breaking news
bc schools
-
భద్రత నిల్
నెల్లూరు రూరల్ : గురుకుల పాఠశాలల్లో బాలికలకు రక్షణ కరువవుతోంది. ప్రిన్సిపల్స్ తప్ప మిగతా సిబ్బంది, అధ్యాపకులు అవుట్ సోర్సింగ్ కావడంతో వారిలో బాధ్యత కొరవడింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కనీస వసతులు కరువయ్యాయి. దీంతో విద్యార్థుల బాధలు వర్ణనాతీతం. రెగ్యులర్ అధ్యాపక సిబ్బంది లేకపోవడం, అరకొర అద్దె భవనాలు, మరుగుదొడ్లు, స్నానపు గదుల కొరతతో పాటు భద్రత కరువవడంతో విద్యార్థినులు క్షణ క్షణం భయంతో గడుపుతున్నారు. నెల్లూరులోని ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థినిపై అత్యాచార సంఘటన జిల్లాలో కలకలం రేపింది. ..ఈ నేపథ్యంలో గురుకులాల భద్రతపై సాక్షి ప్రత్యేక కథనం..గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు గురుకుల పాఠశాల ద్వారా సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తామని ఊదరకొడుతున్న టీడీపీ ప్రభుత్వం ఆదిశగా అడుగులు వేయడం లేదు. నేటికీ అద్దెభవనాల్లో చాలీచాలని గదుల్లో నిర్వహిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోంది. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, బాత్రూంలు, మరుగుదొడ్ల మరమ్మతుల కోసం నిధుల విడుదల జాప్యంతో గురుకులాల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. హాస్టళ్లలోని బాత్రూమ్లు, మరుగుదొడ్లు శిథిలావస్తకు చేరాయి. తలుపులు విరిగి, ఉన్నవాటికి కన్నాలు పడి ఉన్నాయి. మరి కొన్నింటికి తలుపులు లేకుండా దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం ఏడాదికి ఒక్క సారైనా హాస్టల్‌కు రంగులు వేయించడం, విద్యార్థులకు కనీస మౌళిక సదుపాయాలు కల్పించడం మరిచారు. బాలికల గురుకులాల్లో రక్షణ కరువవుతోది. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు, రక్షణగా ఉండాల్సిన సిబ్బంది బాలికలపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పరువు పోతుందని బాధిత విద్యార్థులను భయపెట్టి దారుణాలు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒకరిద్దరు ధైర్యం చేసి తమకు జరిగిన అన్యాయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా వారికి న్యాయం జరగడం లేదు. నెల్లూరు బాలికల గురుకుల పాఠశాలలో గత నెల 21వ తేదీన అత్యాచారం జరిగిందని చిన్నారి టీచర్‌కు, వార్డెన్‌కు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి ఉంటే దారుణానికి పాల్పడిన వారు దొరికేవారు. బంధువులు కేసు పెట్టినా ఉన్నతాధికారులు రాజీ కోసం ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ సంఘటనతో గురుకులాల్లోని బాలికలు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 43 గురుకుల పాఠశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిలో 15 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఏపీ రెసిడెన్సియల్ స్కూల్స్ వెంకటగిరి, ఉదయగిరి, చిలమానుచేను, తుమ్మలపెంట, ఆత్మకూరు, గండిపాళెం, నెల్లూరులోని మైనారిటీ గురుకులాలు నిర్వహిస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొడవలూరు మండలం చంద్రశేఖర్‌పురంలో బాలికల గురుకుల పాఠశాల, చిట్టేడు, సోమశిల బాలుర గురుకుల పాఠశాలు నడుస్తున్నాయి. అదే విధంగా చెన్నూరు, ఓజిలి, సర్వేపల్లి, నెల్లూరు నగరంతో పాటు మొత్తం 13 మినీ గురుకులాలు గిరిజన కురులకు పాఠశాలలు నడుస్తున్నాయి. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కోట, దొరవారిసత్రం, గొలగమూడిలో గురుకులాలు నడుస్తున్నాయి. ఈ ఏడాది నుంచి కావలి నియోజకవర్గంలోని నార్త్ అమలూరు, గూడూరు, ఆత్మకూరు పట్టణాల్లోని బాలికల హాస్టల్స్, సర్వేపల్లి నియోజకవర్గంలోని మహ్మదాపురం, వెంకటగిరి బాయ్స్ హాస్టల్స్‌ను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చుతున్నట్లు ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. సాంఘీక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సూళ్లూరుపేట, కుదురు, నాయుడుపేట, కండలేరు, డక్కిలి, ఆదూరుపల్లి, సంగం, బుచ్చిరెడ్డిపాళెం, కోడూరు, కావలి, ముత్తుకూరులోని బాలికల గురుకులాలు, నాయుడుపేట, చిల్లకూరు, కోట, వాకాడు బాలురు మొత్తం 14 ఎస్సీ, గురుకులాలు నడుస్తున్నాయి. కొడవలూరు: