క్షణ క్షణం.. భయం భయం..
                  
	=శిథిలావస్థలో తరగతి గదులు  
	=కూల్చేయాలంటూ ఏడునెలల కిందట ఉత్తర్వులు 
	= అయినా పట్టించుకోని అధికారులు  
	= చాలా చోట్ల అవే గదుల్లో తరగతుల నిర్వహణ 
	అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అనుక్షణం భయపడుతూ తరగతి గదుల్లో కూర్చోవాల్సి వస్తోంది. ఏ క్షణంలో పైపెచ్చులు మీదపడతాయో తెలియని పరిస్థితి. ఉపాధ్యాయులు కూడా బిక్కుబిక్కుమంటూనే పాఠాలు చెబుతున్నారు.  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో విధిలేని పరిస్థితిలో కూలడానికి సిద్ధంగా ఉన్న గదుల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారమే 517 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో  751 తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. అనధికారికంగా  ఈ సంఖ్య మరింత ఎక్కువగా  ఉంటుంది. గదుల దుస్థితి చూసి పిల్లలను బడికి పంపాలంటేనే తల్లిదండ్రులు వెనకడుగు వేస్తున్నారు. ఈ విషయం అధికారులు,  ప్రజాప్రతినిధులకూ తెలుసు. అయినా ఎవరూ  పట్టించుకోవడం లేదు. ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయడం మినహా ముందస్తు చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. పాఠశాల్లో గుర్తించిన 751 శిథిల గదులను వెంటనే కూల్చేయాలని సర్వశిక్ష అభియాన్  (ఎస్ఎస్ఏ) ప్రాజెక్ట్ రాష్ట్ర అధికారులు ఎనిమిది నెలల కిందట ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంలో ఎంతమాత్రమూ నిర్లక్ష్యం చేయొద్దంటూ స్పష్టంగా పేర్కొన్నారు. అయితే.. ఇప్పటిదాకా  76 గదులను మాత్రమే పడగొట్టామని అధికారులు చెబుతున్నారు. వారి లెక్కల ప్రకారమే ఇంకా 675 గదులు కూల్చేయాల్సి ఉంది. దీనిపై ఎస్ఎస్ఏ అధికారులు ఎంఈఓలు, ఎంపీడీఓలకు ఉత్తర్వులిచ్చారు. అయినా వారిలో చలనం లేదు.   
	 
	అదనపు గదుల మంజూరులో కోత 
	అదనపు తరగతి గదుల మంజూరులో ప్రభుత్వం  ఏడాదికేడాది కోత విధిస్తోంది. 2016–17 విద్యా సంవత్సరంలో రూ.41.56 కోట్లతో 534  గదులు కావాలని జిల్లా అధికారులు  ప్రతిపాదనలు పంపారు. 55 మాత్రమే మంజూరు చేసింది. వీటికోసం రూ.4.82 కోట్లు కేటాయించింది. అది కూడా విద్యా సంవత్సరం ముగింపు దశలో నిధులు కేటాయించడంతో ఇప్పటికి 36 గదులు నిర్మాణదశలో ఉన్నాయి. మిగిలినవి ప్రారంభం కాలేదు. ఇక 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.79.81 కోట్లతో 962 అదనపు తరగతి గదులు మంజూరు చేయాలని జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపారు.  
	 
	దురదృష్టకరం
	శిథిలావస్థకు చేరుకున్న తరగతి గదులను కూల్చేయాలని మేం స్పష్టంగా చెప్పాం. మండలాల వారీగా జాబితాలు కూడా పంపాం. ఇప్పటిదాకా  76 గదులు మాత్రమే కూల్చేశారు. ఇది దురదృష్టకరం. 
	   – విజయశేఖర్, ఎస్ఎస్ఏ ఈఈ