ప్రాణం తీసిన నిర్లక్ష్యం | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన నిర్లక్ష్యం

Published Thu, Jan 18 2018 3:33 AM

one died in road accident at Tanuku - Sakshi

తణుకు: డ్రైవింగ్‌లో అలసట.. కంటి మీ ద కునుకు లేకుండా చేసిన డ్రైవింగ్‌ ఒకరి ప్రాణాలను తీసింది.. మరో ఇద్దరిని తీవ్ర గాయాలపాలు చేసింది. తణుకు పట్టణ పరిధిలోని శర్మిష్ట సెంటర్‌లో జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రగాయాలతో ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 

కాకినాడ నుంచి గుంటూరు వెళుతున్న బొలేరో ట్రక్కు వాహనం తణుకు శర్మిష్ట సెంటర్‌ వద్ద రెండు వేర్వేరు మోటారు సైకిళ్లపై వెళుతున్న ముగ్గుర్ని ఢీకొట్టింది. పైడిపర్రు గ్రామానికి చెందిన బెల్లం కమీషన్‌ వ్యాపారులు పోతుల శ్రీను (54), పంగం  సాంబశివరావు మోటారు సైకిల్‌పై బెల్లం మార్కెట్‌ నుంచి స్వగ్రామానికి వెళుతున్నారు. ఇదే సమయంలో పాతూరుకు చెందిన చలమలశెట్టి శ్రీనివాస్‌ మరో వాహనంపై తణుకు వైపు వెళుతున్నాడు.

 రెండు వాహనాలు జాతీయ రహదారిపై రోడ్డు పక్కనే వెళుతుండగా కాకినాడ నుంచి గుంటూరు వెళుతున్న బొలేరో ట్రక్కు వెనుక నుంచి వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనాలను సుమారు 100 మీటర్లు మేర ఈడ్చుకెళ్లిపోవడంతో శరీరాలు నుజ్జయ్యాయి. పోతుల శ్రీను అక్కడిక్కడే మృతిచెందగా తీవ్రగాయాలపాలైన సాంబశివరావు, శ్రీనివాసును చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం స్థానికంగా ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యా దు మేరకు పట్టణ ఎస్సై డి.ఆదినారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

బెల్లం కమీషన్‌ వ్యాపారులు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పో తుల శ్రీను, తీవ్ర గాయాలపాలైన పంగం సాంబశివరావు స్నేహితులు. పైడిపర్రు గ్రామానికి చెందిన వీరు వ్యాపారంలోనే కాకుండా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. వీరిద్దరు బెల్లం కమీషన్‌ వ్యాపారం చేస్తున్నారు. ఇద్దరు ఒకే మోటారుసైకిల్‌పై బెల్లం మార్కెట్‌ నుంచి ఇంటికి వెళుతుండగా అనుకోని రీతిలో దూసుకొచ్చిన బొలేరో ట్రక్కు వాహనం వీరిని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీను అక్కడిక్కడే మృతి చెందగా సాంబశివరావు రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. 

తలకు కూడా బలమైన గాయాలు కావడంతో ప్రస్తుతం అపస్మారక స్థితికి చేరుకున్నాడు. రెండు కాళ్లు నుజ్జుకావడంతోపాటు ఎముకలు బయటకు రావడం చూపరులను కలచివేసింది. మృతుడు శ్రీనుకు భార్య దుర్గ, ఇద్దరు కుమారులు ఉన్నారు. సాంబశివరావుకు భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇదే ప్రమాదంలో శ్రీనివాస్‌ తలకు బలమైన గాయాలు కావడంతోపాటు పక్కటెముకలు విరిగి పోయినట్లు వైద్యులు చెబుతున్నారు. వీరిద్దరి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వారంటున్నారు. 

పోలీసుల అదుపులో డ్రైవర్‌
గుంటూరు నుంచి కాకినాడకు బొలేరో ట్రక్కు వాహనంలో కూరగాయలు ఎగుమతి చేసి తిరిగి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి కూరగాయల లోడుతో కాకినాడకు వెళ్లిన డ్రైవర్‌ పోపూరి మరియదాసు విశ్రాంతి లేకుండా తిరిగి గుంటూరు వెళుతున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. నిద్ర వచ్చి రెప్ప వాల్చడంతోనే ప్రమాదం జరిగినట్లు డ్రైవర్‌ మరియదాసు చెబుతున్నారు. ప్రస్తుతం డ్రైవర్‌ తణుకు పట్టణ పోలీసుల అదుపులో ఉన్నాడు.

Advertisement
Advertisement