గిరిజన బాలికల కోసం కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలో గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల ఉంది. ఐదో తరగతి నుంచి పదో తరగతి దాకా ఉన్న పాఠశాలలో 554 మంది బాలికలుండగా, జూనియర్ కళాశాలలో 220 మంది విద్యార్థినులున్నారు. వీరి భద్రత కోసం పాఠశాల, కళాశాల ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇద్దరు మహిళా కాపాలాదార్లు, ఇద్దరు మహిళా పీఈటీలు రాత్రిళ్లు గురుకులంలోనే ఉండేలా చర్యలు తీసుకొన్నారు. పాఠశాల, కళాశాలకు కలిపి 35 మంది దాకా బోధన సిబ్బంది ఉండగా, వీరందరికీ ఇక్కడే క్వార్టర్ల సౌకర్యం ఉండడంతో రాత్రింబవళ్లు ఇక్కడే ఉంటున్నారు. అనుమతి లేకుండా ఎవరినీ లోనికి రాకుండా చూస్తున్నారు. సంగంలో లేదు భద్రత సంగం: సంగంలో నెల్లూరు – ముంబయి జాతీయ రహదారి పక్కన ఉన్న సంగం గురుకుల కళాశాలలోని బాలికల భద్రత అంతంత మాత్రంగానే ఉంది. గురుకుల కళాశాలలో 640 మంది బాలికలు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు విద్యను అభ్యసిస్తున్నారు. 34 మంది టీచింగ్, నాన్ టీచింగ్ అధ్యాపకులు ఈ కళాశాలలో పనిచేస్తున్నారు. కొండకు దిగువ భాగంలో కళాశాల ఉండడంతో పై నుంచి వచ్చే వారు గురుకుల కళాశాలకు ప్రవేశించేందుకు అనువుగా ఉంది. కళాశాలలో మహిళా వాచ్మెన్లు ఉన్నప్పటికీ రాత్రి సమయంలో ఏదైనా జరిగితే తమ పిల్లల పరిస్థితి ఏమిటంటూ బాలికల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు సైతం గస్తీ నిర్వహించకపోవడంతో విద్యార్థినులు భయాందోళలకు గురవుతున్నారు. గతంలో ఓ యువకుడు గురుకుల కళాశాలలోకి అర్ధరాత్రి సమయంలో ప్రవేశించి హల్చల్ సృష్టించిన సంఘటన ఉంది. అయినా ఇక్కడ ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోలేదు. -
119 బీసీగురుకులాల ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా 119 గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నియోజకవర్గానికి ఒక గురుకులం చొప్పున మంజూరు చేసింది. ఈమేరకు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బి.వెంకటేశం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2017–18 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 119 గురుకుల పాఠశాలలను నియోజకవర్గానికి ఒకటి చొప్పున మంజూరు చేశారు. ఇందులో సగం బాలికల గురుకులాలు కాగా మిగతా సగం బాలుర గురుకులాలున్నాయి. తాజాగా నియోజకవర్గానికొకటి చొప్పున గురుకుల పాఠశాలను ప్రభుత్వం మంజూరు చేసిన నేపథ్యంలో బాలుర గురుకులం ఉన్నచోట బాలికలు, బాలికల గురుకులం ఉన్న చోట బాలుర గురుకులాన్ని ప్రారంభించనున్నారు. వీటి ఏర్పాటుకు సంబంధించి భవనాలను గుర్తించాలని ప్రభుత్వం మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టును ఆదేశించింది. ఈ గురుకులాల్లో ఉద్యోగాలను తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు ద్వారా చేపట్టాలని సూచించింది. -
ప్రభుత్వం వాటిని ఊరించకుండా ప్రారంభించాలి
ముషీరాబాద్: రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 బీసీ రెసిడెన్సియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం అభినందనీయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య అన్నారు. బుధవారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ గురుకులాలపై ఊరిస్తున్న ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి వాటిని ప్రారంభిస్తామనడం తగదన్నారు. ముఖ్యమంత్రికి బీసీల అభివృద్ధిపై చిత్తశుద్ది ఉంటే వెంటనే గురుకులాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు 250, మైనార్టీలకు 71 రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేసిన పాలకులు బీసీలకు ఒక్క రెసిడెన్షియల్ పాఠశాల కూడా మంజూరు చేయకుండా హామీలతో మభ్యపెడుతున్నారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే మంజూరు చేయాలని, హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు రూ.1500 పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ అరుణ్‌బాబు, గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, రాజేందర్, శ్రీనివాస్, రాధాకృష్ణ, సతీష్, రాంబాబు, చందర్ తదితరులు పాల్గొన్నారు.