breaking news
Automobiles Shop
-
కర్నూలులో భారీ అగ్ని ప్రమాదం
కర్నూలు (ఓల్డ్‌సిటీ): నగరంలో శనివారం తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో ఆటోమొబైల్ షాపు పూర్తిగా దగ్ధమైంది. వివరాలిలా ఉన్నాయి.. బాలాజీనగర్‌కు చెందిన అన్నదమ్ములు ఫయాజ్, రియాజ్ పొట్టిశ్రీరాములు పార్కు ఎదురుగా ఉండే దావూద్ కాంప్లెక్స్‌లోని రెండు గదుల్లో ఎఫ్.ఆర్.ఆటోమొబైల్స్ షాపు నిర్వహిస్తున్నారు. ఇందులో టూవీలర్స్ విడిభాగాలతో పాటు ఆయిల్స్ విక్రయించేవారు. రోజు మాదిరిగానే శుక్రవారం రాత్రి 9.30 గంటలకు షాపును మూసేశారు. శనివారం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో షాపులో నుంచి మంటలు రావడం చూసి స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. జిల్లా అగ్నిమాపక అధికారి భూపాల్‌రెడ్డి, సహాయ అధికారి జయన్న సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మంటలుఆర్పివేశారు. అయితే అప్పటికే షాపులోని వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్‌తోనే అగ్నిప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రతిరోజు షాపు బంద్ చేయడానికి ముందు తాము మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తుంటామని, ప్రమాదానికి షార్ట్ సర్యూట్ కారణం కానే కాదని, ఎవరో కావాలనే నిప్పు పెట్టినట్లు బాధితుడు ఫయాజ్ అనుమానం వ్యక్తంచేశారు. ప్రమాదంలో రూ.50 లక్షల దాకా నష్టం వాటిల్లింటుందని ఆయన పేర్కొన్నాడు. బాధితులకు హఫీజ్ ఖాన్ పరామర్శ వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ ఘటన స్థలికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధితుడిని ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
అత్తింటి ఆగడాలకు అబల బలి
ఆడపిల్ల పుట్టిందని వేధింపులు వివాహిత అనుమానాస్పద మృతి ఆత్మహత్య చేసుకుందంటున్న అత్తింటివారు హత్యే అంటున్న మృతురాలి కుటుంబసభ్యులు విజయవాడ క్రైం/గుణదల, న్యూస్‌లైన్ : ఆడపిల్ల పుట్టిందని అత్తింటివారు పెడుతున్న వేధింపులు ఓ వివాహితను బలిగొన్నాయి. ఆత్మహత్య చేసుకుందని అత్తింటి వారు చెబుతుంటే.. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తునారు. విజయవాడలో సంచలనం కలిగించిన ఈ ఘటన ఎల్ఐసీ కాలనీలో గురువారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ ఎల్ఐసీ కాలనీకి చెందిన ఇనుమల నరేష్‌బాబు ఆటోనగర్‌లో ఆటోమొబైల్స్ షాపు నిర్వహిస్తుంటాడు. రెండున్నరేళ్ల కిందట బంటుమిల్లి మండలం నీలిపూడికి చెందిన శాంతిప్రియ (23)తో అతనికి వివాహమైంది. వివాహ సమయంలో ప్రియ కుటుంబసభ్యులు నరేష్ కుటుంబానికి లాంఛనాలు భారీగానే కట్టబెట్టారు. వీరి వివాహమైన కొద్ది రోజులకు నరేష్ తండ్రి అప్పారావు మృతిచెందారు. దీంతో ఆమె అడుగుపెట్టిన వేళావిశేషం మంచిది కాదంటూ అవమానించి సూటిపోటి మాటలతో వేధించేవారు. ఈ నేపథ్యంలో పెద్దలు జోక్యం చేసుకొని నచ్చచెప్పారు. అప్పటి నుంచి తన తండ్రి తన కొడుకు రూపంలో పుడతాడని నరేష్‌బాబు అంటుండేవాడు. అయితే ఏడాది తర్వాత నరేష్ దంపతులకు ఆడపిల్ల పుట్టింది. దీంతో శాంతిప్రియకు అత్తింటివారి వేధింపులు ఎక్కువయ్యాయి. నరేష్ అత్తింటి వారితో సంబంధాలు నెరపడం కూడా పూర్తిగా మానేశాడు. పండగలకు, పబ్బాలకు కూడా భార్యను ఒంటరిగానే పంపేవాడు. అనేకమార్లు అత్తింటివారు బతిమిలాడినా నరేష్ ప్రవర్తనలో మార్పు రాకపోగా.. తల్లి ఇందుమతితో కలిసి వేధింపులు ఎక్కువ చేశాడు. ఈ క్రమంలో శాంతిప్రియ గురువారం విగతజీవురాలై కనిపించింది. మధ్యాహ్నం సమయంలో శాంతిప్రియ ఉరేసుకుందని చెప్పి ఇరుగు పొరుగును పిలిచారు. వారు వచ్చిన తర్వాత కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు చెప్పడంతో ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆమె పుట్టింటికి కబురు చేశారు. ఆమె మృతి సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన తల్లిదండ్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈలోగా సమాచారం అందుకున్న మాచవరం సీఐ సీహెచ్ మురళీకృష్ణారెడ్డి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విచారణ కోసం మృతురాలి భర్త, అత్తను అదుపులోకి తీసుకున్నారు. చంపేశారు... తొలి నుంచి శాంతిప్రియను అనేక ఇబ్బందులు పెట్టారని, ఆడపిల్ల పుట్టడంతో ఆమెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపించారు. గతంలో కూడా వీరు పెట్టే వేధింపులు పలుమార్లు తమ దృష్టికి తీసుకొచ్చినా నచ్చచెప్పి పంపామని, ఇంతటి అఘాయిత్యం జరుగుతుందనుకుంటే పంపేవాళ్లం కాదని వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ‘పోస్టుమార్టం’ ఆధారంగా చర్యలు... ప్రాథమికంగా సేకరించిన సమాచారం మేరకు అనుమానాస్పద కేసుగా నమోదు చేశాం. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాం. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. - సీహెచ్.మురళీకృష్ణారెడ్డి, సీఐ, మాచవరం పోలీస్‌స్టేషన్