అమ్మాయి చదువుకు ఆన్‌లైన్‌ కష్టాలు | online technical issue on student ration card details check | Sakshi
Sakshi News home page

అమ్మాయి చదువుకు ఆన్‌లైన్‌ కష్టాలు

Published Fri, Jan 26 2018 12:36 PM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

online technical issue on student ration card details check - Sakshi

ఆమెది మారుమూల గిరిజన ప్రాంతానికి చెందిన కుగ్రామం. ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించింది. ఉన్నత విద్యనభ్యసించి తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలనుకుంది. అనుకున్నట్టుగానే బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులో చేరింది. కానీ కష్టాలు వెంటాడాయి. ఆమెకు స్కాలర్‌షిప్‌ రావడానికి ఆన్‌లైన్‌లో తమ రేషన్‌కార్డు వివరాలు తప్పుగా నమోదవ్వడం అవరోధంగా మారింది. దానిని సరిచేసుకునేందుకు ఆమె అష్టకష్టాలు పడుతోంది.

పార్వతీపురం: కురుపాం మండలం ఈతమానుగూడకు చెందిన పాలక మౌళికకు చిన్నప్పటినుంచి చదువుపై మక్కువ ఎక్కువే. బాగా చదువుకుని ఉద్యోగంలో స్థిరపడాలని కోరుకుంది. అనుకున్నట్టే తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో బీఎస్సీ నర్సింగ్‌ సీటు సంపాదించింది. నిరుపేదరాలైన ఆమె చదువుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఉపకార వేతనంకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు యత్నించింది. ఆ సమయంలో రేషన్‌కార్డు వివరాలను కూడా పొందుపరచాల్సి ఉంది. ఇందులో భాగంగా రేషన్‌కార్డు వివరాలను ఆన్‌లైన్‌ చేసిన సమయంలో కేవలం ఆ కుటుంబంలో మౌళిక మాత్రమే ఉన్నట్లు ఆన్‌లైన్‌లో చూపిస్తోంది. ఇతర కుటుంబ సభ్యుల వివరాలు కన్పించడం లేదు. విద్యార్ధిని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల వివరాలు ఆన్‌లైన్‌లో కన్పించకపోవడంతో ఉపకార వేతనం పొందేందుకు అర్హత పొందలేకపోతోంది. ఉపకార వేతనం పొందేందుకు ఈ నెల ఆఖరుతో గడువు ముగుస్తుండడంతో విద్యార్ధిని ఆందోళన చెందుతోంది.

నెలరోజులుగా తిరుగుతున్నా...
రేషన్‌కార్డు సరిచేసుకునేందుకు నెలరోజులుగా కురుపాం తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయింది. ఒక పక్క కళాశాలకు సెలవులు పెట్టి, రేషన్‌కార్డు సవరణ కోసం నెలరోజులుగా తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో గురువారం ఐటీడీఏ పీఓ డా.జి. లక్ష్మీశను కలసి తన ఆవేదనను విన్నవించుకుంది. రేషన్‌కార్డులో కుటుంబ సభ్యుల వివరాలు లేని కారణంగా ఉపకార వేతనం పొందలేకపోతున్నానని పీఓ వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే స్పందించిన ఐటీడీఏ పీఓ కురుపాం తహసీల్దార్‌కు ఫోన్‌చేసి సమస్యను త్వరితగతిన పరిష్కరించి విద్యార్ధినికి న్యాయం చేయాలని ఆదేశించారు.

స్కాలర్‌షిప్‌ రాకుంటే చదువుకోలేను
రేషన్‌కార్డు సవరించుకునేందుకు కళాశాలకు సెలవులు పెట్టి కురుపాం తహసీల్దార్‌ కార్యాలయంచుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కరించడం లేదు. ఒక వైపు దరఖాస్తు చేసుకొనేందుకు గడువు ముగిసే సమయం దగ్గర పడుతోంది. మాది నిరుపేద కుటుంబం, నాన్న మరణించారు. ఉపకారవేతనం పొందలేకపోతే ఏడాదికి రూ.42వేలు చెల్లించాలి. కళాశాలలో ప్రవేశించిన సమయంలో ఉపకార వేతనం రానివారు ఫీజు చెల్లించాల్సి వుంటుందని అంగీకార పత్రం మీద సంతకాలు చేయించుకున్నారు. అంత డబ్బు చెల్లించే స్తోమత లేదు. ఉపకారవేతనం రాకపోతే చదువు మానుకోవల్సిందే.    పాలక మౌళిక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement