breaking news
acqua food park
-
తుందుర్రు గ్రామాల్లో సర్కారు దాష్టీకం
-
ఈడ్చేశారు
వ్యాన్లలోకి విసిరేశారు తుందుర్రు, కంసాలి బేతపూడి, జొన్నల గరువు గ్రామాల్లో సర్కారు దాష్టీకం ఆందోళనకారులపై పిడిగుద్దులు కురిపించిన పోలీసులు మహిళల్ని బూటుకాళ్లతో తన్ని లాఠీలు ఝళిపించిన ఖాకీలు ఆక్వా పార్క్‌ను ముట్టడించాలనే ప్రయత్నానికి అడ్డుకట్ట వందమందికి పైగా నిరసనకారుల అరెస్ట్ భీమవరం/భీమవరం అర్బన్/నరసాపురం రూరల్ : గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ప్రభావిత గ్రామాలైన తుందుర్రు, కంసాలి బేతపూడి, జొన్నలగరువు రణరంగంగా మారాయి. భారీగా తరలివచ్చిన పోలీసులతో సోమవారం అక్కడ యుద్ధ వాతావరణం కనిపించింది. ఆక్వా పార్క్‌ను ముట్టడించేందుకు సమాయత్తమైన పోరాట కమిటీ, సీపీఎం నాయకులతోపాటు ఆ గ్రామాల ప్రజలపైనా పోలీసులు విరుచుకుపడ్డారు. నాయకులతోపాటు మహిళలను, వృద్ధులను సైతం ఈడ్చుకెళ్లి వ్యాన్లలోకి విసిరేశారు. తుందుర్రు, కంసాలి బేతపూడి, జొన్నలగరువు గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఆక్వా పార్క్ వల్ల తీవ్రస్థాయిలో కాలుష్యం వెదజల్లుతుందని, దీనివల్ల పంటలు, పర్యావరణంతోపాటు ప్రజారోగ్యం దెబ్బతింటాయని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్న విషయం విదితమే. ఆక్వా పార్క్‌ను సముద్ర తీరానికి తరలించాలని, ఫ్యాక్టరీ ప్రాంతంలో ఆక్వా యూనివర్సిటీ నెలకొల్పాలని భీమవరం, నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లోని సుమారు 40 గ్రామాల ప్రజలు మూడేళ్లగా కోరుతున్నారు. అక్కడ ఆక్వా పార్క్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు పోరాట కమిటీ పెద్దఎత్తున ఉద్యమిస్తోంది. వారికి సీపీఎం, వైఎస్సార్సీపీ, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలతో పాటు వివిధ ప్రజా సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. ప్రజా ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని వినియోగిస్తూ వేధింపులు, లాఠీచార్జి, అరెస్ట్‌లు భయభ్రాంతులకు గురిచేస్తోంది. అయినా.. ఉద్యమ తీవ్రత పెరుగుతోందే తప్ప ఆ ప్రాంత ప్రజలు వెనుకడుగు వేయడం లేదు. ఇందులో భాగంగానే ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తుందుర్రు, కంసాలి బేతపూడి, జొన్నలగరువు గ్రామాల్లో ఆక్వా పార్క్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాలని అక్కడి ప్రజలు నిర్ణయించుకోగా వేలాదిమంది పోలీసులు మోహరించి ఉద్యమకారులతోపాటు మహిళలు, గర్భిణులు, వృద్ధులను సైతం పోలీసులు దమనకాండకు దిగి అరెస్ట్ చేశారు. ఇందుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళలు వెల్లువెత్తాయి. అనంతరం మానవ హక్కుల వేదిక నాయకురాలు విమల, ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక నాయకుడు బి.