breaking news
Assam girl
-
కృతి రికార్డ్
అస్సాంలోని అభయపురికి చెందిన కృతి శిఖా 41 నిమిషాల 34 సెకన్లలో నిరంతరాయంగా 21 పాటలు పాడి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించింది. తొమ్మిదేళ్ల కృతి శిఖా పాడిన పాటల్లో అస్సామీతో పాటు హిందీ పాటలు కూడా ఉన్నాయి. చిన్నారి కృతి శిఖా ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సాధించడం ఇది రెండోసారి.తల్లిదండ్రులు గాయకులు కావడంతో ఇంటినిండా సంగీత వాతావరణమే కనిపిస్తుంది. చిన్నారి కృతి ‘ఇండియా బుక్ ఆఫ్ ఆప్ రికార్డ్స్’లో చోటు సాధించిన సందర్భంగా గ్రామస్థులు సంబరాలు జరుపుకున్నారు. ‘ఈ రికార్డ్ కృతి ప్రతిభకు మాత్రమే కాదు సాంస్కృతిక వైవిధ్యానికి కూడా అద్దం పడుతుంది. భాషా సామరస్యత అనే భావనను పెం΄÷ందిస్తుంది’ అంటూ ఒక యూజర్ స్పందించాడు. -
ఉత్తమనటి..బ్రహ్మపుత్రిక
బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉండే ఆ గ్రామంలోని అమ్మాయిలకు పెళ్లి సంబంధాలు రావు. వరదలు రావడం, గ్రామం కొట్టుకుపోవడం యేటా మామూలే. ఇక ఆ గ్రామానికి, మిగతా ప్రపంచానికీ రాకపోకల కోసం ఒక్క వంతెనైనా లేదు. అలాంటి గ్రామానికి రెండేళ్ల క్రితం ఒక మంచి ‘సంబంధం’ కోసం నానా కాలి బాటల్లో పడి ఒక బృందం వచ్చింది! ఇంటి పని, పొలం పనీ చేయగలదు అనిపించిన 20 ఏళ్ల శివరాణి అనే మొరటు పిల్లను చూసి మరీ ఎంపిక చేసుకుంది. ఆ వచ్చిన వాళ్లు సినిమా వాళ్లు! వారి సినిమా ‘బ్రిడ్జ్’లో నటించిన ఆ బ్రహ్మపుత్రిక ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ నటి! నదికి, నది ఒడ్డున నివాసం ఉన్నవారికి మధ్య ‘బాంధవ్యం’ ఎలా ఉంటుంది? ముంచెత్తే వరదలు సైతం విడదీయలేనంత బలంగా ఉంటుంది. అస్సామీలో వచ్చిన ‘బ్రిడ్జ్’ సినిమా కథాంశం ఈ బాంధవ్యమే. బ్రహ్మపుత్ర నదికి ఉత్తరం వైపున బలిగావ్ అనే గ్రామం ఉంది. అస్సాంలోని లఖింపూర్ జిల్లా పరిధిలోని ధకువాఖన సబ్–డివిజన్ కిందికి వస్తుంది ఆ గ్రామం. వరదలు వస్తే అసలే లేకుండా పోతుంది! బ్రహ్మపుత్రకు ఏటా వరదలు తప్పవు. బలిగావ్ గ్రామానికి ముంపు తప్పదు. వరద తగ్గుముఖం పట్టాక, సూర్యుడు మేఘాల్లోంచి పైకి వచ్చిన విధంగా ఊళ్లోంచి వెళ్లిన వాళ్లు మళ్లీ ఆ ఒడ్డున ఉదయిస్తారు. పడిపోయిన ఇళ్లను పునర్నించుకుంటారు. అంతే తప్ప ఊపిరి లాంటి ఆ ఊరిని వదిలి ఎక్కడికీ వెళ్లరు. ఊరు నదితో బాంధవ్యం కలుపుకుందనే ఆ ఒక్క కారణంతో ఆ ఊరితో పొరుగూళ్లవారెవరూ సంబంధం కలుపుకోరు! ఇంకో కారణం కూడా ఉంది. బలిగావ్కు మిగతా ప్రాంతాలను కలిపే వంతెన లేదు. అలాంటి చోటుకు పిల్లను ఎలా ఇస్తారు? అక్కడి పిల్లను ఎలా తెచ్చుకుంటారు? ఇదంతా సినిమాలో అంతర్లీనంగా ఉండే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది చిత్ర కథ కాదు. ఆ చిత్రంలో ‘జానకి’ ప్రధాన పాత్ర పోషించిన అస్సామీ యువతి శివరాణి కథ. ‘బ్రిడ్జ్’ చిత్రం 2020 లో విడుదలైంది. ఇప్పటి వరకు ఆ చిత్రానికి 28 అంతర్జాతీయ చిత్రోత్సవాలలో అవార్డులు వచ్చాయి. తాజాగా కెనడాలో జరిగిన ‘అట్టావా నాల్గవ భారత చలన చిత్రోత్సవం’లో శివరాణిని ‘ఉత్తమ నటి’ అవార్డు వరించింది. ∙∙ ‘బ్రిడ్జ్’ చిత్రీకరణ జరిగే సమయానికి శివరాణి వయసు 22. ఆ సినిమాకు కథానాయిక గా ఆమె దొరికి, సినిమా పూర్తయ్యేసరికి రెండేళ్లు పట్టింది. 89 నిముషాల ఈ చిత్రాన్ని తియ్యడానికి డైరెక్టర్ కృపాల్ కాళిత సహా టీమ్ మొత్తం దాదాపుగా ప్రతిరోజూ నీటిలోకి దిగవలసి వచ్చేది. రెండు నిముషాల సీన్ షూటింగ్‌కి ఎనిమిది గంటల సమయం పట్టిన అనుభవం కూడా వారికి ఉంది. నీళ్లలోకి దిగడం, కరెక్ట్ షాట్ కోసం గంటలు గంటలు పనిచేయడం పెద్ద కష్టమైతే కాలేదు కానీ, జానకి పాత్రకు శివరాణిని వెతికి పట్టుకోవడమే వారికి కష్టమైంది. వాళ్లకు కావలసింది చూడ్డానికి మొరటుగా, పొలం పనుల వల్ల చేతుల కాయలు కాసి ఉన్న అమ్మాయి. అలాగే ఆమెకు పొలం దున్నడం తెలిసుండాలి. పశువులు మేపగలగాలి. ఈ ‘క్వాలిటీ’లన్నిటి కోసం బలిగావ్ గ్రామం మొత్తం గాలించి 300 మంది యువతులకు ఆడిషన్ నిర్వహించి చివరికి శివరాణిని ఎంపిక చేసుకున్నారు. కథకు, కథనానికి సరిపోయేలా ఉంది శివరాణి. ఫ్రెష్‌గా కాలేజ్ నుంచి వచ్చినప్పటికీ, అప్పుడే నాగలి పట్టి పొలం దున్ని ఇంటికి వచ్చినట్లుగా ఉంది. సినిమాకు అంతవరకు చాలు. అయితే ఆమె వదనంలో లీలగా విషాదం కూడా ఉంది. ఆమె తల్లిదండ్రులు వరదల్లో చనిపోయారు. తమ్ముడు, తను.. ఇద్దరే మిగిలారు. తమ్ముణ్ణి చదివిస్తూ, తన బి.యస్సీ పూర్తిచేసుకుని ఉన్న సమయంలో ఊళ్లోకి ఈ సినిమా టీమ్ వచ్చింది. వారి సినిమాలోని ప్రధాన పాత్రకు తను ఎంపికైన వార్త వినగానే శివరాణి ఎలాగైతే మేఘాలలో తేలిపోయిందో.. ఆ పాత్రకు ఉత్తమ నటిగా తనకు అవార్డు వచ్చిందని తెలిసి ఇప్పుడూ అంతే ఆనందంలో మునిగిపోయింది. ముంచడం, తేల్చడం బ్రహ్మపుత్ర యేటా చేస్తుండే పనే. ఈ మునగడం, తేలడం మాత్రం ఆమెకు కొత్త అనుభవం. సీమా బిస్వాస్ తర్వాత ఉత్తమ నటి అవార్డు పొందిన మరొక అస్సామీ నటి శివరాణి. 2019లో ఇదే ‘అట్టావా’ చిత్రోత్సవంలో మలయాళీ చిత్రం ‘ఇదం’కి ఉత్తమ నటి అవార్డు పొందారు సీమ. ఈ ఏడాది అదే చిత్రోత్సవంలో ‘బ్రిడ్జ్’తో శివరాణి ఉత్తమ నటి అయింది. 56 ఏళ్ల విలక్షణ నటితో తనకు పోలిక రావడం కూడా శివరాణిని ఆనంద డోలికల్లో విహరింపజేస్తోంది. తండ్రే ఆమెకు నాగలితో పొలం దున్నడం నేర్పించాడు. ఇప్పుడు ఆయన ఉండి ఉంటే సినిమాలో పొలం దున్నుతూ కనిపిస్తున్న తనను చూసి, ఆయనతో పాటు తల్లీ సంతోషించే ఉండేవారని శివరాణి అంటోంది. ప్రస్తుతం ఆమె తన గ్రామానికి దగ్గరగా ఉండే ఉత్తర లక్ష్మీపూర్‌లోని ఒక డిపార్ట్మెంటల్ స్టోర్‌లో సూపర్వైజర్గా పని చేస్తోంది. -
మీరు తప్పు సార్..
వాతావరణం, ఉష్ణోగ్రత ఒకటి కానే కాదంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు పాఠం చెబుతోంది అస్సామీ బాలిక ఆస్తా సర్మా. నవంబర్ 21న అమెరికాలోని వాషింగ్టన్లో ఉష్ణోగ్రత మైనస్ రెండు డిగ్రీ సెల్సియస్‌కు పడిపోయింది. దీంతో ‘ఇంతటి చలి దెబ్బకు.. ఇన్నాళ్లు భూతాపం కారణంగా భూమిపై జరిగిన నష్టమంతా ఒక్కసారిగా మటుమాయమైపోతుంది’ అంటూ ట్రంప్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ను తప్పుబడుతూ అస్సాంలోని జోర్హాత్ పట్టణానికి చెందిన 18 సంవత్సరాల అమ్మాయి ఆస్తా సర్మా మరో ట్వీట్ చేసింది. ‘ట్రంప్ గారూ.. నేను మీ కంటే 54 సంవత్సరాలు చిన్నదాన్ని. ఓ మోస్తరు మార్కులతో ఇటీవలే హైస్కూలు చదువు పూర్తి చేశా. అయితే వెదర్, క్లైమెట్ ఒక్కటి కావు. మీకీ విషయాలు సరిగ్గా అర్థంకావాలంటే నేను రెండో తరగతిలో ఉన్నపుడు చదువుకున్న ఎన్సైక్లోపీడియా పుస్తకాన్ని మీకు పంపిస్తా. ఫొటోలతో, వర్ణనలతో సవివరంగా ఉంటుంది’ అంటూ ట్వీట్ చేసింది. ట్రంప్ తప్పును ఎత్తిచూపుతూ ఆస్తా చేసిన ట్వీట్‌కు ప్రపంచవ్యాప్తంగా 23,000 లైకులు వచ్చాయి. 5,500 మందికి పైగా రీట్వీట్లు చేశారు. అమెరికాలోని ట్విటర్ యూజర్లు తమ దేశాధినేతకు తగిన సమాధానం ఇచ్చిందంటూ ఆ బాలికను ప్రశంసించారు. అరేబియా సముద్రంపై ఉష్ణోగ్రత మార్పుల కారణంగా జరిగే దుష్ప్రభావాలపై ఆమె ఇంటర్న్‌షిప్ చేస్తానంటే ఆర్థికసాయం చేస్తామంటూ చాలా మంది దాతలు ముందుకొచ్చారు. -
బాధితురాలిపై మంత్రి కామెంట్.. తీవ్ర విమర్శలు!
గువాహటి: 'చీకటి పడుతున్న సమయంలో రోడ్డుపై వెళ్తుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నా వద్దకు వచ్చారు. బైకుపై వచ్చిన వాళ్లు హెల్మెట్ ధరించి ఉన్నారు. నేను అక్కడినుంచి వెళ్లిపోతున్నాను. ఇంతలో ఒకడు నన్ను అడ్డగించగా.. రెండో వ్యక్తి చెప్పరాని విధంగా నన్ను తాకాడు. దీంతో నిస్సహాయంగా ఉండిపోయాను'.. ఇది అస్సాం రాజధాని గువాహటికి 330 కి.మీ దూరంలోని జోర్హాత్ గ్రామానికి చెందిన ఓ యువతి ఫేస్ బుక్ పోస్ట్ సారాంశం. సోషల్ మీడియాతో ఈ పోస్ట్ విపరీతంగా షేర్ కావడంతో పార్లమెంటరీ వ్యవహరాలశాఖ మంత్రి చంద్ర మోహన్ పఠ్వారీ ఈ ఘటనపై స్పందించి తీవ్ర విమర్శలపాలయ్యారు. గతేడాది అసోం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏజీపీ నేత అయిన చంద్ర మోహన్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన జోర్హాత్ గ్రామ యువతి పోస్ట్ పై స్పందిస్తూ.. ఆ యువతి లెఫ్ట్ వింగ్ కు చెందిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి అని అందుకే పోలీసుల వద్దకు వెళ్లకుండా, అందర్నీ తప్పుదోవ పట్టిస్తుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి విషయాలపై కూడా రాజకీయం చేయడంతో మంత్రి చంద్ర మోహన్ పై రాష్ట్రవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. మంత్రి తక్షణమే రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ జోర్హాత్, గోలఘాట్, సోనిత్ పూర్, గువాహటిలో ఆందోళన చేపట్టారు. చట్టాలు కేవలం బీజేపీ, ఏబీవీపీ, ఆరెస్సెస్ లకు మాత్రమే అనుకున్నావా అంటూ అసోం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ మంత్రి చంద్ర మోహన్ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. రాజకీయాలకు అతీతంగా మహిళలకు రక్షణ కల్పించాల్సింది పోయి.. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అంటూ మండిపడ్డారు. చంద్ర మోహన్ వ్యాఖ్యలపై విద్యాశాఖ మంత్రి హిమంతా బిస్వా శర్మ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. తక్షణమే బాధితురాలికి న్యాయం చేయాలని గొగోయ్ డిమాండ్ చేశారు.