breaking news
Bike thieves arrested
-
వారి వయసంతా 25 లోపే.. అన్నీ హైస్పీడ్ స్పోర్ట్స్ బైక్‌లే
సాక్షి, దుండిగల్: వారి వయసంతా 25 లోపే.. చిన్న చిన్న దొంగతనాలు చేసి జైలు పాలయ్యారు.. అక్కడే జట్టుగా ఏర్పడి ఓ ముఠాను తయారు చేసుకున్నారు.. క్షణాల్లో వాహనాలను దొంగలించి వాటిని విక్రయించి.. వచ్చే సొమ్ముతో జల్సాలు చేసే వారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. నలుగురు నిందితులతో పాటు వారికి సహకరిస్తున్న మరో ఇద్దరిని బాలానగర్ సీసీఎస్, దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. షాపూర్‌నగర్‌లోని డీసీపీ కార్యాలయంలో బాలానగర్ డీసీపీ పద్మజారెడ్డి, పేట్‌బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు, దుండిగల్ సిఐ రమణారెడ్డిలతో కలిసి మీడియాకు వివరాలను వెల్లడించారు. చదవండి: నిజామాబాద్‌లో చిన్నారి కిడ్నాప్ కలకలం ముఠా నాయకుడు చింతల బాలరాజ్.. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం తుమ్మన్పేట్ గ్రామానికి చెందిన చింతల బాలరాజు(23) ఐడిఏ బొల్లారంలోని బీరప్ప బస్తీలో నివసిస్తున్నాడు. బైక్ మెకానిక్ అయిన బాలరాజు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. వాహనాలను తస్కరించడంలో ఆరి తేరిన బాలరాజు ద్విచక్ర వాహనాలను దొంగలించి వాటిని విక్రయిస్తూ జల్సాలు చేయడం మొదలు పెట్టాడు. చదవండి: బాలికలకు చాక్లెట్ల ఆశ చూసి.. ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం.. వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ పద్మజారెడ్డి జైల్లో దోస్తీ.. పలు దొంగతనాలు చేసి జైలు పాలైన చింతల బాలరాజు వివిధ నేరాలకు పాల్పడి జైలుకు వచ్చిన వారితో జట్టు కట్టాడు. వనపర్తి జిల్లాకు చెందిన రతస్వామి(19), మెదక్ జిల్లాకు చెందిన ఏర్వ విజయ కృష్ణ(24), మేడ్చల్ కు చెందిన బర్దసారి సుభాష్ (21), బండ్లగూడకు చెందిన షేక్ మహ్మద్ అబ్దుల్ ఆలం(20), ఐడిఏ బొల్లారం పోచమ్మబస్తీ నివాసి మహ్మద్ సోహైల్(19) లు ముఠాగా ఏర్పడి వాహనాలను చోరీచేసి విక్రయించేవారు. అన్ని హై స్పీడ్ వాహనాలే.. ఆరుగురూ కలిసి మద్యం తాగిన అనంతరం ముందుగా పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాల వద్ద రెక్కీ నిర్వహించారు. వాహనంపై కూర్చున్నట్లు నటించి హ్యాండిల్ లాక్ విరగొట్టి క్షణాల్లో అక్కడి నుంచి ఉడాయిస్తారు. అయితే ఇప్పటి వరకు చోరీ చేసిన వాహనాలన్ని హైస్పీడ్ స్పోర్ట్స్ బైక్‌లే కావడం విశేషం. వీటిని చందానగర్, శాంతినగర్‌కు చెందిన కల్లమల్ల దీపక్(21), మౌలాలీ, గాం«దీనగర్‌కు చెందిన మహ్మద్ అన్వర్(20)లకు కేవలం రూ.20 వేలకు విక్రయించడం గమనార్హం. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం నిందితులు చింతల బాలరాజు, సుభాష్, అబ్దుల్ ఆలం, సోహేల్‌తో పాటు చోరీ సొత్తు కొనుగోలు చేసిన దీపక్, అన్వర్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి రూ.45.85 లక్షల విలువ చేసే 24 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. రతస్వామి, విజయ కృష్ణ పరారీలో ఉన్నారు. మాదాపూర్‌లో మరో ఇద్దరు.. మాదాపూర్: నెంబర్ ప్లేట్ లేకుండా బైక్‌పై వస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా వారు ద్విచక్రవాహన దొంగలని తేలింది. అదుపులోకి తీసుకొని విచారించి రూ.28 లక్షల విలువ గల 19 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో డీసీపీ వెంకటేశ్వర్లు శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మదాపూర్‌లోని అయ్యప్పసొసైటీలో వాహన తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు నెంబర్ ప్లెట్ లేని వాహనంపై వచ్చారు. పోలీసులకు అనుమానం వచ్చి విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన చవన్కమలేష్(20)మెహిదీపట్నంలోని ఎస్వీఎన్ హాస్టల్లో ఉంటున్నాడు. మరో వ్యక్తి మేడ్చల్‌జిల్లా బ్రూక్‌బాండ్ కాలనీ వాసి కొత్తకొండ వికాస్ కుమార్(20)గా గుర్తించారు. వీరు వ్యసనాలకు బానిసై పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు చోరీ చేసేవారు. వాటిని కరీంనగర్ జిల్లా లక్ష్మీదేవునిపల్లి గ్రామానికి చెందిన జంగిలి శ్రీకాంత్(20)కు విక్రయించేవారు. దీంతో విచారణ జరిపి బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. -
యూట్యూబ్ చూసి దొంగలయ్యారు!