రామకృష్ణంరాజు ఆధ్వర్యంలో నిజనిర్థారణ బృందం ఆక్వా పార్క్ ప్రభావిత గ్రామాల్లో పర్యటించింది. ఆక్వా పార్క్ వల్ల తీవ్ర అనర్థాలు ఏర్పడతాయని, తక్షణం పనులు నిలిపివేసి వేరే ప్రాంతాలనికి తరలించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోరాట కమిటీ, సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం ఫుడ్‌పార్క్‌ను ముట్టడించాలని నిర్ణయించారు. సీపీఎం నాయకులు ముందుగానే తుందుర్రు చేరుకుని కార్యాచరణ రూపొందించారు. భారీగా మోహరించిన పోలీసులు విషయం పోలీసులకు తెలియడంతో ఆదివారం రాత్రికే ఆయా గ్రామాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి బయటి ప్రాంతాల నుంచి తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాలకు రాకుండా అడ్డుకున్నారు. జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల నుంచి ఏడుగురు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 30 మంది ఎస్సైలు, వందలాది మంది పోలీస్ కానిస్టేబుల్స్ పోరాట కమిటీ నాయకుల కోసం జల్లెడ పట్టారు. వారి జాడ తెలియకపోవడంతో నిఘా కొనసాగించారు. సోమవారం ఉదయం కంసాలి బేతపూడిలో మహిళలు, పోరాట కమిటీ నాయకులు రోడ్డుపైకొచ్చి ఆక్వా పార్క్ నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని చుట్టుముట్టి రోడ్లుపై ఈడ్చుకుంటూ వెళ్లి వ్యాన్లలోకి విసిరేశారు. వారందరినీ మొగల్తూరు, నరసాపురం స్టేషన్లకు తరలించారు. అనంతరం తుందుర్రులో లేసుపార్కు వద్దకు ఒక్కసారిగా ఆందోళనకారులు రావడంతో సీపీఎం, పోరాటకమిటీ నాయకులు వారితో జతకలసి ఆక్వా పార్క్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని సీపీఎం నాయకులు బి.బలరామ్, జేఎన్వీ గోపాలన్, ఐద్యా నాయకురాలు డి.కల్యాణి, పోరాట కమిటీ నాయకులు ఆరేటి వాసు, జవ్వాది వెంకటరమణ, ముచ్చర్ల త్రిమూర్తులు, ఆరేటి సత్యవతి, జవ్వాది సత్యనారాయణ తదితర 100 మందిని అరెస్ట్ చేశారు. భయాందోళనకు గురైన ప్రజలు, పిల్లలు, వృద్ధులు ఇళ్లల్లోంచి బయటకు రాకుండా బిక్కుబిక్కుమంటూ గడిపారు. పిడిగుద్దుల వర్షం ఉద్యమకారులను అరెస్ట్ చేసే నెపంతో రోడ్లవెంట ఈడ్చుకెళ్లిన పోలీసులు వారిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో కె.బేతపూడి రామాలయం వీధినుంచి పంచాయతీ కార్యాలయం రోడ్డుపైకి వస్తున్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం నరసాపురం పట్టణ కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు, ఐద్వా నాయకురాలు పొగాకు పూర్ణ తదితరులతోపాటు గ్రామంలోని మహిళలు సైతం ఈడ్చుకెళ్లి పిడిగుద్దులు గుద్దుతూ కాళ్లు చేతులూ పట్టుకుని గాల్లోకి ఎగరేసిట్టుగా వాహనాల్లోకి విసిరేశారు. మహిళల్ని సైతం బూటు కాళ్లతో తన్నుతూ లాఠీలు ఝళిపించారు. పలువురు మహిళలకు గాయాలయ్యాయి. ఈ పని చేసింది నిజమైన పోలీసులు కాదని.. ఖాకీ దుస్తుల్లో వచ్చిన రౌడీలు ఈ దాష్టీకానికి దిగారని పలువురు మహిళలు ఆరోపించారు. ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులు గ్రామాల్లో ఎక్కడికక్కడ పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. పోలీసులు, ఆక్వా పార్క్ యాజమాన్యం పురమాయించిన 10 మంది వ్యక్తులు మూడు గ్రామాల్లోను ప్రతి వ్యక్తిని ఫొటో, వీడియోలు తీశారు. ఎవరైనా నోరెత్తితే కేసులు పెట్టి జైళ్లలో బంధిస్తామంటూ బెదిరించారు. ఆదివారం రాత్రి నుంచే పోరాట కమిటీ నాయకుల కోసం గ్రామాల్లో జల్లెడ పట్టిన పోలీసులు కవురు పెద్దిరాజు, మామిడిశెట్టి రామాంజనేయులును అరెస్ట్ చేశారు. గ్రామాల్లో 144 సెక్షన్‌తోపాటు పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నాయంటూ ఆటోలకు మైక్‌లు కట్టి ప్రచారం చేశారు. ఎక్కడైనా ఇద్దరు, ముగ్గురు కనబడితే లాఠీలకు పనిచెప్పి బెదిరించారు. ప్రతి ఇంటికి ఇద్దరు చొప్పున పోలీసులను కాపలాగా పెట్టారు. -
ఎన్నాళ్లిలా!
వీడని చిక్కుముడిలా తుందుర్రు ఆక్వా పార్క్ సమస్య ఆందోళనకారులుఽ, ఫ్యాక్టరీ యాజమాన్యం మధ్య సమస్యగా పేర్కొంటూ గుడ్లప్పగించి చూస్తున్న ప్రజాప్రతినిధులు తెరవెనుక నుంచి యాజమాన్యానికి సహకారం పోలీసులను ఉసిగొల్పి చిన్నారులు, వృద్ధులను సైతం నడిరోడ్డుపై ఈడ్చేస్తున్న పోలీసులు మూడేళ్లుగా ఉద్యమం నడుస్తున్నా పరిష్కారం దిశగా చర్యలు చేపట్టని సర్కారు ప్రభుత్వ కర్కశ చర్యలను తాళలేక.. ఎప్పుడూ ఇల్లు దాటి ఎరుగని సామాన్య మహిళలు సైతం ఉద్యమ పంథాలోకి భీమవరం : జనావాసాలను ఆనుకుని తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల మధ్య పచ్చటి పంట పొలాల్లో విషం చిమ్మే గోదావరి మెగా ఆక్వా పార్క్ నిర్మిస్తుండటాన్ని మూడేళ్లుగా అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అధికారమే అండగా చెలరేగిపోతూ.. పోలీసులను ఉసిగొల్పి దమనకాండకు పాల్పడుతూ.. పుండుమీద కారం చల్లినట్టుగా ప్రజల మనోభావాలను సాక్షాత్తు ప్రభుత్వమే దెబ్బతీస్తోంది. ’ఇందేం దారుణమయ్యా’ అని అడిగిన వాళ్లపై అరాచకానికి తెగబడుతోంది. ఇంటింటికీ పోలీసుల్ని పంపించి భీతావహ వాతావరణం సృష్టిస్తోంది. మగవాళ్లను ఊళ్లో ఉండనివ్వకుండా తరిమేస్తోంది. ఇంటి తలుపులు తీసుకుని బయటకొచ్చే మహిళల్ని, చిన్నారులను సైతం పోలీస్ జీపుల్లో కుక్కి ఠాణాలకు తీసుకెళ్లి బండబూతులు తిట్టిస్తోంది. తమ కష్టాలను చెప్పుకుందామని వెళితే.. ప్రజాప్రతినిధులు మొహం చాటేస్తున్నారు. అధికారులకు గోడు వెళ్లబోసుకుందామంటే మాట వినడం లేదు. ప్రభుత్వానికి విజ్ఞాపనలు పంపిస్తే ఎదురు దాడికి దిగుతోంది. ఇలాంటి పరిస్థితుల నడుమ అక్కడి సామాన్య జనం విసిగిపోయారు. పోరాటమే శరణ్యమంటూ ఉద్యమబాట పడుతున్నారు. ఏడాదిన్నర క్రితం సాదాసీదాగా మొదలైన ఆక్వా పార్క్ వ్యతిరేక ఉద్యమం ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండ కారణంగా ఉధృతరూపం దాల్చింది. ఇది చివరకు సమరశీల (మిలిటెంట్) పోరాటానికి దారి తీస్తుందేమో అనే ఆందోళన కలిగిస్తోంది. ఉద్యమం చల్లారాలంటే ప్రజలకు నచ్చచెప్పి.. వారిని ఒప్పించి నిర్మాణ పనులకు మార్గం సుగమం చేయాలి. కానిపక్షంలో అక్కడి సామాన్యులు సైతం కోరుతున్నట్టు ఆక్వా పార్క్‌ను జనావాసాలు లేని సముద్ర తీరానికి తరలించడం తప్ప మరో మార్గం లేదు. ఈ రెండు విషయాలను ఇటు ప్రజాప్రతినిధులు, అటు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కీలకంగా వ్యవహరించాల్సిన రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోకపోవడం, ప్రజాభీష్టాన్ని శాంతిభద్రతల సమస్యగా చూపిస్తూ పోలీస్ యంత్రాంగం భీతావహ వాతావరణం సృష్టిస్తోంది. మొత్తంగా చూస్తే సమస్యను పరిష్కరించడం మానేసి పరోక్షంగా ప్రభుత్వమే ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళుతోంది. ప్లేటు