breaking news
bussiness peoples also cooperated for bandh
-
బంద్ సంపూర్ణం
-
బంద్ సంపూర్ణం
మూతపడిన విద్య, వాణిజ్య, వ్యాపార సంస్థలు జిల్లా వ్యాప్తంగా కదంతొక్కిన వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు రహదారులపై రాస్తారోకో.... ఎక్కడికక్కడ నిలిచిన వాహనాలు మంత్రి కన్నా ఇల్లు ముట్టడి సాక్షి ప్రతినిధి, గుంటూరు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా బుధవారం జిల్లా బంద్ సంపూర్ణంగా జరి గింది. వైఎస్సార్ కాంగ్రెస్‌తోపాటు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల పిలుపునకు స్పందించిన విద్య,వాణిజ్య, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు కూడా పనిచేయలేదు. ఉద్యోగులు విధులు బహిష్కరించి బంద్ లో పాల్గొన్నారు. బంద్ సందర్భంగా జిల్లావ్యాప్తంగా ప్రదర్శనలు, రాస్తారోకోలు. ద్విచక్రవాహనాల ర్యాలీలు జరిగాయి. జిల్లాలోని అన్ని బస్టాండ్ సెంటర్లకు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు ఉదయం 6 గంటల్లోపే చేరుకుని బస్‌ల రాకపోకలను నిలువరించారు. ప్రైవేట్ బస్‌ల టైర్లలోని గాలి తీసి వాటి రాకపోకలను అడ్డుకున్నారు. గుంటూరులో వైఎస్సార్ సీపీ సిటీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గ కన్వీనర్లు నసీర్ అహ్మద్, షౌకత్, పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో ఉదయమే బస్టాండ్‌కు చేరుకుని ఆర్టీసీ బస్‌ల రాకపోకలను నిలిపివేశారు. అరండల్‌పేటలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. అరండల్‌పేటలో ప్రారంభమైన ప్రదర్శన శంకర్‌విలాస్, హిందూ కళాశాల కూడలి, కలెక్టర్ కార్యాలయం, నగరంపాలెం, పట్టాభిపురం, చేబ్రోలు హనుమయ్య కంపెనీ మీదుగా బృందావన్గార్డెన్స్, లాడ్జిసెంటర్‌ల మీదుగా సాగింది. చిలకలూరిపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ప్రదర్శన జరిగింది. ఉదయమే బస్టాండ్‌కు చేరుకుని కార్యకర్తల సహాయంతో బస్‌ల రాకపోకలను నిలువరించారు. పట్టణ ప్రధాన రహదారులపై రాస్తారోకో నిర్వహించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పార్టీ సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆధ్వర్యంలో మంగళగిరిలో బంద్ విజయవంతంగా జరిగింది. పార్టీ కార్యాలయం నుంచి కార్యకర్తలు, నాయకులు ప్రదర్శనగా బయలుదేరి జాతీయ రహదారికి చేరుకున్నారు. ఈ సందర్భంగానే అక్కడ రాస్తారోకో నిర్వహించారు. బస్‌లు, లారీలు అధిక సంఖ్యలో నిలిచిపోయాయి. సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటే ఇందుకు టీడీపీ, బిజేపీ సహకరించాయని ఆర్కె ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరే మొదటి నుంచి సమైక్యాంధ్ర కోసం పోరాటం చేశారని పేర్కొన్నారు. పొన్నూరులో పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు రావి వెంకట రమణ ఆధ్వర్యంలో మండల కన్వీనర్లు, ఇతర నాయకులు ప్రదర్శన నిర్వహించారు. బాపట్లలో నియోజకవర్గ సమన్వయకర్త కోన రఘుపతి పార్టీ కార్యాలయం నుంచి నాయకులు,కార్యకర్తలతో కలసి జాతీయ రహదారి వరకు ప్రదర్శనగా చేరుకుని వాహనాల రాకపోకలను నిలువరించారు. తెనాలి నియోజకవర్గంలో గుంటూరు జిల్లా ఎన్నికల పరిశీలకులు గుదిబండి చిన వెంకటరెడ్డి, సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, కిలారి రోశయ్యలు పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. టీడీపీ ఆధ్వర్యంలో గుంటూరులో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు, అర్బన్ అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాసరావు, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు మల్లి ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇంటిని ముట్టడించారు.