breaking news
beeti wangadalu
-
పత్తి.. సూటి రకాలే మేటి!
ఖరీఫ్‌లో వర్షాధారంగా సాగయ్యే ప్రధాన వాణిజ్య పంట పత్తి. గత ఐదారేళ్లుగా పత్తి పంటలో దిగుబడి తగ్గిపోతున్నది. తెగుళ్లు, గులాబీ రంగు పురుగు దాడి కారణంగా ఏటికేడు దిగుబడి పడిపోతోంది. బీటీ రకాలు తెల్లబోతున్నాయి. ఇక బీటీ మాయలో పడిన రైతులు పాత రకాలను సాగు చేయడమే మరచిపోయారు. సరైన విత్తనం ఎంపిక చేసుకొని మెలకువలు పాటిస్తే నాన్ బీటీ హైబ్రిడ్ రకాలు తీసిపోవని చాటుతోంది ‘రైతు రక్షణ వేదిక’. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ రిటైర్డ్ ప్రొఫెసర్ వేణుగోపాల్, రైతు శాస్త్రవేత్త జొన్నలగడ్డ రామారావు, రైతు నేత డాక్టర్ కొల్లా రాజమోహనరావు, రైతు సంఘాల నేతలు, కొందరు అభ్యుదయ రైతులు కలిసి గుంటూరు కేంద్రంగా రైతు రక్షణ వేదికను ఏర్పాటు చేశారు. కొన్నేళ్లుగా సూటి రకాల ప్రదర్శనా క్షేత్రాలను నిర్వహిస్తూ పాత రకాల ఆవశ్యకతను తెలియ జేస్తున్నారు. బిటీ పత్తికి ప్రత్యామ్నాయంగా సూటి రకాలను ప్రోత్సహిస్తున్నారు. ‘రైతు రక్షణ వేదిక నిర్వహిస్తున్న ప్రదర్శన క్షేత్రాలను ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎన్. దామోదర నాయుడు ఇటీవల సందర్శించి సంతృప్తిని వ్యక్తం చేశారు. సూటి రకం విత్తనాలతో ఖర్చు తగ్గుతోందని, ఇతర పంటల రైతులతో పాటు పత్తి రైతులు కూడా తమ విత్తనాలను తామే తయారు చేసుకొనే విధంగా ప్రోత్సహిస్తామని ఆయన పేర్కొనడం ఆహ్వానించదగిన పరిణామం. పత్తిలో సమగ్ర సస్య పోషణ, రక్షణల ద్వారా కాయతొలిచే పురుగులతో పాటు అత్యంత బెడదగా మారిన పచ్చదోమ, తెల్లదోమల బెడద కూడా లేకుండా పోయింది. రైతులు పండించిన పత్తిలో నుంచే సేకరించిన విత్తనాలతోనే ప్రధాన వాణిజ్య పంట అయిన పత్తిని కూడా ఇతర పంటల మాదిరిగానే సాగు చేయటంలో గుంటూరుకు చెందిన రైతు రక్షణ వేదిక విజయం సాధించింది. అనేక ఏళ్ల నుంచి ఈ దిశగా కృషి చేస్తున్న వేదిక సభ్యులైన రైతులు, విశ్రాంత శాస్త్రవేత్తలు, రైతు సంఘాల కార్యకర్తలు ఈ ఖరీఫ్‌లో మరింత విస్తృతంగా నాన్ బీటీ సూటి రకం పత్తి సాగును చేపట్టడం విశేషం. సూటి రకం పత్తి విత్తనాలతో రైతుకు ఖర్చు తక్కువ, నాణ్యమైన దిగుబడి, వివిధ పురుగులను నిరోధించే అవకాశం ఉంది. 15 చోట్ల రైతుల ప్రదర్శనా క్షేత్రాలు 2018–19 సంవత్సరంలో గుంటూరు జిల్లాలో 15 ప్రదేశాల్లో సూటి రకం నాన్ బీటీ పత్తి పంటను సాగు చేస్తూ నమూనా (ప్రదర్శనా) క్షేత్రాలను ఏర్పాటు చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతం నుంచి వచ్చిన విత్తనాలనే వినియోగించి సఫలీకృతులయ్యారు. రైతులు ప్రయోగాత్మకంగా చేపట్టిన కార్యక్రమం పూర్తిస్థాయిలో విజయవంతమైంది. దీంతో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ డా. దామోదర నాయుడు, లాం ఫాం డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డా. ఎన్వీ నాయుడు, లాంఫాం శాస్త్రవేత్త డా. దుర్గాప్రసాద్ చిలకలూరిపేట మండలం మానుకొండవారిపాలెంలోని తియ్యగూర శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరెడ్డిల ప్రదర్శనా క్షేత్రాలను స్వయంగా పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. రైతులను అభినందించారు. సూటి రకం పత్తితో 30% తగ్గిన ఖర్చు రైతులు బీటీ విత్తనాలకు బదులుగా సూటి విత్తనాలు (నాన్ బీటీ) సాగు చేస్తే 30 శాతం ఖర్చు తగ్గుతుంది. ఆశించిన దిగుబడి లభిస్తుంది. రైతులు సూటీ పత్తిని సాగు చేయటంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని రైతు రక్షణ వేదిక నేతలు తెలిపారు. గుంటూరు జిల్లాలోని గుంటూరు రూరల్, వట్టిచెరుకూరు, కొర్నెపాడు, ప్రత్తిపాడు, పెదనందిపాడు, చిలకలూరిపేట, ఫిరంగిపురం, మంగళగిరి తదితర ప్రాంతాల్లోని 650 ఎకరాల్లో ఈ ఖరీఫ్‌లో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. రైతులు నంద్యాల నుంచి ఎన్‌డీఎల్‌హెచ్–1938, రైతు రక్షణ–02 నాన్‌బీటీ సూటి రకాల పత్తిని సాగు చేస్తున్నారు. లాంఫాం, కృషి విజ్ఞాన కేంద్రం, డాట్ సెంటర్లకు చెందిన శాస్త్రవేత్తలు అందుబాటులో ఉండి సూచనలు సలహాలు అందిస్తారన్నారు. సూటి రకాల సేంద్రియ సాగు ఇలా.. దుక్కిలో పశువుల ఎరువుతో కలిపిన వామ్(జీవన ఎరువు) ఎకరానికి ఐదు కేజీలు వేయాలి. చివరి దుక్కిలో ఎకరానికి వేప పిండి రెండు క్వింటాళ్ళు వేయాలి. నాన్ బీటీ సూటి రకం పత్తి విత్తనాలు విత్తుకోవాలి. నాన్‌బీటీ విత్తనాలు సాగులో ఉన్న పొలం చుట్టూ జొన్న, కొర్ర, ఆముదం మొక్కలు రెండు – మూడు సాళ్ళు(వరుసలు) రక్షక పంటగా వేయాలి. పత్తి మొక్క దశలో రెండు విడతలు వేపనూనె, మోనోక్రోటోఫాస్, మిథైల్ ఆల్కాహాల్ కలిపిన ద్రావణాన్ని కాండానికి కుంచెతో పూయాలి. వేప కషాయాన్ని మరగబెట్టగా వచ్చిన ద్రావణాన్ని పిచికారీ చేస్తే జల్లెడ పురుగు, తెల్లదోమ గూడ పురుగులను అదుపులోకి తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. గులాబీ రంగు పురుగు నివారణకు ఒక ఎకరానికి 10 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలి. సూటి పత్తిలో కొర్ర, అలసంద, మినుము తదితర అంతర పంటలను సాగు చేసుకునే వెసులుబాటు ఉంది. నీటి వసతి అందుబాటులో ఉన్న రైతులు నెలకు ఒక విడత చొప్పున ఆరుతడులు అందిస్తే మరింత ప్రయోజనం ఉంటుంది. ఈ విధంగా చేస్తే పత్తి దిగుబడులు హైబ్రిడ్ పత్తికి దీటుగానే వస్తాయని రైతు రక్షణ వేదిక రైతులు అనుభవపూర్వకంగా చెబుతున్నారు. ఈ సూటి రకాల పత్తి పింజ పొడవు, నాణ్యత బాగానే ఉంటుంది. అధిక శాతం రైతులు ఈ పత్తిని సాగు చేస్తే మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని వారు అంటున్నారు. దిగుబడుల్లో రాజీ పడకుండానే కంపెనీల విత్తనాలను పక్కన పెట్టి సొంత సూటి రకం పత్తి విత్తనం వాడుకునే సత్సాంప్రదాయానికి బాటలు వేస్తున్న రైతు రక్షణ వేదిక సభ్యులైన రైతులు అభినందనీయులు. వర్షం తక్కువైనా ఏపుగా పెరిగింది! నంద్యాల నుంచి తీసుకు వచ్చిన సాధారణ విత్తనాలతో 2.50 ఎకరాల్లో పత్తిని సాగు చేశాం. పత్తి పొలం చుట్టూ ఇతర పురుగులు రాకుండా జొన్న విత్తనాలు నాటాం. గులాబీ రంగు పురుగు, పచ్చదోమ, తెల్లదోమ తదితర క్రిమి కీటకాలు రాలేదు. వర్షం తక్కువగా పడినా పంట ఏపుగా పెరిగింది. ఆశించిన స్థాయిలో పూత ఉంది. బీటీ తరహాలోనే దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాం. శాస్త్రవేత్తలు పరిశీలించి పలు సూచనలు, సలహాలు అందించారు. --తియ్యగూర వెంకటేశ్వరరెడ్డి (97044 97442), రైతు, మానుకొండవారిపాలెం, చిలకలూరిపేట రూరల్ రసాయనాల్లేని సాగులో బీటీకి మించిన దిగుబడి రైతులు పండించిన పత్తి పంట ద్వారా వచ్చిన విత్తనాలనే వినియోగించి ప్రయోగాత్మకంగా పరిశీలించాం. పంట ఆశాజనకంగా ఉంది. రసాయనిక ఎరువులు, పురుగు మందులను వినియోగించలేదు. అయినా, పంట ఎదుగుదల ఆశాజనకంగానే ఉంది. బీటీకి మించిన దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా క్షేత్రోత్సవాలను నిర్వహించి ప్రచారం కల్పిస్తాం. ఈ పద్ధతిలో సాగు చేసే రైతులకు చేయూతనందిస్తాం. – డాక్టర్ కొల్లా రాజమోహనరావు (90006 57799), సమన్వయకర్త, రైతు రక్షణ వేదిక, గుంటూరు సూటి రకాలు గులాబీ పురుగునూ తట్టుకున్నాయి! పక్కపక్కన పొలాల్లో సాగు చేసిన సూటి రకం, బీటీ రకం పత్తి పంటల్లో స్పష్టమైన తేడాను గమనించవచ్చు. రైతు రక్షణ వేదిక ఆధ్వర్యంలో కంపెనీ బీటీ హైబ్రిడ్ పత్తి విత్తనాలకు ప్రత్యామ్నాయంగా సూటి రకం నాన్ బీటీ విత్తనాలను రైతులకు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. నంద్యాల–1938 రకం, రైతు రక్షణ–02 అనే నాన్ బీటీ సూటి రకాల విత్తనాలు రసం పీల్చే పురుగులతో పాటు గులాబీ రంగు పురుగుల బెడదను తట్టుకున్నాయి. దీంతో పాటు రైతు రక్షణ వేదిక ద్వారా తయారైన హైబ్రిడ్‌ను కూడా సరఫరా చేస్తున్నాం. రైతు రక్షణ వేదిక ద్వారా తయారుచేసే హైబ్రిడ్ ప్రత్యామ్నాయ రకం వెరైటీని ప్రోత్సహిస్తే రైతుకు స్వావలంబన కలుగుతుంది. రసాయనిక వ్యవసాయం వల్ల వ్యవసాయ ఖర్చులు ఎక్కువై నష్టం జరుగతోంది. జీవన ఎరువులు, పశువుల ఎరువును వాడుకుంటే రసాయన ఎరువులను ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. – ప్రొఫెసర్ వేణుగోపాల రావు (94900 98905), విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త, రైతు రక్షణ వేదిక మానుకొండవారిపాలెంలో పూత దశకు చేరుకున్న సూటిరకం పత్తి పొలం – ఓ.వెంకట్రామిరెడ్డి, అమరావతి బ్యూరో, గుంటూరు ఫొటోలు : లీలానంద్, చిలకలూరిపేట రూరల్ -
జీఎం వంగడాలపై గోప్యమేల?
విశ్లేషణ జన్యుపరంగా మెరుగుపర్చిన వంగడాలపై కేంద్ర పర్యావరణ శాఖ గోప్యత పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. భారత్‌లోకి బీటీ వంగడాల ప్రవేశానికి జన్యుపరంగా మెరుగుపర్చిన ఆవ విత్తనం నాంది పలకనుండటం ప్రమాదఘంటికలను మోగిస్తోంది. ఇండియాలో జన్యుపరంగా రూపొందించిన కొత్తరకం ఆవ పంట సాగుకోసం ఒక రహస్య అప్లికేషన్‌ను రూపొందిం చారు. భారతీయ జెనెటిక్ ఇంజనీరింగ్ మదింపు కమిటీ (జీఈఏసీ) ఈ కొత్త అప్లికేష న్ను ఆమోదించినట్లయితే వరి, గోధుమ, సెనగలు వంటి ప్రధాన పంటలలో కూడా అలాంటి అప్లికేషన్లకు దారి సుగమమయ్యేందుకు ఎక్కువ రోజులు పట్టవని భావిస్తు న్నారు. ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన దీపక్ పెంతల్ అనే డెవలపర్ ధార ఆవ హైబ్రిడ్ 11 పేరిట కొత్త ఆవ విత్త నాన్ని రూపొందించారు. ఈ సరికొత్త జీఎం వంగడాలు 30 శాతం అదనపు పంట దిగుబడినిస్తాయని చెప్పారు. ఈ కొత్త వంగడంపై నిర్ణయం తీసుకునేందుకు జన్యు ఇంజనీరింగ్ మదింపు కమిటీ వచ్చేవారం సమా వేశం కానుంది. జీఎం పంటల క్షేత్రస్థాయి నమూనా లకు, వాటి వాణిజ్యపరమైన విక్రయాలకు సంబంధిం చిన అన్ని ప్రతిపాదనలను ఈ కమిటీయే ఆమోదించ వలసి ఉంటుంది.ఇది కేంద్ర పర్యావరణ, అటవీ, వాతా వరణ మార్పు మంత్రిత్వశాఖలో భాగం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే జీఈఏసీ వెబ్ సైట్ మాత్రం ఈ కొత్త వంగడం వివరాలను పొందుప ర్చలేదు. పైగా చాలా సంవత్సరాలుగా ఇది అప్డేట్ అవుతున్నట్లు కూడా లేదు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పరిస్థితికి సంబంధించి ఈ వెబ్‌ైసైట్‌లో ఉన్న వివరాలు 2007 ఏప్రిల్ నాటి తేదీతో ఉండటం గమనార్హం. పత్తి, మొక్కజొన్న, వంకాయ, సెనగలు, వరి, గోధుమ వంటి ఆరు బీటీ వంగడాల క్షేత్రస్థాయి నమూ నాలకు చెందిన 17 అప్లికేషన్లపై చర్చించడానికి జీఈఏసీ ఒక రహస్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లుగా సెప్టెంబర్ 3న నాటి ఎకనమిక్ టైమ్స్ పత్రిక బయటపెట్టింది. సెప్టెంబర్ 3నే జీఈఏసీ రహస్యంగా సమావేశమవుతోం దని, సంబంధిత అప్లికేషన్లపై నిర్ణయాలు కూడా తీసుకో వడం జరుగుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని పర్యా వరణ మంత్రిత్వశాఖ అధికారి తెలిపారని ఆ పత్రిక తెలి పింది. మంత్రి ఆమోదం పొందితే కానీ వీటి వివరాలను వెల్లడించలేమని ఆ అధికారి వివరించారు. బీటీ వంగడాలను విచక్షణారహితంగా ప్రోత్సహి స్తున్న భారత ప్రభుత్వాన్ని జీఎం పంటల వ్యతిరేక కార్య కర్త అరుణా రోడ్రిగ్స్ 2013లో భారత సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ప్రస్తుతం వెలుగులోకి తీసుకురానున్న సరికొత్త జీఎం వంగడాల పట్ల పాటిస్తున్న గోప్యతను ఆమె తీవ్రంగా ఖండించారు. జీఎం ఆవ విత్తనాలకు సంబంధించిన డేటా మొత్తాన్ని ప్రజలనుంచి, స్వతంత్ర శాస్త్రజ్ఞుల నుంచి పర్యావరణశాఖ అధికారులు పూర్తిగా దాచి పెడుతున్నారని, ఈ క్రమంలో వారు రాజ్యాంగ నిబంధనలను, సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా వారు ధిక్కరిస్తున్నారని ఆమె ఆరోపించారు. వాస్తవానికి జీవ భద్రతకు సంబంధించిన డేటాను ప్రజలకు అందుబా టులో ఉంచాలని 2008లోనే సుప్రీంకోర్టు ఆదేశించింది. భారతీయ వ్యవసాయరంగంలో జన్యువైవిధ్య పం టలను ప్రవేశపెట్టడానికి భారత ప్రభుత్వం లోపాయి కారీ విధానాలను అవలంబిస్తోం దని, ప్రభుత్వం అను సరిస్తున్న ఈ ప్రజా వ్యతిరేక వైఖరి వల్ల ఈ మొత్తం ప్రక్రి యలో సైన్సుకు, పారదర్శకతకు తావే లేకుండాపోతోం దని దేశీయ పంటల సమర్థకులు ఆక్షేపిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ జన్యు ఇంజనీరింగ్ మదింపు కమిటీ అసాధారణ గోప్యతను అనుసరించడంపై వీరు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జీఎం ఆవ వంగడాల వంటి కొత్త అప్లికేషన్లకు సంబంధించి ప్రభుత్వ రెగ్యులేటరీ సంస్థల లోపల ఏం జరుగుతోందన్న విషయం దేశప్రజలకు ఏమాత్రం తెలి యడం లేదని, జీవ భద్రత డేటాను ఇవ్వాల్సిందిగా పదే పదే తాము చేస్తున్న అభ్యర్థనలను రెగ్యులేటరీ సంస్థలు తోసిపుచ్చుతున్నాయని వీరు వాపోతున్నారు. జన్యుప రంగా రూపొందించిన వంగడాలలోని భద్రతపై ప్రభు త్వ రెగ్యులేటర్ సంస్థలు ఇచ్చిన హామీ పూర్తిగా తప్పు అని 2013లోనే సుప్రీంకోర్టు సాంకేతిక నిపుణుల కమిటీ తేల్చివేసిన నేపథ్యంలో జన్యువంగడాల భద్రతపై పర్యా వరణ అధికారుల హామీని ఎలా విశ్వసించాలి? జన్యు వంగడాలపై ప్రభుత్వం మరింత నిగూఢత్వాన్ని, అస్పష్ట తను కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం సురక్షి తమేనా, శాస్త్రీయమైనదేనా అని తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. జన్యు వంగడాల ప్రమాదాన్ని అంచనా వేయ డంలో స్వతంత్ర పరిశోధన, సమగ్రత లోపిస్తున్నందున భారత్‌లో జన్యువైవిధ్య పంటలను ప్రవేశపెట్టడాన్ని నాలుగు అధికారిక నివేదికలు ఇప్పటికే వ్యతిరేకించాయి. 2010 ఫిబ్రవరిలో జైరామ్ రమేష్ నివేదిక బీడీ వంగ విత్తనాలపై నిరవధిక నిషేధాన్ని ప్రతిపాదించింది. అలాగే సోపారీ కమిటీ నివేదిక, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక, సుప్రీంకోర్టు సాంకేతిక నిపుణుల కమిటీ నివేదిక కూడా ఇటీవలి కాలంలో జీఎం పంటల క్షేత్ర నమూనాలపై నిరవధిక నిషేధాన్ని సిఫార్సు చేశాయి. ఈ నేపథ్యంలో జీఎం ఆవ వంగడం ప్రాసెస్‌పై, దాన్ని ఆమోదించటంపై తక్షణం జోక్యం చేసుకోవాలని జీఎం ఫ్రీ ఇండియా డిమాండ్ చేసింది. ఇతర జీఎం పంటలకు ఆమోదం తెలిపేందుకే జీఎం ఆవ వంగడాన్ని దొడ్డి దారిన తీసుకువస్తున్నారన్నది స్పష్టమౌతోంది. దేశ వ్యవ సాయరంగం పునాదులను కబళించడానికి వస్తున్న జీఎం పంట వంగడాలను అడ్డుకోవలసిన కర్తవ్యం దేశ ప్రజలందరిదీ. (colintodhunter.com సౌజన్యంతో...) కాలిన్ టోడ్‌హంటర్‌తో టికిల్