ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించాడు.
టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8లో భాగంగా అఫ్గనిస్తాన్- బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితంతో ఈ స్టార్ బ్యాటర్ ఇంటర్నేషనల్ కెరీర్‌కు తెరపడింది.
కాగా ఇప్పటికే వన్డే, టెస్టుల నుంచి రిటైర్ అయిన డేవిడ్ వార్నర్.. టీ20 వరల్డ్‌కప్-2024 తన అంతర్జాతీయ కెరీర్‌లో చివరి టోర్నీ అని ప్రకటించాడు.
అమెరికా- వెస్టిండీస్ వేదికగా సాగిన ఈ ఐసీసీ ఈవెంట్ తర్వాత తాను వీడ్కోలు పలుకుతానని వెల్లడించాడు.
ఈ క్రమంలో మంగళవారం నాటి ఉత్కంఠ మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్- బంగ్లాదేశ్‌ను ఓడించడంతో.. ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నాకౌట్ అయింది.
కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది.
ఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్ ఇంటర్నేషనల్ కెరీర్‌కు ఇక్కడితో ఫుల్‌స్టాప్ పడినట్లయింది. ఆసీస్ తరఫున అతడు టీమిండియాతో సోమవారం ఆడిన మ్యాచ్ చివరిది కానుంది.
కాగా టీమిండియాతో మ్యాచ్‌లో వార్నర్ ఆరు బంతులు ఎదుర్కొని కేవలం ఆరు పరుగులే చేశాడు.
భారత యువ పేసర్ అర్ష్‌దీప్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కాగా 37 ఏళ్ల ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 2009లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేశాడు.
తొలుత టీ20.. తర్వాత అదే ఏడాది వన్డేల్లో అడుగుపెట్టిన వార్నర్.. 2011లో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు.
మొత్తంగా ఆస్ట్రేలియా తరఫున 112 టెస్టులు, 161 వన్డేలు, 110 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 8786, 6932, 3277 పరుగులు సాధించాడు.
అంతేకాదు ఈ పార్ట్‌టైమ్ స్పిన్నర్ టెస్టుల్లో నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
టీమిండియాతో మ్యాచ్‌లో ఓటమి అనంతరం ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్‌వుడ్ వార్నర్ గురించి మాట్లాడుతూ.. ‘‘మేమంతా అతడిని కచ్చితంగా మిస్ అవుతాం.
చాలా ఏళ్లుగా అతడితో మా ప్రయాణం కొనసాగుతోంది.
మూడు ఫార్మాట్లలో తను అద్భుతంగా రాణించాడు. తొలుత టెస్టులు.. తర్వాత వన్డేలకు.. ఇప్పుడు టీ20లకు ఇలా దూరమయ్యాడు.
అతడు జట్టుతో లేకుండా ఉండటం ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాం’’ అని పేర్కొన్నాడు.


