breaking news
cash demands
-
జడ్జినే బెదిరించాడు!
జైపూర్: మార్ఫ్డ్ ఫొటోలను పంపి రూ.20 లక్షలివ్వకుంటే వాటిని బయటపెడతామంటూ మహిళా జడ్జిని బెదిరించిన ఘటన రాజస్తాన్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఆగంతకుడి కోసం పోలీసులు వేట ప్రారంభించారు. రాష్ట్రానికి చెందిన ఓ మహిళా జడ్జికి ఫిబ్రవరి 7న ఒక పార్సిల్ వచ్చింది. జడ్జి పిల్లలు చదివే స్కూలు నుంచి వచ్చిందంటూ ఓ అగంతకుడు పార్సిల్‌ను కోర్టు స్టెనోగ్రాఫర్‌కు ఇచ్చాడు. పేరు అడగ్గా చెప్పకుండానే వెళ్లిపోయాడు. ఆ పార్సిల్లో కొన్ని స్వీట్లతోపాటు అభ్యంతరకరంగా ఉన్న జడ్జి ఫొటోలు కనిపించాయి. రూ.20 లక్షలు ఇవ్వకుంటే ఆ ఫొటోలను ఆన్లైన్లో పెట్టి పరువు తీస్తాననే హెచ్చరికతో కూడిన ఉత్తరం ఉంది. జడ్జి చాంబర్‌లోని సీసీ కెమెరాలో ఓ 20 ఏళ్ల యువకుడు పార్సిల్ తెచ్చినట్లుగా రికార్డయింది. మరో 20 రోజుల తర్వాత జడ్జి ఇంటికి మళ్లీ ఒక పార్సిల్ వచ్చింది. ‘రూ.20 లక్షలు సిద్ధంగా ఉంచు. సమయం, ప్రాంతం త్వరలోనే చెబుతా’అంటూ లేఖ ఉంది. బాధిత న్యాయమూర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫిబ్రవరి 28వ తేదీన కేసు నమోదు చేశారు. ఆగంతకుడిని గుర్తించామని, అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
కాన్పుల్లో కాసుల వేట
– ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్లకే ప్రాధాన్యత – డబ్బు సంపాదనే లక్ష్యం - చూసీచూడనట్లు వైద్య, ఆరోగ్య శాఖ 61,194 : గత ఏడాది జిల్లాలో జరిగిన ప్రసవాలు 34,262 : ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేసిన ప్రసవాలు 4440 : ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగిన సిజేరియన్లు 17,181 : ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేసిన సిజేరియన్లు రూ.25,000–రూ.35000 : ఒక్కో సిజేరియన్‌కు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వేస్తున్న బిల్లు అనంతపురం మెడికల్ : తల్లి పడే ప్రసవ వేదన ఆమెకు పునర్జన్మతో సమానం. మాతృమూర్తుల ఆశలకు ఊపిరిపోయాల్సిన ఆస్పత్రులు కాసుల కోసం కక్కుర్తి పడుతున్నాయి. సుఖ ప్రసవం అయ్యేందుకు అవకాశం ఉన్నా లేనిపోని సాకులు చెప్పి శస్త్ర చికిత్స చేస్తున్నాయి. ఫలితంగా జిల్లాలో సిజేరియన్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. జిల్లాలో అనంతపురం బోధనాస్పత్రి, హిందూపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి, రెండు ఏరియా ఆస్పత్రులు, 15 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 80 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఆయా ఆస్పత్రుల్లో కచ్చితంగా ప్రసవాలు చేయాలని ప్రభుత్వం లక్ష్యాలను సైతం నిర్దేశించింది. కానీ మెజార్టీ ఆస్పత్రుల్లో అరకొరగా ప్రసవాలు జరుగుతున్నాయి. సాక్షాత్తూ వైద్య, ఆరోగ్యశాఖ గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2016–17 సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 61,194 ప్రసవాలు జరిగాయి. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 26,284, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 34,262, ఇంటి వద్ద 648 ప్రసవాలు జరిగాయి. ప్రైవేట్‌లో సిజేరియన్‌కే ప్రాధాన్యం ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యం ఇస్తుండగా.. ప్రైవేట్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఏడాది కాలంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 4,440 సిజేరియన్లు జరగ్గా .. అదే ప్రైవేట్‌లో ఏకంగా 17,181 సిజేరియన్లు చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ‘బిడ్డ అడ్డం తిరిగింది..పేగు మెడలో వేసుకుంది..ఉమ్మనీరు తాగింది’ అంటూ భయాందోళన సృష్టించి ‘సిజేరియన్’కు మార్గం సుగమం చేసుకుంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిబంధన ప్రకారం ఆస్పత్రి పరిధిలో జరిగే ప్రసవాల్లో శస్త్ర చికిత్స ద్వారా 15 శాతానికి మించడానికి వీల్లేదు. కానీ జిల్లాలో ఈ పరిస్థితి లేదు. రూ.కోట్లలో దోపిడీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల లేమి.. అక్కడి వైద్యంపై సందేహంతో చాలా మంది ప్రైవేట్ ఆస్పత్రుల వైపు మొగ్గుచూపుతున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు ప్రసవాలను సైతం వ్యాపారంగా మార్చేస్తున్నారు. సిజేరియన్‌కు రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు గుంజుతున్నారు. సాధారణ ప్రసవం కావడానికి అవకాశం ఉన్నా ఏదో సాకు చెప్పి ‘కోత’ కోస్తున్నారన్న విమర్శలున్నాయి. జిల్లాలో రోజుకు సగటున 170 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 93 వరకు అవుతుండగా.. ఇందులో 50 వరకు సిజేరియన్లే కావడం గమనార్హం. సిజేరియన్ల పేరుతో ఏటా రూ.45 కోట్ల నుంచి రూ.50 కోట్లు దండుకుంటున్నారు. కేవలం ఆదాయం కోసమే కొన్ని ఆస్పత్రుల్లో శస్త్ర చికిత్సలు చేస్తున్న దారుణ పరిస్థితులు ఉన్నాయి. దీనిపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. కనీసం ఆయా ఆస్పత్రుల్లో రికార్డులు పరిశీలిస్తున్న దాఖలాలు కూడా లేవు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు పెంచాలని ప్రభుత్వం స్పష్టంగా చెబుతున్నా అధికారుల చెవికెక్కడం లేదు. గర్భిణులను ప్రభుత్వ ఆస్పత్రులకు రప్పించలేకపోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన మహిళలకు ప్రోత్సాహకాలు, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలకు నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నా పరిస్థితిలో మార్పు రాకపోవడం అధికారుల పనితీరును ప్రశ్నిస్తోంది.