కాంగ్రెస్‌ తొట్రుపాటు | congress discordant over rahul gandhi meeting with chinese envoy | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ తొట్రుపాటు

Jul 13 2017 5:20 AM | Updated on Mar 18 2019 7:55 PM

రాహుల్‌ గాంధీ, చైనా రాయబారి లుయో జావ్‌ హుయి(ఫైల్‌) - Sakshi

రాహుల్‌ గాంధీ, చైనా రాయబారి లుయో జావ్‌ హుయి(ఫైల్‌)

నోరు జారడం, తొట్రుపాటు పడటం, ఇష్టానుసారం ప్రవర్తించడం...ఆ తర్వాత బుకాయించడం, మాట మార్చడం వంటివి గతంలో చెల్లుబాటయ్యేవి.

నోరు జారడం, తొట్రుపాటు పడటం, ఇష్టానుసారం ప్రవర్తించడం...ఆ తర్వాత బుకాయించడం, మాట మార్చడం వంటివి గతంలో చెల్లుబాటయ్యేవి. జనం ఏది నిజమో, ఏది కాదో తేల్చుకోలేక అయోమయంలో పడేవారు. సామాజిక మాధ్యమాలు, వార్తా చానెళ్లు వచ్చాక అంతా మారిపోయింది. ఆ సంగతిని సరిగా గ్రహించలేక కాంగ్రెస్‌ పార్టీ నవ్వులపాలైంది. న్యూఢిల్లీలో చైనా రాయబారి లుయో జావ్‌ హుయి కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో మొన్న శనివారం భేటీ కావడం ఈ గొడవకంతకూ మూలం.

నిజానికి ఇందులో గొడవేమీ లేదు. కాంగ్రెస్‌ తీరి కూర్చుని దాన్ని ఆ స్థాయికి తెచ్చుకుంది. సరిహద్దుల్లో చైనాతో వచ్చిన పేచీ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహిస్తున్నారని ఆరోపించిన మర్నాడు ఈ భేటీ జరగడంతో ఎందుకైనా మంచిదని దీన్ని దాచి ఉంచడానికి కాంగ్రెస్‌ ప్రయత్నించినట్టు కనబడుతోంది. నిజానికి ఈ భేటీ సంగతి చైనా రాయబార కార్యాలయం తన వెబ్‌సైట్‌లో పెట్టడం వల్లే వెల్లడైంది. ఏ రాయబార కార్యాలయమైనా ఆ పనే చేస్తుంది. కానీ కాంగ్రెస్‌ నిరాకరించడం, దానిపై చానెళ్లలో కథనాలు హోరెత్తడం పర్యవసానంగా వెబ్‌సైట్‌లో పెట్టిన ఆ పోస్టింగ్‌ను కాస్తా తొలగించింది.

ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్నవారిని రాయబారి లేదా సీనియర్‌ దౌత్య వేత్త కలవడం... భిన్న రంగాల్లో సహకారాన్ని విస్తరించుకోవడానికి, ఉన్న సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి గల అవకాశాలను చర్చించడం సర్వసాధారణం. ప్రభుత్వంలో ఉన్నవారిని కలవడం ఎంత సహజమో, ప్రతిపక్షాలను కలవడం కూడా అంతే సహజం.  వివిధ అంశాలపై అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకోవడం మామూలే. ఇవాళ విపక్షంలో ఉన్న పార్టీ ఎప్పటికీ అలాగే ఉండిపోతుందని ఎవరూ అనుకోరు. జాతీయ స్థాయిలో మాత్రమే కాదు... రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులనూ, విపక్ష నేతలనూ కలుసు కోవడం సంప్రదాయం. దౌత్య మర్యాదల్లో అదొక భాగం. అందువల్ల వ్యాపార బంధం విస్తరించడానికి మరిన్ని అవకాశాలు ఏర్పడతాయని భావిస్తారు. వివిధ దేశాల్లో మన రాయబారులుగా ఉన్నవారు కూడా ఆ పనే చేస్తారు. ఇవన్నీ బహి రంగంగానే జరుగుతాయి తప్ప చాటుమాటు భేటీలుండవు. అలా రహస్యంగా సమావేశం కావడం అసాధ్యం కూడా.

గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీతో పలుమార్లు చైనా, ఇజ్రాయెల్‌ తదితర దేశాల దౌత్యవేత్తలు సమావేశమైన సందర్భాలున్నాయి. బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చైనా, ఇజ్రాయెల్‌ దేశాలను సందర్శిం చారు. పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా గుజరాత్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు రావడానికి అదొక కారణం. ఏదైనా దేశంతో ఘర్షణలు ముదిరినప్పుడు, యుద్ధం వరకూ వెళ్లినప్పుడు పరిస్థితులు మారతాయి. అప్పుడు దాన్ని శత్రు దేశంగా పరిగణిస్తారు. ఆ దేశంతో దౌత్య సంబంధాలు తెగిపోతాయి. దౌత్య వేత్తల పరస్పర బహిష్కరణలు వగైరా మొదలవుతాయి. ఇప్పుడు భారత్, భూటాన్, చైనా ట్రై జంక్షన్‌లో చైనాతో మన దేశానికి విభేదాలు వచ్చిన మాటా, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న మాటా వాస్తవమే. బలగాలను వెనక్కు తీసుకునే వరకూ ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక చర్చలుండబోవని చైనా చెప్పింది. గతంలోనూ ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్నాళ్లయ్యాక సర్దుకున్నాయి. బౌద్ధ మత గురువు దలైలామా రెండు నెలలక్రితం అరుణాచల్‌ సంద ర్శించినప్పుడు కూడా ఆ దేశం పేచీ పెట్టింది. ఇరుగు పొరుగు దేశాలన్నాక ఇదంతా సర్వసాధారణం. వాటిని ఎలా పరిష్కరించుకుంటాయన్నది ఇరు దేశా ల్లోని ప్రభుత్వాధినేతల రాజకీయ చాకచక్యతపైనా, పరిణతిపైనా ఆధారపడి ఉంటుంది. అది వివిధ స్థాయిల్లో జరిగే చర్చల్లో ప్రతిఫలిస్తుంది.

పొరుగు దేశంతో యుద్ధం తలెత్తితే తరతమ భేదాలు లేకుండా దేశమంతా ఒక్కటవుతుంది. దేశభక్తి వెల్లువెత్తుతుంది. సరిహద్దుల్లో పోరాడే సైన్యానికి వెన్నుదన్నుగా నిలుస్తుంది. కానీ అదంతా ముందే మొదలెట్టాలన్న తహతహ కొందరిలో బయల్దేరింది. దేశ క్షేమానికి, భద్రతకు ఎలాంటి చర్యలు అవసరమో, ఏ విధానాలు పాటించాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఈలోగా అత్యుత్సాహవం తులు చేసే ప్రచారానికి రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ ప్రభావితమైనట్టు కనబడు తోంది. అందుకే చైనా రాయబారితో సమావేశమైన సంగతి బయటకు రాగానే వెనకా ముందూ చూడకుండా ఖండించారు. ఎవరో కింది స్థాయి నేతలు అలా చేస్తే పెద్ద పట్టించుకోనవసరం లేదు. కానీ రణదీప్‌ సుర్జేవాలా లాంటి నాయకుడు చానెళ్లు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయని ఆరోపించడంతో సమస్య జటిలంగా మారింది. మరో నేత మనీష్‌ తివారీ సాయంత్రానికల్లా లౌక్యంతో కూడిన ప్రకటన చేశారు. తమ పార్టీ నేత ఎవరూ ఈ భేటీని తోసిపుచ్చలేదని మీడియాకు ‘గుర్తుచేశారు’. ఇదంతా చూశాక చైనా దౌత్య కార్యాలయం తన పోస్టింగ్‌ను ఉపసంహరించుకుంది.

దేశాన్ని అత్యధిక కాలం ఏలిన కాంగ్రెస్‌ పార్టీ చిన్న విషయంలోనే ఇంత గందరగోళపడటం, ఆ క్రమంలో మరో దేశాన్ని ఇరకాటంలోకి నెట్టడం ఆశ్చర్యకరం. అయిందేదో అయిందని అక్కడితో ఊరుకుంటే వేరుగా ఉండేది. కానీ రాహుల్‌ ఈ ఎపిసోడ్‌లో తనదైన ముద్ర వేశారు. తన భేటీ గురించి కలవరపడుతున్న ప్రభుత్వం ముగ్గురు కేంద్రమంత్రులు చైనా ఆతిథ్యం స్వీకరించడంపై ఏం చెబుతుందని ప్రశ్నించారు. అంతేకాదు... చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ మన దేశం సందర్శించిన సమయంలో అధీనరేఖ వద్ద ఉద్రిక్తతలు ఏర్పడినా సబర్మతీ నది ఒడ్డున ఆయనతో సమావేశం కావడాన్ని ఎత్తిచూపుతూ ఒక ఫొటో ట్వీట్‌ చేశారు. ఇంతకూ రాహుల్‌ చర్యకు ప్రభుత్వం నుంచి అభ్యంతరాలు రాలేదు. సమస్యో, సంక్షోభమో తలెత్తినప్పుడు నిబ్బరంగా, హుందాగా వ్యవహరించగలిగిన వ్యక్తే నాయకుడనిపించుకుంటారు. ఆ సంగతిని రాహుల్‌ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement