breaking news
Beedi Company
-
అనర్హులకు ‘బీడీ పింఛన్’
వేములవాడరూరల్: తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ప్రభుత్వాన్ని, అధికారులను మోసం చేసి లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్మును పింఛన్ రూపంలో కాజేస్తున్నవారి గుట్టు రట్టయింది. ఎలాంటి అర్హతలు లేకుండా బీడీ కంపెనీ యజమానుల నుంచి ధ్రువీకరణ పత్రాలు పొంది మధ్య దళారులకు కమీషన్లు ఇస్తూ పింఛన్ పొందుతున్న కొంతమంది బండారం బట్టబయలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రూరల్ మండలం, అర్బన్ మండలంలోని దాదాపు 29 గ్రామాల్లో 10,295 మంది లబ్ధిదారులు వివిధ పథకాల కింద ప్రభుత్వ సొమ్మును పొందుతున్నారు. వీరికి ప్రభుత్వం ప్రతినెలా రూ.1.12 లక్షలు అందిస్తుంది. ఇందులో ప్రధానంగా 3,506 మంది మహిళలు బీడీ కార్మికుల పింఛన్ పొందుతున్నారు. వీరికి ఒక్కొక్కరికి రూ. వెయ్యి చొప్పున నెలనెలా బ్యాంకులో జమ అవుతున్నాయి. అయితే వీరిలో చాలామంది బీడీ కంపెనీల నుంచి తప్పుడు ధ్రువీకరణ పత్రాలను పొంది ప్రభుత్వం నుంచి పింఛన్ పొందుతున్నట్లు తెలిసింది. వేములవాడ మండలంలో నెలకు రూ.2 లక్షలు బోగస్ లబ్ధిదారులు తీసుకుంటున్నట్లు అధికారుల విచారణలో బయటపడింది. కలెక్టర్ కృష్ణభాస్కర్ బోగస్ లబ్ధిదారులను గుర్తించేందుకు జిల్లా డీఆర్డీఏ, అడిషనల్ అధికారి మదన్మోహన్, ప్రత్యేక అధికారిగా నియమిస్తూ విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో వేములవాడ రూరల్ మండలంలోని కోనాయిపల్లి గ్రామంలో 24 మంది బీడీ కార్మికులు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి లబ్ధి పొందుతున్నట్లు బయటపడింది. ఈ విషయంపై ఎంపీడీవో వేణుగోపాల్‌తో చర్చించి వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పింఛన్ పొందుతున్న 24 మంది బీడీ కార్మికులపై కేసు నమోదు చేసినట్లు వేములవాడ సీఐ వెంకట స్వామి తెలిపారు. -
చిచ్చు రేపిన యాక్సిడెంట్
♦ అనుమానంతో బీడీ కంపెనీ టేకేదారుని చితకబాదిన సర్పంచ్ కుమారులు ♦ టేకేదారు మృతి.. సర్పంచ్ ఇంటికి నిప్పంటించిన మృతుడి బంధువులు ♦ సర్పంచ్, ఆమె కోడలిని సజీవ దహనం చేసేందుకు యత్నం ♦ మెదక్ జిల్లా ఇబ్రహీంపూర్లో 4 గంటలపాటు తీవ్ర ఉద్రిక్తత సిద్దిపేట రూరల్/సిరిసిల్ల రూరల్/ముస్తాబాద్: చిన్న యాక్సిడెంట్.. ఎవరు చేశారో కూడా సరిగ్గా తెలియదు.. కానీ రెండు జిల్లాల మధ్య చిచ్చు రేపింది.. ఒకరి మృతికి కారణమైంది! మృతుడి బంధువుల దాడిలో సర్పంచ్ ఇల్లు కాలి బుగ్గైంది! ఏకంగా 600 మంది ఆగ్రహావేశాలతో ఒకేసారి దాడికి దిగడంతో నాలుగు గంటలపాటు ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది. మెదక్ జిల్లా సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. చిచ్చు రేగిందిలా.. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం జిల్లెల్లకు చెందిన శ్రీరాం శ్రీహరి (33)కు భార్య, ఇద్దరు పిల్లలు. ఠాకూర్ శంకర్ బీడీ కంపెనీలో టేకేదారు(మునీం)గా పనిచేస్తున్న శ్రీహరి ముస్తాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది, సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్, బంజేరుపల్లి, చిన్నకోడూరు మండలం మాటిండ్ల, శేఖర్‌రావుపేట గ్రామాల్లో టేకేదారుగా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం ఆయన ఇబ్రహీంపూర్‌కు బైక్‌పై వచ్చాడు. అదే సమయంలో ఇబ్రహీంపూర్ సర్పంచ్ కుంబాల లక్ష్మి అటుగా వస్తున్నారు. ఈ సమయంలో ఓ టేకేదారు (ఎవ రో తెలియదు) బైక్‌పై బీడీల గంపతో వెళ్తుండగా.. గంప అంచు లక్ష్మి చీరకు తాకి కొంగు చిరిగిపోయింది. ఇది గమనించకుండానే టేకేదారు వెళ్లిపోయాడు. సర్పంచ్ లక్ష్మి తన ఇంటికి వెళ్లి విషయం చెప్పడంతో ఆమె కుమారులు ఎల్లారెడ్డి, నగేష్రెడ్డితోపాటు మరికొందరు కలసి గ్రామంలోనే ఉన్న శ్రీహరే యాక్సిడెంట్ చేసి ఉంటాడని నిర్బంధించారు. సుమారు 3 గంటల పాటు అతడిపై దాడికి పాల్పడ్డారు. కొన ఊపిరితో ఉన్న శ్రీహరి తన బంధువులకు సమాచారం ఇవ్వడంతో.. వారు ఆయన్ను ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. అయితే తీవ్ర గాయాలపాలవడంతో శుక్రవారం తెల్లవారుజామున రక్తం కక్కుకొని చనిపోయాడు. పేలిన సిలిండర్లు.. కాలిన ఇల్లు శ్రీహరి మరణంతో ఆయన బంధువులు తీవ్ర ఆగ్రహావేశాలతో ఇబ్రహీంపూర్ చేరుకున్నారు. శవాన్ని సర్పంచ్ ఇంటి ముందు పెట్టి ఆందోళనకు దిగారు. సుమారు 600 మందికిపైగా తరలిరావడంతో పోలీసులు వారిని నిలువరించలేకపోయారు. ఇంట్లో ఉన్న సర్పంచ్ లక్ష్మి, ఆమె కొడలిపై దాడి చేసి నిర్బంధించారు. ఓ దశలో వారిని సజీవ దహనం చేయడానికి యత్నించారు. కాసేపటికి సిద్దిపేట రూరల్ ఎస్సై రాజేంద్రప్రసాద్, ఓ ముగ్గురు కానిస్టేబుళ్లుతో అక్కడికి చేరుకున్నారు. అతి కష్టమ్మీద ఇంట్లో ఉన్న వారిని బయటకు తీసుకొచ్చారు. దీంతో మృతుని బంధువులు సర్పంచ్ ఇంటిపై కిరోసిన్‌ను పోసి నిప్పంటించారు. మంటలను ఆర్పేందుకు వచ్చిన ఫైర్ ఇంజన్‌ను సైతం అడ్డుకున్నారు. అడ్డుకున్నారు. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇదే సమయంలో ఇంట్లో ఉన్న రెండు గ్యాస్ సిలిండర్లు పెద్ద శబ్దంతో పేలిపోయాయి. దీంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. 600 మంది దాడి చేస్తుంటే తగినంత బలగాలు లేక పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. ఉదయం 8 గంటలకు మొదలైన గొడవ నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అడ్డూ అదుపు లేకుండా సాగింది. ఆందోళనకారుల దాడిలో రూరల్ ఎస్సై రాజేంద్రప్రసాద్, కవరేజ్ కోసం వెళ్లిన ఓ చానెల్ విలేకరి గాయపడ్డారు. చివరగా డీఎస్పీ శ్రీధర్ రంగ ప్రవేశం చేసి లాఠీ చార్జీ చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అనంతరం శ్రీహరి శవాన్ని పోలీసులు ట్రాక్టర్లో వేసుకొని పోస్టుమార్టం కోసం పంపించారు. గ్రామాల్లో పోలీసు పికెట్ ఉద్రిక్తత నెలకొనడంతో ఇబ్రహీంపూర్తోపాటు సిరిసిల్ల మండలం జిల్లెల్ల, ముస్తాబాద్ మండలం తెర్లుమద్దిలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. వరంగల్ రేంజ్ ఐజీ నవీన్‌చంద్ ఇబ్రహీంపూర్‌ను సందర్శించారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. మెదక్, కరీంనగర్ జిల్లాల ఎస్పీలు సుమతీ, జోయల్ డేవిస్ కూడా గ్రామాన్ని సందర్శించారు.