breaking news
-
దీపావళి వేళ అపశ్రుతి..
భోపాల్: దీపావళి పండగ నాడు మధ్యప్రదేశ్‌లో కాల్షియం కార్బైడ్ తుపాకీలతో వందమందికి పైగా గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. క్షతగాత్రుల్లో అత్యధికులు 8–14 ఏళ్ల బాలలే కావడం గమనార్హం. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌తోపాటు పొరుగునే ఉన్న విదిశ జిల్లాలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. సుమారు 60 మంది భోపాల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో, కళ్లకు గాయాలైన ఐదుగురు సహా మిగతా బాధితులు విదిశలో చికిత్స పొందుతున్నారని ఉన్నతాధికారులు తెలిపారు. గ్యాస్ లైటర్, ప్లాస్టిక్ పైపు, కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగించి తయారు చేసిన మొరటు తుపాకులను దీపావళి సందర్భంగా జనం విచ్చలవిడిగా కొనుగోలు చేశారు. ‘తుపాకీలోని కాల్షియం కార్బైడ్ నీటితో కలిసినప్పుడు ఎసిటలీన్ గ్యాస్ తయారవుతుంది. దానికి నిప్పురవ్వ తగలగానే పేలిపోయేలా రూపొందించారు. ఈ పేలుడుతో ప్లాస్టిక్ పైపు నుంచి చిన్నచిన్న ముక్కలు వెలువడతాయి. ముఖం, కళ్లు సహా ఇవి తగిలిన ప్రతిచోటా గాయాలయ్యాయి. ఇవి చాలా ప్రమాదకరమైనవి’అని భోపాల్ చీఫ్ మెడికల్ హెల్త్ అధికారి మనీశ్ శర్మ చెప్పారు. అయితే, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు ఎటువంటి ప్రమాదం లేదన్నారు. దీపావళి నాడు ఒక్క భోపాల్ నగరంలోనే ఇటువంటి 150 కేసులు తమ దృష్టికి వచ్చాయన్నారు. భోపాల్ ఎయిమ్స్‌లో ఈ తుపాకీ కారణంగా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న 12 ఏళ్ల బాలుడికి చూపును పునరుద్ధరించేందుకు వైద్యులు ప్రయతి్నస్తున్నారని ఆయన వెల్లడించారు. హమీదియా ఆస్పత్రిలో మరో ఇద్దరు చిన్నారులకు ఇదే రకమైన చికిత్స జరుగుతోందన్నారు. కళ్లకు గాయాలతో ఈ ఆస్పత్రిలో పది మంది చిన్నారులు చేరారన్నారు. విదిశ జిల్లా ఆస్పత్రిలో చూపు తీవ్రంగా దెబ్బతిన్న ఐదుగురు చిన్నారులకు సైతం చూపును తిరిగి తెచ్చేందుకు చికిత్స చేస్తున్నామని కంటి వైద్య విభాగం అధిపతి ఆర్కే సాహు చెప్పారు. కాగా, ప్రమాదకరమైన కార్బైడ్ పైప్ గన్లను విక్రయించకుండా చూడాలంటూ ఈ నెల 18వ తేదీన మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ అధికారుల సమావేశంలో కోరారు. అయినప్పటికీ వీటి విక్రయం, వాడకం యథావిధిగా జరిగిపోయిందని బాధితుల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. -
రాష్ట్రాలకు జాతీయ మానవ హక్కుల సంఘం లేఖ
ఢిల్లీ: రాష్ట్రాలకు జాతీయ మానవ హక్కుల సంఘం((NHRC) లేఖ రాసింది. చలి కాలంలో నిరాశ్రయుల కోసం షెల్టర్స్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. వృద్ధులు, పిల్లల కోసం తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. చలి గాలులు కారణంగా అనారోగ్యం బారిన పడిన వారికి చికిత్స అందించాలని.. ఎన్హెచ్ఆర్సీ కోరింది.2019 నుంచి 2023 మధ్య చలి గాలులతో 3639 మంది చనిపోయారని ఎన్హెచ్ఆర్సీ గుర్తు చేసింది. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా చలిగాలి మరణాలు తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. ఆయా రాష్ట్రాలు తీసుకున్న చర్యల నివేదికను ఎన్హెచ్ఆర్సీకి పంపాలని ఆదేశాలు జారీ చేసింది. -
వారసులకు ఎంతెంతో ఇప్పుడే చెప్పేయవచ్చు
దేశవ్యాప్తంగా అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల (బ్యాంకు ఖాతాల్లో ఎవరూ క్లెయిమ్ చేయని నగదు) సమస్య బ్యాంకులకు, ఖాతాదారుల కుటుంబాలకు దీర్ఘకాలంగా సవాలుగా మారింది. ఖాతాదారు చనిపోయిన తర్వాత సరైన నామినేషన్ లేకపోవడం వల్ల వేల కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో పోగవుతున్నాయి. దాంతోపాటు నామినీగా ఉన్న వారికిసైతం సరైన అవగాహన లేకపోవడంతో భారీగా డబ్బు ఖాతాల్లో మూలుగుతుంది. ఈ నేపథ్యంలో అన్క్లెయిమ్డ్ నగదును తగ్గించి, చట్టపరంగా నామినీలకు డబ్బు చేరే ప్రక్రియను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఒక ఖాతాకు నలుగురు నామినీలను నియమించుకునేలా నిబంధనలు సడలించింది. ఇది నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.ఇప్పటివరకు ఇలా..ఇప్పటివరకు బ్యాంకు పొదుపు ఖాతాకు ఒకే నామినీని మాత్రమే నియమించే అవకాశం ఉండేది. ఈ నిబంధన అనేక సమస్యలకు దారితీసింది. కొందరు ఖాతాదారులైతే అసలు నామినీని యాడ్ చేయాలని కూడా గుర్తించడం లేదు. ఇంకొందరు నామినీని చేర్చినా ఆ విషయం తమ నామినీకి చెప్పడంలేదు. ఖాతాలో పేరున్న ఒక్క నామినీ ప్రమాదవశాత్తు ఖాతాదారుడి కంటే ముందు మరణిస్తే అకౌంట్లోని నగదు మళ్లీ అన్‌క్లెయిమ్డ్‌గానే మిగిలిపోతుంది. ఆ నగదును చట్టబద్ధమైన వారసులు పొందడానికి సుదీర్ఘమైన, ఖర్చుతో కూడిన వ్యవహారం.నలుగురు నామినీలుఈ ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒక బ్యాంకు పొదుపు ఖాతాకు గరిష్ఠంగా నలుగురు నామినీలను నియమించుకోవచ్చు. ఈ కొత్త నిబంధన ఖాతాదారులకు రెండు ముఖ్యమైన సౌకర్యాలను కల్పిస్తుంది. ఖాతాదారుడు తన డిపాజిట్లలోని నగదును ప్రతి నామినీకి ఎంత శాతం చొప్పున చెందాలి (ఉదాహరణకు, భార్యకు 50 శాతం, ఇద్దరు పిల్లలకు చెరో 25 శాతం) అని స్పష్టంగా పేర్కొనే వీలుంది.ప్రాధాన్యత క్రమంలో..నామినీలను ప్రాధాన్యత క్రమంలో కూడా నిర్ణయించుకోవచ్చు. అంటే మొదటి నామినీ అందుబాటులో లేకపోతే లేదా మరణిస్తే, డబ్బు రెండో నామినీకి చెందుతుంది. ఈ విధంగా నలుగురిలో ఒకరి తర్వాత మరొకరికి డబ్బు చెందేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ నిర్ణయం ద్వారా నామినీని యాడ్ చేయడం మరింత సులభతరం అవుతుంది. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ వ్యక్తులను నామినీలుగా చేర్చడం వల్ల ఏదైనా అనుకోని సంఘటన సంభవించినా డబ్బు ఖచ్చితంగా వారసులకు చేరుతుంది అనే భరోసా లభిస్తుంది.నామినీ నగదును క్లెయిమ్ చేసుకునే విధానంఖాతాదారు మరణించిన తర్వాత నామినీకి నగదు క్లెయిమ్ చేసుకునే ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది.ఖాతాదారుడి మరణం గురించి నామినీ వెంటనే బ్యాంకు బ్రాంచ్‌ను సంప్రదించి వారికి తెలియజేయాలి.బ్యాంకులో అందుబాటులో ఉండే డెత్ క్లెయిమ్ ఫారంను నింపి సమర్పించాలి.ఖాతాదారుడి మరణ ధ్రువపత్రం, మరణాన్ని ధ్రువీకరించిన కాపీ (Attested Copy)ని అందించాలి.నామినీ ఆధార్, పాన్ లేదా ఇతర గుర్తింపు పత్రాలు ఇవ్వాలి.సంబంధిత బ్యాంకు పాస్ బుక్/ డిపాజిట్ రసీదు బ్యాంకులో సమర్పించాలి.నామినీ సమర్పించిన పత్రాలను బ్యాంకు తనిఖీ చేస్తుంది. నామినేషన్ చట్టబద్ధంగా ఉంటే, ఎలాంటి వివాదాలు లేకపోతే, అకౌంట్లో ఉన్న మొత్తాన్ని నామినీకి చెల్లిస్తుంది. ఈ డబ్బును నామినీ ఖాతాకు బదిలీ చేయడం లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లిస్తుంది.ఇదీ చదవండి: అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం.. క్లెయిమ్ ప్రాసెస్ ఎలా? -
త్వరగా ఇచ్చేయండి సార్! మునిగేట్లున్నాము!!