ఫిరాయించిన ప్రజాప్రతినిధులు ఆక్వా పార్క్ నిర్మాణం వల్ల తుందుర్రు సమీపంలోని 40 గ్రామాలు కాలుష్యం బారినపడతాయని.. పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లుతుందని.. పంట పొలాలు నాశనమవుతాయని సుమారు మూడేళ్లుగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సుమారు ఏడాది క్రితం వరకూ ప్రజా ఉద్యమానికి మద్దతు ఇచ్చిన నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అనంతరం ప్లేటు ఫిరాయించారు. ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ఎటువంటి నష్టం కలగదంటూ యాజమాన్యానికి వంత పాడారు. ఇదిలావుంటే.. నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)నోరు విప్పటం లేదు. ఈ నేపథ్యంలో సమస్యను బాధిత గ్రామాల ప్రజలు ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన రాజ్యసభ సభ్యురాలు సీతారామలక్ష్మి నివాసం బాధితులతో సమావేశమై వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. కొంతమంది ప్రతినిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు తీసుకువెళతానని, సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన పితాని సత్యనారాయణ ఆనక మొహం చాటేశారు. ఇలాంటి పరిస్థితుల నడుమ భీమవరం, నరసాపురం ఎమ్మెల్యేలు అంజిబాబు, మాధవనాయుడులను జన్మభూమి గ్రామసభలకు సైతం రానివ్వకుండా ప్రజలు అడ్డుకున్నారు. ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధుల్లో ఎటువంటి స్పందన కానరావడం లేదు. అధికారుల వైఫల్యం సమస్యను పరిష్కరించే విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అధికారులు సైతం ఈ అంశాన్ని గాలికొదిలేశారు. ఆక్వా పార్క్ వల్ల ఎలాంటి సమస్యలు రావని చెబుతున్న అధికారులు ఆ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో విఫలమయ్యారు. బాధిత గ్రామాల్లోకి వెళ్లకుండా భీమవరంలో మొక్కుబడి సమావేశాలు నిర్వహించడం విమర్శలకు తావిచ్చింది. ఫ్యాక్టరీ నుంచి ఎటువంటి వ్యర్థ జలాలు బయటకు రావని, ఆ నీటిని వినియోగించడానికి ఎక్కువ విస్తీర్ణంలో యాజమాన్యం మొక్కలు పెంచుతుందని చెప్పిన ప్రభుత్వం ఆ తరువాత కలుషిత జలాలను సముద్రంలో కలిపే విధంగా ప్రజాధనంతో పైప్‌లైన్ నిర్మిస్తామని ప్రకటించడంతో ప్రజల్లో అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదని ప్రభుత్వం, యాజమాన్యం చెప్పినదంతా బూటకమేనని నిర్థారణకు వచ్చిన ప్రజలు ఎట్టి పరిస్థితిల్లో నిర్మాణాన్ని అడ్డుకుతీరతామని భీష్మీంచారు. తమపై కేసులు బనాయించి జైళ్లపాలు చేసినా వెనక్కి మళ్లేది లేదని.. ప్రజలపై ఉక్కుపాదం మోపి ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తిచేసినా తరువాత దాని ఉనికికే ప్రమాదమని బాధిత గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు.