breaking news
bhuma nagireddy arrest
-
'భూమా ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం'
కర్నూలు: పీఏసీ చైర్మన్, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని వైఎస్సార్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఆయనకు ఏదైనా జరిగితే జిల్లా పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. భూమాపై అక్రమ కేసుల నమోదు, అరెస్టు, జైలుకు తరలింపు నేపథ్యంలో కర్నూలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, గౌరు చరిత, మణిగాంధీ, జిల్లా మాజీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డిలు మాట్లాడారు. భూమా నాగిరెడ్డికి ఇప్పటికే గుండె శస్త్రచికిత్స జరిగిందని.. బీపీ, షుగర్‌తో బాధపడుతున్నారన్నారు. అయినప్పటికీ పోలీసులు నిమ్స్‌కు తరలించేందుకు సెక్యూరిటీ ఇవ్వలేమంటూ అడ్డుపుల్లలు వేస్తున్నారని విమర్శించారు. మహిళా శాసనసభ్యురాలు అని కూడా చూడకుండా భూమా అఖిలప్రియతో పోలీసులు నువ్వు అని సంబోధిస్తూ అమర్యాదగా మాట్లాడారని ధ్వజమెత్తారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కేబినెట్ హోదా కలిగిన పీఏసీ చైర్మన్‌తో పోలీసులు ప్రవర్తించిన తీరు, మహిళా ఎమ్మెల్యేతో వ్యవహరించిన తీరుపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ కూడా ప్రవేశపెడతామన్నారు. -
'భూమా అరెస్టు ద్వారా గెలవాలనుకోవడం దుర్మార్గం'
తిరుపతి : ఆంధ్రప్రదేశ్‌లో నియంతపాలన సాగుతోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నారాయణస్వామి ఆరోపించారు. చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అరెస్ట్ ద్వారా గెలుపొందాలనుకోవడం దుర్మార్గమని ఆయన విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీనే టార్గెట్ చేశారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికుట్రలు పన్నినా వైఎస్ఆర్సీపీ పోరాటాలు ఆపలేరని ఆ పార్టీ ఎమ్మెల్యే నారాయణస్వామి వివరించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు.