Aeronautical Society of India
-
‘ఏరోస్పేస్’ వ్యూహాత్మక కేంద్రంగా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తు ‘ఏరోస్పేస్’ రంగ అవసరాలకు అనుగుణంగా ‘తెలంగాణ’ను దేశానికి ఒక వ్యూహాత్మక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆర్అండ్ డీ, అడ్వాన్డ్స్ మాన్యుఫ్యాక్చరింగ్, సర్టిఫికేషన్ అండ్ కాంప్లియెన్స్.. ఈ మూడింటిని అనుసంధానించగలిగే దేశాలు, రాష్ట్రాలే రాబోయే రోజుల్లో ‘ఏరోస్పేస్’ లో గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతాయన్నారు. ఆ దిశగా... ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సవాళ్లు, మార్పుల్ని అందిపుచ్చుకునేలా రాష్ట్రంలో ‘ఎకో సిస్టం’ను అభివృద్ధి చేస్తున్నామన్నారు.శుక్రవారం ‘ది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా’ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలీలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ‘ఛేంజింగ్ సినారియో ఇన్ ఏరోస్పేస్; ఆర్అండ్డీ, మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ సర్టిఫికేషన్’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ‘ఏరోస్పేస్’ అంటే కేవలం యంత్రాల తయారీ మాత్రమే కాదని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఒక దేశ వ్యూహాత్మక శక్తికి, ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తోందన్నారు.ఈ రంగంలో ఒకప్పుడు.. యూఎస్, రష్యా, ఐరోపా దేశాలదే ఆధిపత్యం చెలాయించేవని, ఇప్పుడు వాటికి ధీటుగా ‘గ్లోబల్ సప్లై చైన్’లో మన దేశం కూడా ‘కీ’ రోల్ ప్లే చేస్తోందన్నారు. యునెస్కో గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సైంటిస్టులు, ఇంజనీర్లు మన దేశంలోనే ఉన్నారన్నారు. కానీ... మెకిన్సే నివేదిక ప్రకారం.. ల్యాబ్‌ల్లో జరిగే పరిశోధనల్లో 30 శాతం కూడా కమర్షియల్ మాన్యుఫ్యాక్చరింగ్‌కు నోచుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పరిశోధనల్ని ఉత్పత్తులుగా మార్చాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామన్నారు.డెలాయిట్ గ్లోబల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సర్వే ప్రకారం.. నేడు 74 శాతం మంది ఏరోస్పేస్ సీఈఓలు కేవలం తక్కువ ఖర్చు కంటే పటిష్ఠమైన సప్లై-చైన్, తయారీ సామర్థ్యానికే ప్రాధాన్యమిస్తున్నారన్నారు. రాబోయే 20 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 42,000 కొత్త ఎయిర్ క్ట్రాఫ్ట్స్ అవసరం ఉంటుందని బోయింగ్, ఎయిర్‌బస్ సంస్థలు అంచనా వేశాయన్నారు. ఈ డిమాండ్‌ను ‘హైదరాబాద్’ అందిపుచ్చుకునేలా ఇప్పటికే ఇక్కడున్న ప్రిసిషన్ ఇంజనీరింగ్, డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ నెట్వర్క్, బలమైన ఎంఎస్ఎంఈ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. ఇప్పటికీ మనం ఏరోస్పేస్ టెస్టింగ్, సర్టిఫికేషన్ కోసం విదేశాలపైనే ఆధారపడాల్సి వస్తోందన్నారు.ఫలితంగా ఖర్చు పెరగడమే కాకుండా.. ఉత్పత్తుల గ్రౌండింగ్‌కు 18 నెలల నుంచి 24 నెలల వరకు అదనపు సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి సర్టిఫికేషన్ ఎకో సిస్టంను అభివృద్ధి చేసేందుకు ‘హైదరాబాద్’ అన్ని రకాలుగా అనుకూలంగా ఉందని.. ఆ దిశగా కేంద్రం చొరవ చూపాల్సిన అవసరముందన్నారు. డ్రోన్లు, రీయూజబుల్ రాకెట్లు, ఏఐ ఏవియానిక్స్, 3డీ ప్రింటింగ్, అడ్వాన్డ్స్ మెటీరియల్స్ తదితర అంశాలు రాబోయే రోజుల్లో ఏరోస్పేస్ భవిష్యత్తును శాసిస్తాయన్నారు.అందుకు అనుగుణంగానే.. ఇప్పటి నుంచే ‘తెలంగాణ’ను సిద్ధం చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో ఉన్న 1,500కు పైగా ఎంఎస్ఎంఈలు ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ దిగ్గజ సంస్థలకు విడిభాగాలను సరఫరా చేస్తూ ‘మేడిన్ తెలంగాణ’ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేస్తున్నాయన్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్ ఆర్అండ్ డీ ఇన్సిట్యూషన్లు, గ్లోబల్ ఓఈఎంలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఆదిభట్ల ఏరోస్పేస్ ఎస్ఈజెడ్, ప్రత్యేక ఏరోస్పేస్ పార్కులు, రోడ్డు నెట్ వర్క్ తదితర మౌలిక సదుపాయాలు, టాలెంట్ పూల్... ప్రపంచ ఏరో స్పేస్ దిగ్గజ సంస్థలు తెలంగాణ వైపు చూసేలా చేశాయన్నారు.‘హైదరాబాద్’ వేదికగా ఏరోస్పేస్ భవిష్యత్తును నిర్మించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, ఆవిష్కర్తలను మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. అనంతరం ఏరోస్పేస్ రంగంలో విశేష కృషి చేసిన పలువురు శాస్త్రవేత్తలు, ప్రముఖులను ఆయన ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యులు డా.వీకే సారస్వత్, డీజీ సీఎస్ఐఆర్ అండ్ డీఎస్ఐఆర్ సెక్రటరీ డీ.ఎన్ కళైసెల్వి, ‘ది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా’ ప్రతినిధులు డా.సతీష్ రెడ్డి, డా.సోమనాథ్, రాజబాబు, డా.శివ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
