breaking news
abbarajupalem
-
అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుకు 12 నుంచి గ్రామసభలు
తాడికొండ: రాజధానిలో 22 గ్రామాలతో అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. గతంలో తుళ్ళూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని రాజధాని పూలింగ్‌కు భూములిచ్చిన 29 గ్రామాలతో అమరావతి మెట్రోపాలిటన్ సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రామసభలు నిర్వహించగా తుళ్ళూరు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటూ రాజధాని అభివృద్ధికి అడుగులు వేసింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలోని నాన్ పూలింగ్ గ్రామాల ప్రజలు తమను కూడా మున్సిపాలిటీలో చేర్చాలని కోరిన నేపథ్యంలో ఆయా గ్రామాలను కూడా మున్సిపాలిటీలో కలిపేందుకు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనల్లో భాగంగా తుళ్ళూరు మండలంలోని పూలింగ్‌కు భూములిచ్చిన 16 గ్రామాలతో పాటు నాన్ పూలింగ్ గ్రామాలైన పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రపురం గ్రామాలు, మంగళగిరి మండలంలోని మూడు గ్రామ పంచాయతీలను కలుపుతూ 22 గ్రామాలతో మున్సిపాలిటీ ఏర్పాటు దిశగా శుక్రవారం గ్రామసభల షెడ్యూల్ ప్రకటించారు. ఈ గ్రామసభల ద్వారా ఆయా గ్రామాల్లో ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు, వివరణలు సేకరించి తీర్మానం చేసి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నారు. తుళ్ళూరు ఎంపీడీవో శ్రీనివాసరావు శుక్రవారం ఈవోఆర్డీ సత్యకుమార్, పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులు సమావేశమై చర్చించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 12వ తేదీ సోమవారం నుంచి గ్రామసభలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేశారు. గ్రామసభల షెడ్యూల్ 12వ తేదీ లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, హరిశ్చంద్రపురం, 13వ తేదీ దొండపాడు, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, 14వ తేదీ వెంకటపాలెం, మందడం, ఐనవోలు, 15వ తేదీ నెక్కల్లు, అనంతవరం, వడ్డమాను, రాయపూడి, 16వ తేదీ మల్కాపురం, వెలగపూడి, పెదపరిమి, 17వ తేదీ శాఖమూరు, నేలపాడు, తుళ్ళూరు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆయా గ్రామాల ప్రజలు గ్రామసభలకు హాజరై వారి అభిప్రాయాలను తెలపాలని ఎంపీడీవో కోరారు. అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు నిర్ణయం హర్షణీయం 712వ రోజు రిలే నిరాహార దీక్షల్లో బహుజన పరిరక్షణ సమితి నాయకులు అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని బహుజన పరిరక్షణ సమితి నాయకులు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 712వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహర దీక్షల్లో శుక్రవారం పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. అమరావతి రైతులను మోసగించి మూడుపంటలు పండే 33 వేల ఎకరాలను పూలింగ్‌కు తీసుకున్న చంద్రబాబు వారికి ఏం న్యాయం చేశాడో చెప్పాలన్నారు. (క్లిక్ చేయండి: టీడీపీ నేత అనితకు బ్యాంకు నోటీసులు) రాష్ట్రంలోని 5 కోట్లమంది ప్రజల సంపదను ఒక ప్రాంతంలోనే కుమ్మరిస్తే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మహా నగరాల సరసన అమరావతిని చేరుస్తానంటూ మోసపూరిత హామీలతో చంద్రబాబు 29 గ్రామాల రైతులతో పాటు రాష్ట్ర ప్రజలను నమ్మించి భారీ అవినీతికి పాల్పడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి అమరావతి ప్రాంత అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన నిర్మాణాలు వడివడిగా కొనసాగుతున్నాయని చెప్పారు. సమితి నాయకులు మాదిగాని గురునాథం, నూతక్కి జోషి, బేతపూడి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. -
సీఆర్డీఏ అధికారులను నిలదీసిన రాజధాని రైతులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసర గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన సీఆర్డీఏ సదస్సు రసాభాసగా మారింది. తుళ్లూరు మండలం అబ్బరాజుపాలెంలో సీఆర్డీఏ అధికారులు రాజధాని నిర్మాణంపై రైతులతో సదస్సును చేపట్టారు. ఈ సదస్సులో రైతులు అధికారులను నిలదీశారు. గ్రామ కంఠాల విషయంలో స్పష్టత ఇవ్వాలని రైతులు ఆందోళన చేయడంతో సదస్సు రసాభసగా ముగిసింది. కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇచ్చినప్పడు చెప్పిన మాటలకు... ఇప్పుడు అధికారులు చెప్పే మాటలకు పొంతన లేదన్నారు. భూములు తీసుకున్నప్పుడు వచ్చిన మంత్రులు... ఇప్పడు గ్రామాలకు ఎందుకు రావడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు నచ్చజెప్పేందుకు సీఆర్డీఏ అధికారులు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. -
ట్రాక్టర్ ఢీకొని తండ్రీకూతురు దుర్మరణం
హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో 8 మంది దుర్మరణం చెందారు. గుంటూరు జిల్లా పెద్దకూరపాడు మండలం అబ్బరాజుపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి చెందారు. వారిద్దరూ బైకుపై వెళుతుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ మలక్‌పేట వద్ద మెట్రో పనుల కోసం తీసిన గుంటలో సిమెంట్ లారీ బోల్తాపడి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. హయత్‌నగర్ పెద్దఅంబర్‌పేట వద్ద జరిగిన రోడ్డప్రమాదంలో మరో ఇద్దరు మృతి చెందారు. డీసీఎం బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్ద సమీపంలో లారీ - కారు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి.