breaking news
ake ravi krishna
-
పోలీసుల అదుపులో మావోయిస్టులు
కర్నూలు టౌన్: కూలీలుగా పని చేస్తున్న చోటు నుంచి పేలుడు పదార్థాలు తీసుకెళ్లి.. ఛత్తిస్‌గఢ్ రాష్ట్రంలో విధ్వంసాలకు పాల్పడుతున్న నలుగురు మావోయిస్టులను కర్నూలు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఛత్తిస్‌గఢ్ సుకుమ జిల్లా చిన్గఢ్ మండలం పెద్దపార గ్రామానికి చెందిన నలుగురు జిల్లాలోని మెట్టుపల్లి వద్ద జరుగుతున్న టన్నల్ పనుల్లో కూలీలుగా పని చేస్తున్నారు. టన్నల్‌లో పేలుళ్ల కోసం వినియోగించే జిలెటిన్‌స్టిక్స్, డిటోనేటర్లను దొంగలించి సుకుమా జిల్లాలో పలు విధ్వంసాలకు పాల్పడ్డారు. అక్కడి నుంచి తిరిగి వచ్చి ఇక్కడ కూలీలుగా పని చేస్తున్నారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న ఛత్తిస్‌గఢ్ పోలీసులు కర్నూలు ఎస్పీ ఆకె రవికృష్ణకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి జిల్లా పోలీసులు నలుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన మావోయిస్టులు లక్క లక్ష్మీ, భీమా కనాసి, హిడ్మా కార్బాని, కట్టడి ఉంగ్మా గా గుర్తించారు. -
'నంద్యాలలోనే కాపురం ఉంటా'
కర్నూలు: నంద్యాలలో ఫ్యాక్షనిజం, రౌడీయిజాన్ని ఎదుర్కోవడానికి పోలీసు శాఖ సిద్ధంగా ఉందని, అవసరమైతే తాను నంద్యాలలోనే కాపురం ఉంటూ మరింత కఠినంగా వ్యవహరిస్తానని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ వెల్లడించారు. గురువారం ఆయన అడిషనల్ ఎస్పీ శివకోటి బాబూరావు, డీఎస్పీలు రమణమూర్తి, వినోద్‌కుమార్, దేవదానం, బాబుప్రసాద్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల రోజు నంద్యాల రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రవర్తించిన తీరు పోలీసుల ఆత్మగౌరవం కించపరిచేలా ఉందన్నారు. డీఎస్పీ దేవదానంను ఉద్దేశించి డోన్ట్ టచ్ మీ... అని అగౌరవపరచినందుకే ఆయనపై కేసు నమోదు చేశామన్నారు. డీఎస్పీ వినోద్‌కుమార్ చేత దర్యాప్తు చేసి వివరాలను కోర్టుకు సమర్పించామని.. దర్యాప్తులో ప్రాథమిక ఆధారాలు లభించాయన్నారు. డీఎస్పీ దేవదానం మాట్లాడుతూ 2001 నుంచి 2004 వరకు తాను ఆళ్లగడ్డలో పనిచేశానని, తన పూర్వాపరాలు ఎమ్మెల్యేకు తెలుసునన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న తాను ఆళ్లగడ్డ ఎమ్మెల్యేని ఉద్దేశించి ఓటు వేసి వెళ్లండని చెబితే ఆ విషయాన్ని మరో విధంగా అర్థం చేసుకుని భూమా తనపై మండిపడుతూ డోన్ట్ టచ్ మీ అన్నారన్నారు. అగ్రవర్ణాలకు చెందిన మరో డీఎస్పీ పక్కనే ఉన్నప్పటికీ తనను మాత్రమే ఉద్దేశించి ఇలా మాట్లాడటం బాధించిందన్నారు.