ఏరోనాటికల్ సొసైటీ అంతర్జాతీయ సదస్సు ప్రారంభం
ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ‘ఏరోస్పేస్ & ఏవియేషన్ ఇన్ 2047’ అంతర్జాతీయ సదస్సు న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో శనివారం ప్రారంభమైంది. నవంబర్ 18, 19 తేదీల్లో రెండు రోజులపాటు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ దేశంలో ఏరోస్పేస్ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తూ 75 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియాను ఏఈఎస్‌ఐని అభినందించారు. అనంతరం ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి, వివిధ పరిశ్రమల ఉత్పత్తులను సందర్శించి స్టార్టప్‌లతో సంభాషించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ దూసుకుపోతోందని, సైన్స్‌లో భారతీయ మహిళల పాత్ర పెరుగుతోందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. రక్షణ, టూరిజం శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ మాట్లాడుతూ రక్షణ రంగంలో దేశం సాధించిన విజయాలు, భారత ప్రభుత్వం విధాన సంస్కరణలు, రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా డీఆర్డీవో చేస్తున్న కృషిని అభినందించారు. ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి అతిథులను స్వాగతిస్తూ అధునాతన సామర్థ్యాల సాధనతో దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడానికి అన్ని పరిశోధన, విద్యాసంస్థలు, పరిశ్రమల కృషిని సమన్వయం చేయడంలో ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా పాత్ర గురించి వివరించారు. అలాగే ఇస్రో చైర్మన్ సోమనాథ్, సీఎస్ఐఆర్ డీజీ డాక్టర్ కరైసెల్వి, డైరెక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ డాక్టర్ కామత్, ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్, వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్, హాల్ చైర్మన్ అనంతకృష్ణన్, పౌర విమానయాన శాఖ సీనియర్ ఆర్థిక సలహాదారు పీయూష్, టాటా సన్స్ ప్రెసిడెంట్ బన్మాలి అగర్వాల్, యూఎస్ఏ జనరల్ అటామిక్స్ సీఈవో డాక్టర్ వివేక్ లాల్ తదితరులు ప్రసంగించారు. సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖులు, నీతి ఆయోగ్ సభ్యులు, భారత ప్రభుత్వ కార్యదర్శులు, వివిధ సంస్థల అధిపతులు, అంతర్జాతీయ నిపుణులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, విద్యార్థులతో సహా 1,500 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. దాదాపు 200 పరిశ్రమలు, ఎస్ఎంఈలు, 75 పైగా స్టార్టప్‌లు ఎగ్జిబిషన్లో తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. -
మేకిన్ ఇండియాకు ఏరోనాటిక్స్ సొసైటీ ఊతం
రక్షణమంత్రి శాస్త్రీయ సలహాదారు జి.సతీశ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మేకిన్ ఇండియా’కు తమ వంతు సహకారం అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ విభాగం డెరైక్టర్, రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా లుమినరీ లెక్చర్ సిరీస్ కార్యక్రమంలో భాగంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశ వైమానిక రంగంలో అందుబాటులో లేని పరికరాలు, తయారీ సౌకర్యాలను ఇప్పటికే గుర్తించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏరోనాటికల్ సొసైటీల సహకారంతో ఈ లోటును భర్తీ చేసి తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై ఇప్పటికే అన్ని సొసైటీలకు లేఖలు రాశామన్నారు. వారి స్పందనల ఆధారంగా తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని వివరించారు. సెన్సర్లు మొదలుకొని అనేక ఇతర వైమానిక రంగ పరికరాల తయారీకి భారత్ కేంద్రం కావచ్చని ఆశిస్తున్నట్లు తెలిపారు. వైమానిక రంగంలో కీలక పాత్ర పోషించే ఏరోనాటిక్స్ అభివృద్ధికి, విస్తృతికి హైదరాబాద్ సొసైటీ కృషి చేస్తోందన్నారు. వచ్చే నెలలో ఐఆర్ఎన్ఎస్ఎస్ తుది ఉపగ్రహం: ఇస్రో చైర్మన్ దేశీ జీపీఎస్ వ్యవస్థ సాకారమయ్యేందుకు మిగిలిన ఒకేఒక్క ఉపగ్రహాన్ని వచ్చేనెల చివరి వారంలో ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ ఎ.ఎస్.కిరణ్‌కుమార్ తెలిపారు. మొత్తం ఏడు ఉపగ్రహాలతో ఏర్పడనున్న ఈ కొత్త వ్యవస్థ ఇతర వ్యవస్థల కంటే మెరుగైన లొకేషన్ ఆధారిత సేవలు అందిస్తుందన్నారు. ఇస్రో ఇప్పటికే అభివృద్ధి చేసిన గగన్, భువన్ (గూగుల్ ఎర్త్ వంటి మ్యాప్) వ్యవస్థలతో కలిపి చూసినప్పుడు దేశీ జీపీఎస్ భారత్‌తో పాటు ఇరుగుపొరుగు దేశాలకు ఎంతో ఉపయుక్త సేవలు అందిస్తుందని వివరించారు. నేషనల్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ డెరైక్టర్ శ్యామ్ చెట్టి తదితరులు పాల్గొన్నారు.


