breaking news
Big Data analytics
-
బ్లాక్‌చెయిన్ ప్రమాణాలపై బీఐఎస్ కసరత్తు
న్యూఢిల్లీ: బ్లాక్‌చెయిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి కొత్త టెక్నాలజీలకు కూడా ప్రమాణాలను రూపొందించడంపై కసరత్తు చేస్తున్నట్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) చీఫ్ ప్రమోద్ కుమార్ తివారీ తెలిపారు. ఈ విభాగాలకు సంబంధించిన ప్రాజెక్టుల్లో భారత్ అంతర్జాతీయ స్థాయిలోనూ పురోగమిస్తోందని ఆయన చెప్పారు. అటు పసిడి హాల్‌మార్కింగ్‌కు నిర్దేశించిన గడువును పొడిగించే ప్రసక్తే లేదని తివారీ స్పష్టం చేశారు. పాత నిల్వలను విక్రయించుకునేందుకు జ్యుయలర్లకు రెండేళ్ల పైగా గడువును ఇచ్చామని ఆయన తెలిపారు. బంగారు ఆభరణాల స్వచ్ఛతను తెలియజేసేలా తప్పనిసరిగా 6 అంకెల హాల్‌మార్క్ విశిష్ట గుర్తింపు సంఖ్యతోనే (హెచ్‌యూఐడీ) విక్రయించాలన్న నిబంధనలు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రానున్నాయి. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేందుకే తాము ప్రమాణాలను రూపొందిస్తున్నామని తివారీ వివరించారు. ఇతర దేశాలతో కూడా వాణిజ్యం జరిపేందుకు వీలుగా, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా వీటిని తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. -
81 కోట్ల వోటర్ల సమాచార నిధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భాగ్యనగరంలో ఎంత మంది వేతనజీవులు ఉన్నారు? ఏ వీధిలో రూ.3 లక్షలకుపైగా వార్షిక ఆదాయంగలవారు నివసిస్తున్నారు? ఎన్ని కుటుంబాలకు వాహనాలు ఉన్నాయి? ఎంత మంది యువతీ యువకులు ఉన్నారు? ఇటువంటి సమాచారమే ఇప్పుడు బ్యాంకులు, బీమా, వాహన, రిటైల్ తదితర రంగ సంస్థలకు కీలకం కానుంది. ఎందుకంటే ఈ సమాచారమే వ్యాపార కార్యకలాపాల విస్తరణకు ప్రాతిపదిక కానుంది. బిగ్ డేటా రంగంలో సంచలనానికి తెరలేపుతూ హైదరాబాద్‌కు చెందిన మోదక్ అనలిటిక్స్ 81 కోట్ల మంది భారతీయ వోటర్లకు చెందిన అతిపెద్ద సమాచార నిధిని సంక్షిప్తం చేసింది. ఒక్కో వోటరు వయసు, ఆదాయం, వృత్తి, విద్యార్హత, వీధి, కుటుంబం, మతం, కులం వంటి వివరాలను ఇందులో పొందుపరిచింది. ఏడాది సమయం..: ఈ స్థాయిలో సమాచారాన్ని నిక్షిప్తం చేయడం ప్రపంచంలో తొలిసారి అని మోదక్ కో-ఫౌండర్ ఆర్తి జోషి బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఒక జాతీయ రాజకీయ పార్టీ కోసం 10 మంది నిపుణులు ఏడాదిపాటు శ్రమించి దేశవ్యాప్తంగా 9 లక్షల పోలింగ్ బూత్‌ల వారీగా వోటర్ల వివరాలను క్రోడీకరించారని చెప్పారు. వీటి ఆధారంగా ఈ రాజకీయ పార్టీ వివిధ అంశాలపై సర్వే నిర్వహించింది. ఒక్కో వర్గం వోటర్లు ఏం కోరుకుంటున్నారు, ఎదుర్కొంటున్న సమస్యలు, ఎవరు గెలిస్తే నియోజకవర్గం బాగుంటుంది వంటి అభిప్రాయాలను సేకరించింది. పార్టీ తన వ్యూహం అమలులో ఈ సమాచారం కీలకంగా మారింది. ముందుకొచ్చిన బ్యాంకు.. ఈ సమాచార నిధి ఇప్పుడు బ్యాంకులతోసహా వివిధ రంగాలను ఆకట్టుకుంటోంది. నెల రోజుల్లోగా ఒక పెద్ద బ్యాంకు తమతో చేతులు కలుపుతోందని చీఫ్ అనలిస్ట్ ఆఫీసర్ మిలింద్ చిత్గూపకర్ తెలిపారు. తమ వద్ద ఉన్న సమాచారంతో.. ‘ఒక వ్యక్తి ఖర్చులను ట్రాక్ చేస్తే అతనికి బీమా పాలసీ, రుణం, క్రెడిట్ కార్డు ఇవ్వొచ్చా లేదా విశ్లేషించుకోవచ్చు. వేతన జీవులు అధికంగా ఎక్కడున్నారో తెలిస్తే బ్యాంకు శాఖ లేదా రిటైల్ ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేయవచ్చు అని వివరించారు. బీమా, ఎఫ్ఎంసీజీ, రిటైల్, టెలికంతోపాటు ప్రభుత్వ సంస్థలతో చర్చించనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం 6 పేటెంట్లు దక్కించుకున్నామని, మరో 3 పేటెంట్లకు దరఖాస్తు చేయనున్నట్టు పేర్కొన్నారు. అమెరికా తదితర దేశాలకు విస్తరిస్తామని తెలిపారు.