.90 సెంట్లకు సెటిల్ చేశాం. గొరిజాల అరుణకు 1.17 ఎకరాలు చూపగా ఎకరానికి సెటిల్ చేశాం. పోలు భూ దేవయ్య సర్వే నెంబర్ 81/1 లో 1. 13 ఎకరాలు ఉన్నట్టు చూపినా ఆయన వద్ద కేవలం 40 సెంట్లకు మాత్రమే డాక్యుమెంట్ ఉంది. సర్వేనంబర్ 100ఈలో బండల సూరిబాబుకు 36 సెంట్లు ఉన్నా 8 సెంట్లే ఉన్నట్లు సీఆర్డీఏ అధికారులు తప్పుడు సర్టిఫికెట్ ఇవ్వడంపై విచారణ చేస్తాం’’ – చెన్నకేశవులు, సీఆర్డీఏ డిప్యూటీ కమిషనర్ -
రెండేళ్ల క్రితమే ‘సెంటు’ స్కెచ్
అనంతవరం భూముల్లో అంతులేని అవినీతి గుట్టుచప్పుడు కాకుండా రికార్డులు తారుమారు కైంకర్యం చేసిన భూములు అమ్మేశారు ‘సాక్షి’ కథనంతో బైటకొస్తున్న మరింతమంది బాధితులు రాజధాని రైతుల నుంచి ఫోన్ల వెల్లువ అన్యాయమైపోయాం.. ఆదుకోవాలంటూ వేడుకోలు టీడీపీ నాయకులు, సీఆర్డీఏ అధికారుల అక్రమాలపై ఆందోళన న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు కదులుతున్న రైతులు సాక్షి, అమరావతి బ్యూరో: ఏపీ రాజధాని గ్రామాల్లో ఒకటైన అనంతవరంలో భూములను భోంచేసే ‘పథకం’ ఈనాటిది కాదు. రాజధాని ప్రకటన నాటి నుంచే పథకం పన్నారు. ఎవరికీ అనుమానం రాకుండా గుట్టుచప్పుడు కాకుండా సెంట్ల రూపంలో పెద్ద ఎత్తున భూములను మింగేశారు. రికార్డుల్లో తారుమారు చేసిన భూములను సైతం కొందరు అమ్మి సొమ్ము చేసుకున్నారు. ‘సాక్షి’ కథనంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకొచ్చి తమకు జరిగిన అన్యాయంపై గొంతెత్తుతున్నారు. రెండేళ్ల నుంచి సీఆర్డీఏ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని, పత్రికలకు ఎక్కితే కేసులుపెట్టి జైల్లో పెడతామని బెదిరించారని వారు చెబుతున్నారు. అంతేకాదు భూ అక్రమాలపై రాజధాని పరిధిలోని పలు గ్రామాల నుంచి బాధితులు ‘సాక్షి’ ప్రతినిధులకు ఫోన్లు చేసి అనంతవరం తరహాలోనే తమకూ అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని కోరుతున్నారు. సీఆర్డీఏ అధికారులు, టీడీపీ నేతలు చేస్తున్న అక్రమాలకు నిరసనగా రైతులంతా చేతులు కలుపుతున్నారు. అనంతవరం గ్రామంలో సుమారు 50 ఎకరాల భూమిని సర్కారు పెద్దలు మింగేశారు. గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఆక్రమణలను చూసి మనస్తాపంతో ఇదే గ్రామానికి చెందిన రాంబాబు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దాంతో ఈ భూ దందా ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ అవినీతి సెంట్ల వ్యవహారంపై ‘సాక్షి’ తీగలాగటంతో డొంకంతా కదులుతోంది. అవినీతికి పాల్పడి.. పైగా రైతులకు బెదిరింపులు రాజధాని నిర్మాణం పేరుతో అనంతవరం గ్రామంలోని 1,963 మంది రైతుల నుంచి రాష్ట్రప్రభుత్వం భూ సమీకరణ ద్వారా 2,523 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. ఇపుడు అధికార పార్టీ నేతలు రైతులకు నష్టపరిహారం కింద చెల్లించే ప్లాట్లు, కౌలుపై కన్నేశారు. గ్రామానికి చెందిన అనేక మంది రైతుల భూములను సెంట్ల రూపంలో కొట్టేశారు. తమకు జరిగిన అన్యాయంపై అధికారులను కలసి రైతులు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. పైగా తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. నోరెత్తితే కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తామని బెదిరిస్తున్నారు. రాంబాబు అనే వ్యక్తి మాత్రం బైటకొచ్చి తనకున్న 47 సెంట్లలో 3 సెంట్లు మాయం చేశారంటూ సీఆర్డీఏ అధికారులను ఆశ్రయించారు. ఆ 3 సెంట్లకు సంబంధించి కౌలు చెల్లిస్తాం, ఎవ్వరికీ చెప్పొద్దని సీఆర్డీఏ అధికారులు రాజీ చేసే ప్రయత్నం చేశారు. తనకు కౌలుతో పాటు 3 సెంట్ల భూమి కూడా రికార్డుల్లో చేర్చాలని రాంబాబు డిమాండ్ చేశారు. అయితే అధికారులు అంగీకరించకపోవటంతో తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయం ఎదుట రాంబాబు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఇది తెలుసుకున్న రాజధాని గ్రామాల రైతులు తమ రికార్డులను తెప్పించుకుని చూశారు. అనంతవరంతో పాటు రాయపూడి, వెంకటపాలెం, బోరుపాలెం, అబ్బురాజుపాలెం, దొండపాడు, పెనుమాక, కృష్ణాయపాలెం, ఐనవోలు, ఉద్దండరాయునిపాలెం గ్రామాల్లోనూ రైతుల భూముల్లో నుంచి సెంట్లు చొప్పున భూములు మాయమయ్యాయని తెలుస్తోంది. సాక్షిలో ఆదివారం ‘రాజధాని గ్రామాల్లో అవి నీతి సెంటు’ శీర్షికన వచ్చిన కథనం చూసి రైతులంతా ఫోన్లు చేస్తున్నారు. తమ భూమిలో నుంచి కూడా కొంత భూమిని మాయం చేశారని, న్యాయం చేయాలని కోరుతున్నారు. మళ్లీ రికార్డుల తారుమారు రాజధానికి రైతులు ఇచ్చిన భూముల్లో సెంట్ల చొప్పున తగ్గించిన వ్యవహారంపై ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనాలతో ఉలిక్కిపడ్డ టీడీపీ నాయకుడొకరు ఆదివారం రాత్రి రికార్డులను తారుమారు చేశారు. అనంతవరం గ్రామానికి చెందిన పారా సీతారామయ్య పేరున సర్వే నంబర్ 287లో 82 సెంట్లు ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చినట్లు గతంలో రికార్డులు సృష్టించారు. అయితే ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనాలతో అదే 287 సర్వే నంబర్లో నాదెండ్ల పద్మావతి పేరు చేర్చారు. ఆమె సీఆర్డీఏకు 282 సెంట్లు ఇచ్చినట్లు రికార్డులు తారుమారు చేశారు. అలాగే 237/1లో పారా సామ్రాజ్యం 20 సెంట్లు ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చినట్లు గతంలో మార్పులు చేశారు. సాక్షి కథనాలతో సీఆర్డీఏ వెబ్సైట్లో ఉన్న పారా సామ్రాజ్యం పేరును తొలగించి ఇతరులు అని చేర్పించారు. పారా సీతారామయ్య కుమారుడు రాజధాని కమిటీలో సభ్యుడు కావడం గమనార్హం. కాగా పస్తుతం ‘సాక్షి’ వద్ద ఉన్న రికార్డులు తప్పు అని చూపించి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తారుమారు చేసి కొట్టేసిన భూములు అమ్మేశారు యడ్లూరి సాంబశివరావుకు సర్వే నంబర్ 100ఈలో 1.24 ఎకరాల భూమి ఉంది. అందులో నుంచి 44 సెంట్ల భూమి మాయమైంది. అదే భూమిని స్థానిక టీడీపీ నాయకులు నలుగురు కలసి ఉప్పాల జ్ఞానేశ్వరికి అమ్మి సొమ్ము చేసుకున్నారు. అదే విధంగా కొమ్మినేని శ్రీనివాసరావుకు చెందిన 2.64 ఎకరాల్లో నుంచి 25 సెంట్లు మాయం చేసి గుంటూరు జిల్లా రాజోలుకు చెందిన వెంకటేశ్వర్లుకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. చందోలు పూర్ణచంద్రరావుకు 120ఎ లో 1.88 సెంట్లు భూమి ఉంది. అందులో 11 సెంట్లను మాయం చేసి వేరొకరికి కట్టబెట్టినట్లు పూర్ణచంద్రరావు ఆరోపించారు. సుంకర విజయకుమారి, గోపిదేశి మీరాకుమారితో పాటు పలువురు గ్రామస్తులంతా ‘సాక్షి’ ప్రతినిధులకు రికార్డులను చూపించి సీఆర్డీఏ, రెవెన్యూ, స్థానిక టీడీపీ నేతలు చేసిన దారుణాలను వివరించారు. ఈ భూములను మాయం చేసి వేరొకరికి అప్పగించేందుకు రైతుల పేర్లు, వేలిముద్రలను ఫోర్జరీ చేసినట్లు యర్రా వెంకాయమ్మ ఆరోపించారు. ఇదిలా ఉంటే శాఖమూరులో సర్వే నంబర్ 86/ఏలో 2.40 ఎకరాల భూమిని 1972లో 44 మంది దళిత గిరిజన కుటుంబాలకు 4 సెంట్లు పంపిణీ చేశారు. ఈ మొత్తం భూమిని గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడొకరు గుట్టుచప్పుడు కాకుండా ల్యాండ్‌పూలింగ్‌కు ఇచ్చేశారు. రాయపూడిలో 140 మంది రైతుల భూముల నుంచి కొంత భూమి మాయం చేసినట్లు ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. రాజధాని గ్రామాల నుంచి అనేక మంది బాధితులు బయటకు వస్తున్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించటానికి సిద్ధమవుతున్నారు.