breaking news
black buck case
-
కోర్టు ఆదేశాలు : సల్మాన్ ఆశలు ఆవిరి!
జోధ్‌పూర్ : కృష్ణజింకలను వేటాడిన కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌ను రాజస్థాన్ జోధ్‌పూర్ సెషన్స్ కోర్టు హెచ్చరించింది. ఏ పని నిమిత్తమైనా సరే విదేశాలకు వెళ్లాలంటే కండలవీరుడు సల్మాన్ కచ్చితంగా కోర్టు అనుమతి తీసుకోవాలని కోర్టు సూచించింది. విదేశాలకు వెళ్లాల్సినప్పుడు కచ్చితంగా అనుమతి అనే నిబంధన నుంచి తనకు విముక్తి కల్పించాలంటూ సల్మాన్ తన లాయర్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. శనివారం, ఆ పిటిషన్ విచారణకు రాగా, ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితుడు సల్మాన్ అనుమతి తీసుకోకుండా విదేశాలకు వెళ్లకూడదని కోర్టు తీర్పిచ్చింది. దీంతో పర్మిషన్ లేకుండా విదేశాలకు వెళ్లాలనుకున్న సల్మాన్ ఆశలు ఆవిరయ్యాయి. ఆగస్ట్ 10 నుంచి 26 తేదీల మధ్య విదేశాల్లో పర్యటించాల్సి ఉందని సల్మాన్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. షూటింగ్ పూర్తి చేసుకునేందుకు సల్మాన్ అబుదాబి, మాల్టాలకు వెళ్లాల్సి ఉందని నటుడి లాయర్ కోర్టుకు విన్నవించారు. భరత్ మూవీ షూటింగ్ పనుల్లో సల్మాన్ బిజీగా ఉన్నాడు. కానీ అనుమతి ఉంటేనే విదేశాలకు వెళ్లాలని జోధ్‌పూర్ కోర్టు తెలిపింది. ఈ ఏప్రిల్‌లో జోధ్‌పూర్ సెషన్స్ కోర్టు జడ్జి తీర్పు ప్రకారం.. రూ. 50 వేల వ్యక్తిగత పూచీకత్తు, అదే మొత్తానికి మరో ఇద్దరి పూచీకత్తులు సమర్పించిన అనంతరం సల్మాన్ బెయిల్‌పై విడుదలయ్యారు. (సెల్లో సల్మాన్.. ఖైదీ నెంబర్ 106) కాగా, కృష్ణజింకలను వేటాడిన కేసులో ఈ ఏడాది ఏప్రిల్ 5న సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్ కోర్టు ఐదేళ్ల శిక్ష విధించింది. 1998 అక్టోబర్ 1న ‘హమ్ సాథ్ సాథ్ హై’ చిత్రీకరణ సమయంలో రాజస్థాన్ అడవుల్లో సల్మాన్ రెండు కృష్ణ జింకలను వేటాడి చంపినట్లు నమోదైన కేసులో దోషిగా రుజువైంది. రెండు రోజుల పాటు జోధ్‌పూర్ జైల్లో గడిపిని సల్మాన్ బెయిల్ రాగానే ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లిపోయారు. కాగా, ఈ కేసులో సల్మాన్‌తో పాటు ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్, సోనాలీ బ్రిందే, టబు, నీలం, జోధ్‌పూర్ వాసి దుష్యంత్ సింగ్‌లను కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చిన విషయం విదితమే. -
సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష
-
సల్మాన్ జైల్ మేట్ ఎవరంటే...
జోధ్‌పూర్ : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను చంపిన కేసులో దోషిగా కోర్టు తేల్చటంతో అరెస్ట్ చేసిన జోధ్‌పూర్ పోలీసులు అటునుంచి అటే సెంట్రల్ జైలుకు తరలించారు. ఇదే జైలులో 2006లో సల్మాన్ ఐదు రోజులు గడిపారు కూడా. ఇక ప్రస్తుతం బ్యారక్ నంబర్ 2లో సల్మాన్‌కు జైలు గదిని కేటాయించారు. ఇదే బ్యారక్‌లో అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న స్వామిజీ ఆశారాం బాపు ఉంటున్నారు. ‘సల్మాన్ కోసం ఇప్పటికే సెల్‌ను ఏర్పాటు చేశాం. ఇందులో ఫ్యాన్, ఏసీ లాంటి ఎలాంటి సదుపాయాలు లేవు. ఆశారాంను ఉంచిన బ్యారక్‌లోనే సల్మాన్ ఉంటారు. అయితే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్‌కు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో బ్యారక్ వద్ద భద్రతను మాత్రం కట్టుదిట్టం చేయబోతున్నాం’ అని జైలు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. కాగా, 2013లో ఆశ్రమానికి చెందిన బాలికను అత్యాచారం చేశాడన్న ఆరోపణలపై 5 ఏళ్లుగా ఆశారాం ఇదే జైళ్లో ఉంటున్నారు. బెయిల్ పిటిషన్ దాఖలు.. ఇక శిక్షలు ఖరారైన వెంటనే సల్మాన్ తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషన్ రేపు ఉదయం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఇవాళ రాత్రి జైల్లోనే గడపాల్సి ఉంటుంది. బిష్ణోయిస్లో సంబరాలు... కాగా, ఈ కేసులో 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్న బిష్ణోయిస్ తెగ సంబరాలు మునిగింది. తీర్పు వెలువడిన అనంతరం కోర్టు బయట పటాసులు పేల్చి.. మిఠాయిలు పంచుకున్నారు. Visuals of #SalmanKhan at Jodhpur Central Jail. #BlackBuckPoachingCase pic.twitter.com/Q3NbMqkxhk — ANI (@ANI) 5 April 2018 -
ఓ జింక ‘ఆత్మహత్య’ కథ
గడచిన కొద్దిరోజులుగా.. అంతకు కొద్దినెలల ముందు.. సోషల్ మీడియాలో ‘‘ఇట్ ఓన్లీ హ్యాపెన్స్ ఇన్ ఇండియా’’ అంటూ ట్యాగ్లు హల్చల్ చేశాయి. ‘‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు..?’’ ప్రశ్న పాతదైపోయింది. ‘‘కృష్ణజింకను ఇంతకీ ఎవరు చంపారు..?’’ అనే కొత్త చిక్కుముడిని విప్పేందుకే నెటిజన్లు గూగుల్‌ను జల్లెడ పడుతున్నారు. ఇంతకూ ఆ జింకను ఎవరు చంపి ఉంటారు..? కొందరు చెప్పేమాట ‘ఏక్‌థా టైగర్’. ఇంకొందరి సందేహం.. ‘‘జింకే తనను తాను ఎందుకు కాల్చుకుని ఉండకూడదూ..’’ అని!! సల్మాన్ ఖాన్‌ను రాజస్తాన్ హైకోర్టు తాజాగా నిర్దోషిగా ప్రకటించినా.. జింకలను చంపింది సల్మానేనని ఆనాడు జీపు డ్రైవర్‌గా ఉన్న హరీష్ దులానీ చెబుతున్నాడు. కానీ పోలీసుల దర్యాప్తు మాత్రం జింక తనకు తానే కాల్చుకుని చనిపోయిందన్న తీరులో సాగిందని ఫేస్బుక్లో సెటైర్లు హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫొటో వివిధ సామాజిక అనుసంధాన వెబ్సైట్లలో వైరల్ అవుతోంది. అనగనగా 1998.. అక్టోబర్ 1.. చీకటి పడుతోంది. ‘ఏక్‌థా టైగర్’కు మెలకువ వచ్చింది. బద్ధకంగా ఒళ్లు విరుచుకుని చుట్టూ చూసింది. బ్రెడ్, బటర్, శాండ్విచ్, రోటీ, దాల్... పులికి చిరాకొచ్చింది. ‘డొక్క మాడితే మాత్రం.. పులి గడ్డి తింటుందా..?’ నో చాన్స్! ఒకే ఒక్క జంప్.. వెళ్లి తన వెహికల్లో పడింది. బండి రయ్య్ మంటూ దూసుకుపోతోంది. దారి మధ్యలో టైగర్ జస్ట్ అలా వెనక్కి ఓ టర్నింగ్ ఇచ్చుకుంది. ఎలా వచ్చి చేరాయో గానీ, అప్పటికే ఓ మగ పులి, మరో మూడు ఆడ పులులు వెనక సీట్లో దర్జాగా కూర్చొని ఉన్నాయి. ఆశగా నాలుకలు వెలుపలికి పెట్టి, నిమిషానికొకసారి చప్పరించుకుంటున్నాయి. కడుపు మాడితే టైగర్ ఎలాగూ వేటాడుతుంది.. మనకీ నాలుగు బోన్స్ దొరక్కపోతాయా అని ఆ పులుల ఆశ! చిన్నవిషయాలకూ గొప్పలకు పోయే నైజమున్న మన టైగర్.. వెనకాలే కూర్చున్న స్వజాతి జీవుల ముందు తన రాజసం చూపాలనుకుంది. అయితే, ఈసారి రొటీన్‌గా పంజా విసరకూడదు. ఏదైనా డిఫరెంట్‌గా.. స్టైల్‌గా చెయ్యాలి. అసలే వెనకాల మూడు అందమైన ఆడపులులు ఉన్నాయిగా..! కాస్త వెరైటీగా కూడా ఉండాలి ఏం చేసినా..! అందుకే టైగర్ తన పంజాను పీకి అవతల పారేసింది. బదులుగా ఓ గన్ పట్టుకుంది. ‘‘ఏం తింటారు గయ్య్స్స్..!’’ అంటూ స్టైల్‌గా అడిగి హెయిర్‌స్టైల్‌ను సరిచేసుకుంది. వాటినుంచి ఏం సమాధానం వచ్చిందో ఏమో.. వెంటనే వెహికల్ దిగేసి, తుపాకీని ఎక్కుపెట్టింది. దూరంగా మినుకుమినుకుమంటూ రెండు చిన్నపాటి బల్బుల కాంతి.. ‘‘యస్..! దొరికేసింది. అది జింకే అనుకుంటా. రాత్రివేళ కదా.. కనుగుడ్లు మెరుస్తున్నాయి. యుమ్మీ..!’’ అంటూ ట్రిగ్గర్‌ని ఒక్క నొక్కు నొక్కింది. ఢామ్మ...ని పెద్ద శబ్దం, ఓ పొదల చాటున గిలగిలా కొట్టుకుంటోన్న కృష్ణజింక చప్పుడు చిన్నగా వినిపిస్తోంది. ఎవరూ చూడలేదు కదా.. అన్నట్టుగా ఏక్‌థా టైగర్ చుట్టూ చూసింది. హమ్మయ్య.. ఎవ్వరూ లేరు. కళ్లు మూసుకుని పాలు తాగేయ్యొచ్చు ఇప్పుడు! మిగతా పులులు కూడా కళ్లు మూసుకున్నాయి. ఈ పనంతా ఏ మార్జాలమో చేస్తే ఓకే.. చెల్లిపోతుంది. వెరైటీగా పులి కళ్లు మూసుకోవడమేంటీ.. అక్కడే వచ్చింది చిక్కంతా. దూరం నుంచి ఎవడో చూసేశాడు. బిష్ణోయ్ కులస్థుడంట. వాడికి పిచ్చిపిచ్చిగా కోపమొచ్చేసింది. ‘‘ఏయ్.. నీ పని పడతా..’’ అంటూ వెంబడించాడు. టైగర్ అలర్ట్ అయింది. వెహికల్ రివ్వున దూసుకుపోయింది. ఈ బిష్ణోయ్ బాబు ఆగలేదు. వెంబడించి వెంబడించి.. వెనక్కి వచ్చేశాడు. తమవాళ్లందరినీ ఓ చోట చేర్చాడు. ‘‘మనం దేవతలా పూజించే జింకలను ఆ ఏక్‌థా టైగర్ చంపేసిందిరా..’’ అంటూ ఏడ్చాడు. అంతే.. తెల్లవారింది. సమీపంలోని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదైంది. విచారణ కూడా వెంటనే మొదలైంది. అప్పటి నుంచి అది జీడిపాకంలా సాగుతూనే ఉంది. నిన్నగాక మొన్ననే దీనికి పుల్‌స్టాప్ పడింది. ‘యస్.. టైగర్ నిర్దోషి’! ‘‘మరి.. కళ్లారా చూసిన నేనేమవుతానురా..’’ అంటూ ఏడ్చాడు బిష్ణోయ్ బాబు. ‘‘ఉండొచ్చు గానీ, మరీ అంత పిచ్చి ఉండకూడదు. అయినా, జంతువుల మీద ప్రేమ ఏంట్రా. పిచ్చివాడా..’’ అంటూ కొందరు నవ్విపోయారు. మరికొందరు సానుభూతి చూపారు. ‘‘పోనీలే, పోయింది కృష్ణ జింకేగా.. మనకి మన టైగర్ మిగిలింది. అదే పదివేలు’’ అని ఊపిరి పీల్చుకున్నారు ఇంకొందరు దేశభక్తులు. కానీ, కొందరికి మాత్రం ఎప్పుడూ ప్రశ్నలతోనే సావాసం. టైగర్ చంపకుంటే, జింక ఎలా చనిపోయినట్టూ.. అంటూ ఆరాలు తీశారు. దీనికి వినిపించిన సమాధానాలు.. టైగర్ లెసైన్స్డ్ గన్ నుంచి ఒక్క తూటా కూడా పేలలేదు. టైగర్ వెహికల్లో దొరికిన తూటాల తొడుగులు ఆ తుపాకీ నుంచి వచ్చినవి కాదు. ఒకవేళ వచ్చినా ఆ తూటాలు జంతువులను చంపేంత శక్తిమంతమైనవి కాదు. మొదట్లో వెహికల్లో తూటాలు లేనేలేవు. పోలీసుల తనిఖీ తర్వాతే వచ్చిచేరాయి. అంటే.. ఏంటి అర్థం..? పోలీసులే కుట్ర చేశారని కదా..! ఇలా బోలెడన్ని సమాధానాలు ఇప్పటికీ వినిపిస్తాయి. అన్నీ సందేహం రేకెత్తించే సమాధానాలే.. ఏదీ టైగర్ మీద పడిన మచ్చను చెరిపేలా లేదు. స్పష్టతనిచ్చేలా అసలే లేదు. దీన్నే క్రికెట్ పరిభాషలో ‘‘బెనిఫిట్ ఆఫ్ డౌట్..’’ అంటారు. అంటే.. క్రీజులో బ్యాట్ పట్టుకునే టైగర్‌కు అనుకూలమైన నిర్ణయం అన్నమాట. మరింకేం..? ఇది కూడా అలానే అనుకుందాం. టైగర్‌ను చూసిన ఆనందంలో జింకే తనను తాను కాల్చుకుందని అనుకుందాం. చివరగా.. బెనిఫిట్ ఆఫ్ డౌట్. కృష్ణ జింక అవుట్!!