త్వరగా ఇచ్చేయండి సార్! మునిగేట్లున్నాము!! -
అమెరికాలో భార్యకు వేధింపులు ఎన్నారై భర్త అరెస్టు
భార్యపై గృహ హింసకు పాల్పడిన ఆరోపణలతో తిరుపతికి చెందిన NRI . జెస్వంత్ మనికొండ (36) ని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. గృహ హింస మరియు కోర్టు రక్షణ ఉత్తర్వు ఉల్లంఘన ఆరోపణలపై కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ పోలీస్ డిపార్ట్మెంట్ (Milpitas Police Department–MPD) సాంటా క్లారా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం అతణ్ని అదుపులోకి తీసుకుంది. అనంతరం ఎల్మ్వుడ్ కరెక్షనల్ ఫెసిలిటీకి తరలించారు. తరువాత బెయిల్‌పై విడుదలయ్యాడు. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది. -
తుని కేసులో చెరువు దగ్గర ఏం జరిగింది?
సాక్షి, కాకినాడ: తుని ఘటన(tuni Incident)లో పోలీసుల అదుపులో టీడీపీ నేత నారాయణరావు మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారిపోయే ప్రయత్నం చేశాడా? నిజంగానే ఆత్మహత్యకు ప్రయత్నించాడా? అనేది చెరువు దగ్గర ఏం జరిగిందో తెలిస్తేనే నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. ఈలోపే నారాయణ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. ‘‘నలుగురు పోలీసులు రాత్రి మా ఇంటికి వచ్చి రిమాండ్ పేరిట బలవంతంగా సంతకాలు సేకరించారు. రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో చెరువులోకి దూకాడని అంటున్నారు. చనిపోయాడని మాత్రం ఈ ఉదయం 7గం. సమాచారం ఇచ్చారు. ఘటన జరిగిన వెంటనే మాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు?. అందుకే అనుమానాలు కలుగుతున్నాయి. మా అనుమానాలు నివృత్తి చేయాలంటే.. పోలీస్ స్టేషన్ నుండి రిమాండ్ కోసం తరలిస్తుండగా మార్గ మద్యలో ఉన్న సీసీ కెమెరాలు బయటపెట్టాలి’’ అని నారాయణరావు కొడుకు సురేష్, కోడలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కోమటి చెరువు వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నారాయణరావుది సూసైడ్ కాదంటూ బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వాళ్లను పక్కకు లాగేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. అయితే.. పోలీసులు మాత్రం ఆ అనుమానాలను తోసిపుచ్చుతున్నారు. చేసిన పనికి సిగ్గుపడి నారాయణరావు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని చెబుతున్నారు(Narayanarao Suicide). ‘‘అర్ధరాత్రి మెజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్తున్న సమయంలో వాష్‌రూమ్ వస్తుందని నారాయణరావు అడిగాడు. వెంటనే ఎస్కార్ట్ వాహనం ఆపాం. వర్షం పడుతుండడంతో పోలీసులు పక్కనే ఉన్న చెట్ల కిందకు వెళ్లారు. చీకటి కావడంతో నిందితుడు పోలీసులకు కనిపించలేదు. ఈలోపు నీళ్లలో దూకినట్లు శబ్దం వచ్చిందని సిబ్బంది చెప్పారు. రాత్రంతా వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ ఉదయం వెతికితే మృతదేహం దొరికింది’’ అని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు.సంచలన విషయాలు.. తుని మైనర్ బాలిక(13) లైంగిక దాడి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. బాలికకు మాయమాటలు చెప్పి.. వరుసకు తాతను అవుతానంటూ హాస్టల్ సిబ్బందిని నమ్మించి నారాయణరావు ఆమెను ఐదుసార్లు బయటకు తీసుకెళ్లాడు. బాలికకు తండ్రి లేకపోవడంతో నారాయణరావు చెప్పింది నిజమేనని హాస్టల్ సిబ్బంది నమ్మారు. అలా.. మూడు సార్లు బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. మరోసారి తన వెంట తీసుకెళ్లి ఓ తోటలో అఘాయిత్యానికి పాల్పడబోయాడు. అది గమనించి తోట కాపలాదారు అడ్డుకున్నాడు. ఆ సమయంలో తాను టీడీపీ నేతనని, తన జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ బెదిరించాడు. ఈలోపు కొందరు వీడియో తీసి అతగాడి బాగోతాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నారాయణరావును గుడ్డలూడదీసి చితకబాది పోలీసులకు అప్పగించారు. బుధవారం సాయంత్రం నారాయణరావును అరెస్ట్ చేసిన పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసిన రాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచేందుకు తీసుకెళ్తున్న క్రమంలో చెరువులో దూకేశాడని చెబుతున్నారు. -
శర్వానంద్ లేటేస్ట్ లుక్.. ఇంతలా మారిపోయాడేంటి?
