breaking news
Biruduraju Ramaraju
-
Biruduraju Ramaraju తెలుగు సంస్కృతీరాజం రామరాజీయం
ఆచార్య బిరుదురాజు రామరాజు గురించిన ఆలోచన రాగానే సంస్కృతి, సంప్రదాయం, సాధన, విద్వత్తు మూర్తీభవించిన వ్యక్తిని మనోనేత్రంతో చూస్తాం. 55 ఏళ్ళనాడు పరిచయమైన రామ రాజుగారు కీర్తిశేషులయ్యే వరకు నా మీద చూపిన వాత్సల్యం ఎప్పటికీ గుర్తుంటుంది. వయసులో చిన్నవాళ్ళయినా ప్రేమతోబాటు గౌరవం చూపే సౌజన్యం ఆయనది. దీన్ని ఎన్నో సందర్భాలలో నేను చవిచూచాను. 24 సంవత్సరాల వయస్సులోనే నన్ను ఉస్మా నియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు పిలిపించి తెలుగు ఎం.ఎ. విద్యార్థులకు జానపద సాహిత్యం మీద ఉప న్యాసం ఇప్పించారాయన. 26 ఏళ్ళ వయస్సులోనే పిహెచ్.డి. పరీక్షకునిగా చేశారు. 27 ఏళ్ళ వయసులో ఆంధ్రప్రదేశ్ జానపద సాహిత్య పరిషత్తు ప్రాదుర్భావ సందర్భంగా నాచేత ప్రధానోపన్యాసం ఇప్పించారు. ‘గుణాః పూజాస్థానం గుణిషు నచ లింగం నచ వయః’ అనే వాక్యానికి నిలువెత్తు ఉదాహరణ రామరాజుగారు. హైదరాబాదుకు ఎప్పుడైనా వెళ్ళానంటే చిక్కడ పల్లిలో రామరాజుగారి నివాసానికి వెళ్ళి గంటల తరబడి మాట్లాడవలసిందే. జానపద విజ్ఞానంలో జరుగుతున్న కొత్త పరిశోధనలను గురించి అడిగి తెలుసుకొనే ఆయన ఆసక్తి ఆశ్చర్య పరిచేది. ‘నేను చెప్పిందే చివరి వాక్యం. చేసేదేదో చేసేశాను. ఇక చేయవల సింది ఏదీ లేదు’ అనే మనస్తత్వం కాదు రామరాజుగారిది. ఆయన చేసిన పరి శోధన, జానపద సాహిత్యంలో ఆయన కృషి తక్కువదేమీ కాదు. ‘జానపద సాహిత్యంలో పరిశోధన చేయడానికి ఏముంది?’ అని భావించే రోజుల్లో పట్టుబట్టి జానపదగేయ సాహిత్యాన్ని పరిశోధనాంశంగా తీసు కున్న సందర్భం తెలుగులో జానపద పరిశోధనకు నాందీ వాక్యం పలికింది. తెలుగులో విస్తృతంగా జానపద విజ్ఞాన పరిశోధన జరగడానికి మూలకారణం రామరాజుగారే. జానపద సాహిత్య సేకరణ, వర్గీకరణ, వివేచన విషయంలో ఆయనదే ఒరవడి.సంస్కృతి, సంప్రదాయాలు అంటే రామరాజుగారికి విపరీతమైన అభిమానం. అందువల్లనే మనకు తరతరాల వారసత్వంగా సంక్రమించిన జానపద సాహిత్యాన్ని ఆయన అంతగా అభిమానించారు. కాని అభిమా నించడంతో ఆగిపోలేదాయన. జానపద సాహిత్య పరిశోధనపైన దృష్టి సారించారు. పరిశోధనతో ఆగిపోక పోవడం ఆయన ముందుచూపునకు నిదర్శనం. ఆయన పరిశోధన గ్రంథాన్ని రెండోసారి ప్రచురించేటప్పుడు 1976లో నేను ప్రచురించిన ‘జానప సాహిత్య స్వరూపం’ పుస్తకాన్ని చూచినట్లుగా అందులో ఉటంకించారు. ఇది వారి హృదయ వైశాల్యాన్ని తెలుపుతుంది. జానపద విజ్ఞాన అధ్యయనాన్ని గురించి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఈ విషయంలో ఆయన ఆసక్తిని తెలుపుతుంది.బిరుదురాజు రామరాజుగారు జానపద సాహిత్య పరిశోధనతోనే ఆగిపోలేదు. వారి సమకాలికులైన దిగ్దంతులవంటి పండితులతో సమానంగా వ్యవహరించాలని సంస్కృతంలో కూడా ఎం.ఎ. చేశారు. ప్రాచీన తెలుగు కావ్యాలవైపు దృష్టి సారించారు. ప్రాచీన రచనలను పరి చయం చేయడమే కాకుండా ‘చరిత్రకెక్కని చరితార్థులు’ పేరుతో విస్మృత కవులను గురించి ప్రచురించారు. ప్రాచీన తెలుగు కావ్యాలనే కాకుండా కొన్ని సంస్కృత గ్రంథాల్ని సేకరించి ప్రచురించారు. తెలుగు, సంస్కృతం మాత్రమే కాక ఆంగ్లంలో కూడా రామరాజు గారు ప్రావీణ్యం గడించారు. ఆంగ్ల గ్రంథాలను తెలుగులోకి అనువదించడమే కాకుండా ‘ఫోక్లోర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో ఆంగ్ల గ్రంథాన్ని ప్రచురించారు. ‘జానపద సాహిత్య బ్రహ్మ’ అనిపించుకోవడమే కాకుండా ప్రాచీన సాహిత్య పరిశోధన, నిఘంటు రచన, చారిత్రక నవలారచన, అముద్రిత గ్రంథాల పరిష్కరణ వంటి రంగా లలో కృషి చేసిన బిరుదురాజు రామరాజుగారు చిరస్మరణీయులు. -ఆర్వీయస్ సుందరం వ్యాసకర్త సాహితీ విమర్శకులు(నేడు హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంఎన్టీఆర్ కళామందిరంలో బిరుదురాజు రామరాజు శత జయంతి సదస్సు) -
కొత్త పుస్తకాలు: కస్తూరి పంచే మనిషి
శాఖమూరు రామగోపాల్ తెలుగు రచయితలకు తెలియడు. కన్నడ రచయితలకు కూడా తెలియడు. ఆయన తెలంగాణ వాళ్లకు తెలియడు. సీమాంధ్ర వాళ్లకూ తెలియడు. ఆయన ప్రవాస తెలుగువాడని ఇక్కడి వాళ్లనుకుంటారు. మనకేం సంబంధం అని కన్నడవాళ్లనుకుంటారు. ఎవరు ఎలా అనుకున్నా రామగోపాల్కు తెలిసింది మాత్రం ఒక్కటే. తెలుగు అంటే ప్రేమ. కన్నడం అంటే వెర్రి. కన్నడంలో ఉన్న ఉత్కృష్ట సాహిత్యాన్ని తెలుగుకు అనువాదం చేసి ఇవ్వాలని తపన. ‘భూమిలో పడ్డ విత్తనం హృదయంలో పడ్డ అక్షరం వృథాపోవు’ అని వాళ్ల అమ్మ అనేదట. తెనాలి నుంచి వాళ్ల కుటుంబం చాలా ఏళ్ల క్రితం రాయచూరు వెళ్లి వ్యవసాయం మొదలెట్టింది. రామగోపాల్ ఇక్కడే చదువుకున్నా, చదువు పూర్తయ్యాక ఉద్యమాలు గిద్యమాలంటూ కొడుకు పట్టకుండా పోతాడేమోనని రాయచూరు తీసుకొచ్చారు తల్లిదండ్రులు. అక్కడ కన్నడ కస్తూరి పరిమళం మొదటిసారిగా తెలిసింది రామగోపాల్కు. హైద్రాబాద్ తిరిగి వచ్చి ఇక్కడే ఉండిపోయినా కన్నడ భాషను, లిపిని, సాహిత్యాన్ని వదల్లేదు. ఇన్నాళ్ల తర్వాత ఖాళీ దొరికి 60 ఏళ్ల వయసులో గత మూడేళ్లుగా కన్నడ కథల అనువాదం మొదలుపెట్టారు. మూడేళ్లు. ఇప్పటికి ఎనిమిది మంచి మంచి పుస్తకాలు వచ్చాయి. శ్రేష్ఠ కన్నడ కథలు, చినరాపూరులోని గయ్యాళులు, కృష్ణారెడ్డి ఏనుగు, పర్యావరణ కథలు, మాట తీరు... వీటిలో దాదాపుగా ప్రఖ్యాత కన్నడ రచయిత పూర్ణచంద్ర తేజస్వి కథలే ఎక్కువ. ‘కన్నడ నాట రచయితలకు గౌరవం ఎక్కువ. కువెంపు వంటి వారి పుస్తకాలను దేవుడి మందిరంలో పెట్టుకుంటారు’ అంటాడాయన. ‘ఒక కథ చదివితే మన జీవిత దృక్పథమే మారిపోవాలి. ఒక గొప్ప కథ పుట్టాలంటే ఒక గొప్ప రచయితకు పుష్కరకాలం పడుతుంది. కన్నడలో అలా కృషి చేసి రాస్తారు. తెలుగులో వందల కొద్దీ కథలు రాశామని కొందరంటుంటారు. అన్ని కథలు ఎలా రాశారా అని నాకు ఆశ్చర్యం.’ అంటాడాయన చకితుడవుతూ. రామగోపాల్ తెస్తున్న పుస్తకాలను పాఠకులు ఆదరిస్తున్నారు. ‘ఆ అమ్మకాలు కూడా నామ్ కే వాస్తే. ఇక్కడ పుస్తకాలు పెద్దగా కొనరు. న్యూస్ పేపర్లు చదివి తెలుగుకు సేవ చేస్తున్నారనుకుంటారు. పత్రికలు చదివితే వార్తలు తెలుస్తాయి. పుస్తకాలు చదివితే జీవితం మారుతుంది. కన్నడిగులకు ఈ సంగతి తెలుసు. అందుకే అక్కడ రచయితలు రాసి ఘనంగా బతుకుతున్నారు. ఇక్కడ రాసి చెడిపోతున్నారు. నేను కూడా ఈ పుస్తకాలు అచ్చు వేయడానికి నానా తిప్పలు పడాల్సి వస్తోంది’ అని బాధ పడతాడాయన. అలాగని రామగోపాల్ ప్రొఫెషనల్ ట్రాన్స్లేటర్ కాకపోవచ్చు. ఆయన అనువాదంలోని భాష ఒక విధమైన మిశ్రమ సొగసుతో ఉండవచ్చు. కన్నడ ప్రభావంతో కూడా ఉండవచ్చు. అయితే మాత్రం? ఒక అనువాద అకాడెమీ చేయాల్సిన పనిని చేస్తున్నాడు. ‘ఇంకో రెండేళ్లు. అంతటితో నేను రాయాల్సిన పుస్తకాలు ముగుస్తాయి. అంతటితో ఈ వ్యసనాన్ని కట్టిపెడతాను’ అని నవ్వాడాయన. ఇలాంటి వాళ్ల వల్లే సాహిత్యం ఇంకా ‘ప్రయోజనం ఆశించని’ విధంగా స్వచ్ఛంగా కొనసాగుతోంది. ఇలాంటి వాళ్ల వల్లే వానలు కూడా వేరే ఏమీ ఆశించకుండా సకాలానికి కురుస్తూ ఉన్నాయి. ఆయన్ను మెచ్చుకోవాలంటే: 09052563666 ఒక కథకుడు నూరుగురు విమర్శకులు.... తెలుగులో సుదీర్ఘ చర్చలు జరిగిన కథలు ఏవి? కాళీపట్నం రామారావు ‘యజ్ఞం’. తుమ్మేటి రఘోత్తమరెడ్డి ‘పని పిల్ల’. స్త్రీ- పురుషుల మధ్య, ఆదివాసీ - మైదాన ప్రాంతాల వారి మధ్య ఉన్న వైరుధ్యాల లోతులను చర్చించిన కథ ‘పని పిల్ల’. అయితే దీని మీద ఎవరి దృష్టికోణం నుంచి వారు సుదీర్ఘమైన చర్చ చేశారు. కొన్ని వందల పేజీల చర్చ జరగడం విశేషమే. అలాగే తుమ్మేటి రాసిన ‘నల్లవజ్రం’ నవల మీద, ‘శత్రువు’, ‘బండకింది బతుకులు’ వంటి కథల మీద కూడా చాలా చర్చలు జరిగాయి. ఇక ఇటీవల ‘సెజ్’ల కేటాయింపు, వాటిని ప్రజలు ఎలా చూస్తున్నారు, ‘సెజ్’లను ఏ వైపు నుంచి అర్థం చేసుకోవాలి వ్యాఖ్యానిస్తూ రాసిన ‘సెజ్’ కథ మీద కూడా బోలెడంత చర్చ జరిగింది. ఇలా అనేక సందర్భాలలో తన రచనల మీద జరిగిన చర్చలన్నింటినీ కలిపి ‘ఒక కథకుడు నూరుగురు విమర్శకులు’ పేరుతో పుస్తకం వెలువరించారు. 576 పేజీల ఈ పుస్తకం రచయితలకు, విమర్శకులకు, భవిష్యత్తులో యువ కథకులకు, సాహిత్య విద్యార్థులకు చాలా ఉపయుక్తంగా ఉండే అవకాశం ఉంది. ఒక రచయితను, ఒక కాలాన్ని అర్థం చేసుకోవడానికి పలు దృష్టి కోణాల నుంచి సాహిత్యాన్ని విశ్లేషించడానికి ఇటువంటి ప్రయత్నాలు స్వాగతించదగ్గవి. ఒక కథకుడు నూరుగురు విమర్శకులు; తుమ్మేటి రఘోత్తమరెడ్డి కథల చర్చా సర్వస్వం వెల: 400; ప్రతులకు: 9000184107 గురుభక్తుల జీవిత దర్శనం డాక్టర్ బిరుదురాజు రామరాజు రాసిన ‘ఆంధ్రయోగులు’ సంపుటాలు సుప్రసిద్ధం. ఆంధ్ర రాష్ట్రంలోని నలుమూలల్లో ప్రజల ఆదరణ పొందిన 50 మంది యోగుల కథలను ఆయన 1998లో మొదటిసారి అచ్చు వేశారు. ఆ తరువాత ఇతర భాగాలు వచ్చాయి. అయితే అంతకు నలభై ఏళ్ల ముందే గుంటూరుకు చెందిన పంగులూరి వీరరాఘవుడు 1957లో ‘శ్రీమదాంధ్ర మహాభక్త విజయము’ పేరుతో 67 మంది గురుభక్తుల జీవిత చిత్రణను పుస్తకంగా వెలువరించారు. ఆనాటికి పాఠకులకు అందుబాటులో లేని యోగుల చరిత్రను తన శక్తిమేరకు సేకరించి రాసి ఎనలేని సేవ చేశారు. ఇప్పుడు ఆ పుస్తకాన్ని ఆయన ఆత్మీయులు సరళీకరించి కొత్తగా తీసుకొని వచ్చారు. ఇందులో బమ్మెర పోతన దగ్గరి నుంచి అమరవాది కామళ్ల వెంకట రామానుజాచార్యులవారి వరకు చాలా మంది యోగుల చరిత్రలు ఉన్నాయి. బందా పరదేశి, పోతులూరి బ్రహ్మంగారు, దూదేకుల సిద్దయ్య, రంగారాయుడు, సయ్యద్ అహ్మద్ అలీషా ఖాదర్ వలీ, నల్ల మస్తానయ్య, మాల ఓబులు, మాల పిచ్చమ్మ, బెల్లంకొండ రామరాయకవి, డొక్కా సీతమ్మ, ముమ్మడివరం బాలయోగి, సత్యసాయిబాబా... ఇలా ఎందరో యోగులు ఇందులో కనిపిస్తారు. చారిత్రక ప్రమాణాల కన్నా భక్తులు చెప్పుకునే గాథలనే స్వీకరించి వాటిని లిఖించారు. ఏమైనా ఒక కాలంనాటి యోగులు, ఆ కాలపు వివరాలు కూడా పరోక్షంగా ఇందులో తెలుస్తాయి. అరుదైన పుస్తకం. శ్రీ మదాంధ్ర మహాభక్త విజయము; వెల: రూ.150; ప్రతులకు: 99086 48474