breaking news
British Agent
-
నగరంలో అమెరికన్ ‘జేమ్స్‌బాండ్’లు
సాక్షి, హైదరాబాద్: జేమ్స్‌బాండ్.. ఈ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బ్రిటిష్ సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్‌గా హాలీవుడ్ సినిమాలతో జేమ్స్‌బాండ్ బాగా పాపులర్. అయితే బ్రిటిష్ ఏజెంట్లు కాదుగానీ.. అమెరికా ‘జేమ్స్‌బాండ్’లు మాత్రం ఇప్పుడు హైదరాబాద్‌లో సంచరిస్తున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తిరుగుతూ అక్కడి పరిస్థితులపై ‘నిఘా’పెట్టారు. ఎప్పటికప్పుడు సేకరించిన సమాచారాన్ని అమెరికా భద్రతా విభాగాలకు చేరవేస్తున్నారు. ఇదంతా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా హైదరాబాద్ పర్యటన కోసమే. ఈ నెల 28 నుంచి హైదరాబాద్‌లో జరుగనున్న సదస్సులో ఆమె పాల్గొంటున్న విషయం తెలిసిందే. దీంతో ముందస్తుగా అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఇక్కడికి వచ్చి పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఎవరెవరు.. ఏమేంటి? ఇవాంకా పర్యటనలో ఎక్కడెక్కడకు వెళతారు? ఎవరెవరు ఆమెను కలుస్తారు? వారి నేపథ్యం ఏంటి? వారికున్న భద్రత, సామాజిక స్థాయి ఏమిటి? వంటి వివరాలన్నింటినీ అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు రహస్యంగా సేకరిస్తున్నారు. సాధారణ విదేశీ పర్యటకులుగా వచ్చిన ఆ ఏజెంట్లు.. ఇవాంకా పర్యటించే ప్రాంతాలు, అక్కడి పరిస్థితులు, రోడ్‌మ్యాప్, ఇక్కడి పోలీసులు చేపడుతున్న భద్రతా వ్యవహారాలు.. తదితర అంశాలనూ క్షుణ్నంగా పరిశీలించి అమెరికా భద్రతా విభాగాలకు పంపిస్తున్నట్లు సమాచారం. నెల కిత్రమే నగరానికి.. 15 మంది అమెరికన్ ‘జేమ్స్‌బాండ్’లు నెల రోజుల కిందే హైదరాబాద్‌కు వచ్చి.. పని మొదలుపెట్టినట్లు కేంద్ర నిఘా వర్గాల ద్వారా తెలిసింది. ప్రధాని మోదీని కూడా ఎవరు కలుస్తారు, ఇవాంకా పాల్గొనే సదస్సులో వేదిక మీద ఉండే వాళ్లు ఎవరు, వారి పూర్తి వివరాలేమిటి అనే అంశాలతోపాటు చార్మినార్, ఫలక్‌నుమా ప్యాలెస్ ప్రాంతాలు, అక్కడి నిర్వాహకులెవరనే సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. ఈ నిఘాను మరో రెండు మూడు రోజుల్లో పూర్తిచేసి.. తుది ప్లాన్‌ను అమెరికా భద్రత విభాగాలకు అందించనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్లాన్, సమాచారాన్ని బట్టి ఇవాంకా ట్రంప్ పర్యటన తుదిరూపు ఉంటుందని కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయి. మన ప్రధాని విదేశాలకు వెళ్లినా.. మన దేశ ప్రధాన మంత్రి ఎప్పుడు విదేశీ పర్యటనకు వెళ్లినా.. దేశంలోని కీలకమైన విభాగాలైన ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) అధికారులు రహస్య ఏజెంట్లుగా పనిచేస్తారని కేంద్ర నిఘా అధికారులు తెలిపారు. ప్రధాని పర్యటించే ప్రాంతాలు, అక్కడికి వచ్చే వారి వివరాలు, ముప్పు ఉండే ప్రమాదం తదితర వివరాలను ముందే సేకరించి.. పర్యటన ప్రణాళికను తుది రూపునకు తీసుకువస్తారని పేర్కొన్నాయి. ఇవాంకా సెక్యూరిటీ అధికారిగా మహిళా ఐపీఎస్! రాష్ట్రంలో పర్యటిస్తున్న సమయంలో ఇవాంకా భద్రతా, లైజన్ ఆఫీసర్‌గా మహిళా అధికారిని నియమించేందుకు పోలీస్ శాఖ సమాయత్తం అవుతోంది. అమెరికా భద్రతా సంస్థ (ఎఫ్‌బీఐ) వర్గాలు ఇచ్చే సూచనల మేరకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ) నుంచి కూడా మహిళా అధికారిని కేటాయించే అవకాశముందని పోలీస్ వర్గాలు తెలిపాయి. అయితే తెలంగాణలో పర్యటన కాబట్టి ఇక్కడి ఎస్పీ ఆపై స్థాయి ఉన్న మహిళా అధికారిని నియమించుకునేలా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. అయితే ఇవాంకాకు సెక్యూరిటీ, లైజన్ ఆఫీసర్‌గా చేశామన్న పేరు వస్తుందన్న ఉద్దేశంతో పలువురు మహిళా అధికారులు పోటాపోటీగా ప్రయతిస్తున్నారని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ‘భద్రత’పై పోలీసుశాఖ, ఎస్పీజీ మధ్య లేని సమన్వయం! ప్రధాని మోదీ, ఇవాంకాల పర్యటన సందర్భంగా భద్రతపై స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) నుంచి రాష్ట్ర పోలీసు శాఖకు ఇప్పటివరకు అధికారిక సమావేశం అందలేదని తెలిసింది. పర్యటనకు వారం రోజులే గడువు ఉండటంతో అసలు భద్రతా ఏర్పాట్లపై ఎలాంటి కార్యచరణ చేపట్టాలన్న దానిపై ఎస్పీజీ రాష్ట్ర పోలీస్ శాఖతో సమన్వయ సమావేశం నిర్వహించాల్సి ఉంది. హెచ్ఐసీసీలో సదస్సు జరిగే చోట అమెరికన్ సెక్యూరిటీ, ఎస్పీజీ మాత్రమే ఉండాలా? రాష్ట్ర పోలీసు అధికారులు కూడా ఉండొచ్చా? ఉంటే ఎంతమంది ఉండాలి? తదితర అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. -
ఆరెస్సెస్.. బ్రిటిషోళ్ల ఏజెంట్
-
ఆరెస్సెస్.. బ్రిటిషోళ్ల ఏజెంట్
అది దేశం కోసం ఏనాడూ పోరాడలేదు: జైపాల్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: బ్రిటిషోళ్లకు ఏజెంట్ గా పనిచేసిన ఆరెస్సెస్ దివాలాకోరు రాజకీయాలకు పాల్పడుతోందని కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి విమర్శించారు. దేశ తొలి ప్రధాని నెహ్రూపై విమర్శలు చేస్తూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను పొగుడుతున్నారని, ఇది కుత్సిత రాజకీయ బుద్ధికి నిదర్శనమన్నారు. ఆరెస్సెస్, బీజేపీకి పటేల్‌పై ప్రేమాభిమానాలేమీ లేవన్నారు. నెహ్రూను నిందించడానికే పటేల్‌ను వాడుకుంటున్నారన్నారు. శనివారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మల్లు రవితో కలసి గాంధీభవన్‌లో జైపాల్ విలేకరులతో మాట్లాడారు. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ నగరంలో నెహ్రూపై చేసిన వ్యాఖ్యలు దుర్మార్గంగా ఉన్నాయని, చరిత్ర తెలియకుండా మా ట్లాడారని అన్నారు. స్వాతంత్య్ర సమరంలోనూ, దేశాన్ని నడపడంలోనూ నెహ్రూ, పటేల్ ఇద్దరూ సమ ఉజ్జీలుగా పనిచేశారన్నారు. ఏ నిర్ణయమైనా కేబినెట్లో చర్చించి తీసుకున్నారని, అప్పటి కేంద్ర కేబినెట్లో డాక్టర్ రాజేంద్రప్రసాద్, అంబేడ్కర్, జయప్రకాశ్ నారాయణ, శ్యాంప్రసాద్ ముఖర్జీ కూడా ఉన్నారని గుర్తు చేశారు. ‘‘నెహ్రూ, పటేల్ ఇద్దరూ మహాత్మాగాంధీకి ప్రియ శిష్యులు. క్విట్ ఇండియా సమయంలో ‘డూ ఆర్ డై’ పేరుతో ఉద్యమం చేపడితే కాంగ్రెస్ శ్రేణులంతా కలిసి ఉద్యమించాయి. ఆరెస్సెస్ మాత్రం బ్రిటిష్ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరించింది’’ అని అన్నారు. నెహ్రూను విమర్శించే అర్హత లేదు... హైదరాబాద్‌లో పటేల్ పోలీసు యాక్షన్ చేపట్టారని, ఆయన ప్రధాని అయి ఉంటే కశ్మీర్ సమస్య కూడా ఉండేది కాదంటూ బీజేపీ నేతలు ప్రచారం చేయడం చరిత్ర తెలియకపోవడమేనని జైపాల్ అన్నారు. అప్పట్లో వీటో అధికారం ఉన్న దేశాలేవీ కశ్మీర్ విషయంలో భారత్‌కు మద్దతివ్వలేదని, అందుకే అక్కడ సైనిక చర్యకు దిగలేదని వివరించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా గుజరాత్లో గల్లీ లీడర్ అని, అలాంటి వ్యక్తికి దేశ చరిత్ర ఏంతెలుస్తుందని ప్రశ్నించారు. ‘‘ఆరెస్సెస్ ఎన్నడూ దేశం కోసం పోరాడలేదు. ఆ సంస్థ నాయకులు సావర్కర్, దేవరస్లాంటివారు స్వాతంత్య్రం కోసం జైలుకు పోలేదు. కాంగ్రెస్ నాయకులు దేశం కోసం పోరాడి, ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గారు. నెహ్రూను విమర్శించే నైతిక అర్హత ఆరెస్సెస్‌కు, బీజేపీ నేతలకు లేదు. ఆర్ఎస్ఎస్ అంటేనే అబద్ధాలను ప్రచారం చేసే సంస్థ’’ అని విమర్శించారు.