టాలీవుడ్ హీరో శర్వానంద్ ఇటీవలే తన కొత్త సినిమాకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ఈ దీపావళి టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను పంచుకున్నారు. బైకర్ అనే మూవీలో శర్వానంద్ నటిస్తున్నట్లు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రంలో బైక్ రేసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ శర్వానంద్ కెరీర్లో 36వ సినిమాగా రానుంది. ఇందులో మాళవిక నాయర్ హీరోయిన్గా కనిపించనుంది.అయితే తాజాగా శర్వానంద్ సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేశారు. షర్ట్ లెస్తో ఉన్న ఫోటోలు చూసిన ఫ్యాన్స్ షాకింగ్‌కు గురవుతున్నారు. ఇవీ చూసిన అభిమానులు.. శర్వానంద్ ఇలా మారిపోయాడేంటి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే బైకర్ మూవీ కోసమే ఇలా పూర్తిగా తన బాడీని మార్చుకున్నారని తెలుస్తోంది. నిజమైన బైక్ రేసర్‌గా కనిపించేందుకు బరువు తగ్గినట్లు తెలుస్తోంది. ఇలాంటి ఫిజిక్ కోసం కొన్ని నెలల పాటు వర్కవుట్స్ చేసినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా.. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అతుల్ కుల్కర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Sharwanand (@imsharwanand) -
మహాఘట్బంధన్కు మోదీ కౌంటర్.. బిహార్‌పై కీలక ప్రకటన
సమస్తిపూర్: వచ్చే నెలలో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే అన్ని రికార్డులు బద్దలుకొడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం ఆయన బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్‌లో ఎన్డీయే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ.. "ఫిర్ ఏక్ బార్ ఎన్డీఏ సర్కార్... ఫిర్ ఏక్ బార్ సుశాసన్ సర్కార్" అని బిహార్ ప్రజలు అంటున్నారన్నారు.నితీశ్ కుమార్‌ను 'సుశాసన్ బాబు' అనే ప్రజాదరణ పొందిన బిరుదు పేరుతో మోదీ ప్రస్తావించారు. మొదటిసారి నితీశ్ కుమార్‌ను ఎన్డీయే ప్రచార ముఖంగా ప్రస్తావించారు. అయితే, ఎన్నికల తర్వాత ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారా? అనే విషయం స్పష్టంగా చెప్పలేదు. ఎక్కడా కూడా సీఎం అభ్యర్థి అనే మాట ప్రస్తావించకుండానే.. ఈసారి కూడా సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లబోతున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఎన్డీయే సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలంటూ తేజస్వి సవాల్‌పై ప్రధాని మోదీ స్పందించినట్లయింది.కాగా, బీజేపీ.. తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడంలో వెనుకడుగు వేస్తోందంటూ మహాఘట్బంధన్ విమర్శించింది. సీఎం నితీశ్ కుమార్ పార్టీ జేడీ(యూ)ని ఖతం చేయడానికి బీజేపీ కుట్రలు సాగిస్తోందంటూ తేజస్వీ యాదవ్ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో నితీశ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ ఈసారి ఎందుకు ప్రకటించడం లేదు? దీని వెనుక అసలు కారణం ఏమిటి?’’ అంటూ తేజస్వీ ధ్వజమెత్తారు. -
ఎన్ఎస్ఈ మ్యూచువల్ ఫండ్ కొత్త యాప్‌లు
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) తన ఎన్ఎస్ఈ ఎంఎఫ్ ఇన్వెస్ట్ మ్యూచువల్ ఫండ్ ప్లాట్‌ఫామ్‌ను మరింత మెరుగుపరిచింది. ఇందులో భాగంగా నాలుగు కొత్త మొబైల్ సొల్యూషన్స్, కీలక అప్డేట్లను జోడించినట్లు ప్రకటించింది. మదుపరులు, ట్రేడింగ్ సభ్యులు, లిస్టెడ్ కంపెనీలకు ప్రాప్యత, పారదర్శకత, సౌలభ్యాన్ని పెంచడం లక్ష్యంగా వీటిని తీసుకొచ్చినట్లు ఎన్ఎస్ఈ వెల్లడించింది.మాన్యువల్ ఎంట్రీ ద్వారా లేదా ఎన్ఎస్ఈలో అమలు చేసిన వారి ట్రేడ్లను లింక్ చేయడం ద్వారా సులభంగా పోర్ట్‌ఫోలియోను ట్రాక్ చేసేలా అప్‌గ్రేడ్ చేసిన ఇన్వెస్టర్ యాప్‌ను ఎన్ఎస్ఈ రూపొందించింది. ఇది ఇంగ్లీష్, హిందీతో సహా 13 భాషలలో అందుబాటులో ఉంది.యూనిక్ క్లయింట్ ఐడెంటిఫికేషన్ (యుసిఐ) లో ఎన్ఎస్ఈలో నమోదు చేసుకున్న తమ బ్రోకర్ ఖాతాకు లింక్‌ను యూజర్లు పొందవచ్చు. ఐఓఎస్, ఆండ్రాయిడ్‌లో మొబైల్ యాప్ ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, కన్నడ, తమిళం, తెలుగు, పంజాబీ, మలయాళం, ఒరియా, అస్సామీ, ఉర్దూ భాషలలో అందుబాటులో ఉంది.మార్కెట్ అప్డేట్స్, గణాంకాలు, ధరల సమాచారం కోసం ఎన్ఎస్ఈ వాట్సాప్ చాట్‌బాట్‌ను కూడా ప్రారంభించింది. సమర్పణ, జరిమానా స్థితి వంటి అంశాలను రియల్ టైమ్‌లో ట్రాక్ చేయడానికి కంప్లయన్స్ డ్యాష్‌బోర్డులు, మదుపరుల అవగాహన కార్యక్రమాలు, సర్క్యులర్లు, FII/DII గణాంకాలకు సులభ ప్రాప్యత కలిగించే సభ్య పోర్టల్ యాప్‌ను ప్రవేశపెట్టింది.కంపెనీలు తమ సమర్పణ స్థితి, సమ్మతి క్యాలెండర్లు, స్టాక్ పనితీరును పర్యవేక్షించడానికి ఎన్ఎస్ఈ ఎన్ఈఏపీఎస్ యాప్‌ను ఉపయోగించవచ్చు.ఈ అన్ని యాప్‌లు ప్రస్తుతం యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి.ప్లాట్ఫామ్లో కీలక అప్డేట్లుఒకే సెషన్లో 10 ఆర్డర్లు (లంప్ సమ్, ఎస్ఐపీ, ఎస్టీపీ, ఎస్‌డబ్ల్యూపీ) వరకూ ఉంచే కార్టింగ్ ఫెసిలిటీపేమెంట్ రీట్రిగ్గరింగ్ సౌకర్యంఫోలియో ఆటో-పాపులేషన్ ద్వారా మదుపరుల లావాదేవీలను ఆటోమేటిక్‌గా మ్యాప్ చేయడం, తద్వారా మాన్యువల్ ఎంట్రీ తప్పులను తగ్గించడంఈయూఐఎన్, సబ్-బ్రోకర్ కోడ్, ఏఆర్ఎన్ వంటి వివరాల ఆటో మ్యాపింగ్ -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. దీంతో సెన్సెక్స్ 344.52 పాయింట్లు లేదా 0.41 శాతం నష్టంతో 84,211.88 వద్ద, నిఫ్టీ 93.90 పాయింట్లు లేదా 0.36 శాతం నష్టంతో 25,797.50 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో ఈప్యాక్ ప్రిఫ్యాబ్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఆరో గ్రీన్‌టెక్ లిమిటెడ్, రాజశ్రీ పాలీప్యాక్, సెక్‌మార్క్ కన్సల్టెన్సీ వంటి కంపెనీలు చేరాయి. అరిహంత్ క్యాపిటల్ మార్కెట్స్, సిక్కో ఇండస్ట్రీస్, Xelpmoc డిజైన్ అండ్ టెక్, కెల్టన్ టెక్ సొల్యూషన్స్, సాగర్ సిమెంట్స్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