సాక్షి,చిత్తూరు అర్బన్: టెక్నాలజీ రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. మంచీ.. చెడు అనేది తెలియదు. మనం ఏది అడిగితే అది చూపెడుతుంది. చిత్తూరుకు చెందిన ఇద్దరు యువకుల్లో ఒకరు తాళం వేసిన బైక్‌లను ఎలా చోరీ చేయాలో యూ ట్యూబ్ చూసి నేర్చుకుంటే.. మరొకరు దొంగతనం చేసిన బైకులను అమ్మడం చేసేవాడు. వీరిద్దరినీ చిత్తూరు సీసీఎస్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. చిత్తూరు పోలీసు అతిథి గృహంలో సీసీఎస్ సీఐ రమేష్ వివరాలను వెల్లడించారు. బంగారుపాళ్యంకు చెందిన తోట రాజేష్ (23) కూలీ పనిచేస్తూ తిరుపతిలో జీవిస్తున్నాడు. జులాయిగా తిరుగుతూ వ్యసనాలకు బానిసైన ఇతను బైక్‌లను ఎలా చోరీ చేయాలో యూట్యూబ్‌లో చూసి నేర్చుకుని చిత్తూరు, తిరుపతి, వైఎస్సార్ కడప, చంద్రగిరి, రేణిగుంట తదితర ప్రాంతాల్లో బైకులు చోరీ చేశాడు. యాదమరికి చెందిన జి.ఈశ్వర్ (20) చిత్తూరులోని వీసీఆర్ కళాశాలలో డిగ్రీ చదువుతూ స్నేహితుడైన రాజేష్‌తో కలిసి బైకులు చోరీచేయడం, వాటిని అమ్మి.. వచ్చిన నగదుతో జల్సా చేసేవారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. లభించిన ఆధారాలతో నిందితులిద్దరినీ అరెస్టుచేసి రూ.36 లక్షలు విలువైన మోటారు సైకిళ్లు స్వాదీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి పోలీసులు సీజ్ చేసిన బైకుల్లో కేటీఎం, బుల్లెట్, యమహా కంపెనీలకు చెందిన ఖరీదైన వాహనాలున్నాయి. సమావేశంలో సీసీఎస్ సీఐ–2 లక్ష్మీనారాయణ, ఎస్ఐలు రవికుమార్‌రెడ్డి, విజయ భాస్కర్‌రాజు, సిబ్బంది బాబు, లోకనాధం, కనికాచలం తదితరులు పాల్గొన్నారు. చదవండి: కృష్ణా జిల్లాలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ దాష్టీకం -
బైక్ దొంగలు అరెస్టు
► 8బైకులు స్వాధీనం ► నలుగురికి రిమాండ్ ఇబ్రహీంపట్నంరూరల్: జల్సాల కోసం బైక్‌ల చోరీలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను మంగళవారం అధిభట్ల పోలీసులు అరెస్టు చేశారు. సీఐ గోవింద్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాగోల్‌కు చెందినబొమ్మల దిలీప్ కుమార్ బైక్‌ల చోరీలను వృత్తిగా ఎంచుకున్నాడన్నారు. ఇతను తాను చోరీ చేసిన వాహనాలను విక్రయించేందుకు చేగూరి శ్రీకాంత్, నందకుమార్‌ను ఏజెంట్లుగా పెట్టుకున్నాడన్నారు. మంగళవారం తుర్కయంజాల్ ఎక్స్‌రోడ్డు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులను అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా బైక్‌ల దొంగతనం వెలుగులోకి వచ్చిందన్నారు.దీంతో వారిని అరెస్టు చేసి, 8 బైక్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రధాన నిందితుడు దిలీప్‌పై గతంలో ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో జరిగిన చోరీ కేసులో జైలు వెళ్లి బెయిల్‌పై వచ్చినట్లు ఆయన వివరించారు.