అక్కినేని చెప్పిందే నిజమైందా?






విశ్లేషణ


మహాత్మాగాంధీ జీవితాన్ని చలనచిత్రంగా తీసినవారు ఆంగ్లేయులైనా చాలా వాస్తవికంగా, అర్థవంతంగా నిర్మించారనే చెప్పాలి. దానికి గాంధీపట్లనే కాదు. చలనచిత్ర నిర్మాణం పట్ల, చరిత్ర పట్ల ఉన్న నిబద్ధత కారణం. నేటి రాష్ట్ర రాజకీయ పెద్దల దృష్టితో కాకుండా, నాటి వాస్తవిక దృష్టితో, నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను తెలుసుకుని ప్రజలు గుణపాఠం తీసుకునే విధంగా, స్ఫూర్తిదాయకంగా చిత్రించడం ఆ చలనచిత్ర నిర్మాతల సంస్కారానికి గీటురాయి అవుతుంది.



ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదంతో, తెలుగుజాతిలో నూతన భావోద్వేగాలను, జవసత్వాలను ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పినవాడు, ఆంధ్రుల వెండితెర ఆరాధ్య కథానాయకుడు కీ.శే. నందమూరి తారకరామారావు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ తర్వాత పాతికేళ్లపాటు రాష్ట్రంలో తిష్ట వేసిన కాంగ్రెస్‌ పాలనకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి, మహా ప్రభంజనంలో తెలుగు నేల నలుచెరగులా 9 నెలలపాటు అవిశ్రాంతంగా ప్రజానీకంలో తిరిగి నూతన తరహా రాజకీయ రూపురేఖలతో ఓడించి, రికార్డు సృష్టించిన ఘనత ఎన్టీఆర్‌ స్వంతం.



ఆయన జీవిత చరిత్రను చలనచిత్రంగా రూపొందించాలన్న అభిప్రాయం తనకున్నట్లు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రకటించారు. కాగా, రామారావు జీవిత చరిత్రపై చిత్రాన్ని నిర్మించడమే కాకుండా ఆయన పాత్రను తానే ధరించగలనని ఎన్టీఆర్‌ కుమారుడు, సినీ కథానాయకుడు బాలకృష్ణ గతంలోనే ఒకసారి మనసులో మాట చెప్పారు. అయితే ఆ జీవిత చరిత్ర వాస్తవానికి ప్రతిబింబంగా ఉంటుందో లేదో అన్న భయసందేహాలను రామారావు ద్వితీయ కళత్రం లక్ష్మీపార్వతి వెలిబుచ్చారు.



అక్కినేని చెప్పిందే నిజమైందా?

అయితే ఎన్టీఆర్‌ జీవితం అంటే ఆయన వ్యక్తిగత జీవితమే కాదనీ, ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగువారి చరిత్ర అనీ, దానిని సందేశాత్మకంగా, స్ఫూర్తిదాయకంగా ప్రతి తెలుగువాడు గర్వపడే విధంగా నిర్మించాలనీ వివాదాలకు, విషాదాలకు ప్రాధాన్యం ఇవ్వరాదనీ ఒక తెలుగు టీవీ చానల్‌ (సాక్షి కాదు) ఎందుకో భుజాలు తడుముకుంటున్నట్లు అర్జెంటుగా అరగంట కార్యక్రమం నిర్వహించింది. అరగంటలో ఒక్కసారైనా నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు ప్రస్తావన కూడా లేదు. అన్నగారి అత్యంత ఉత్కంఠ భరిత రాజకీయ జీవితం గుర్తుకొచ్చినంత కాలం చంద్రబాబు కూడా గుర్తుంటారు మరి!  300 పైగా సినిమాలలో రాముడు, కృష్ణుడు, అర్జునుడు, బృహన్నల వంటి పాత్రలతో పాటు రావణాసురుడు, దుర్యోధనుడు, కర్ణుడు వంటి వ్యతిరిక్త ఛాయలు గల పాత్రలలో సైతం నభూతో న భవిష్యతి అన్నట్లు నటించిన ఎన్టీఆర్‌ ఔన్నత్యాన్ని వెండితెర జీవితానికే పరిమితం చేయడం అసాధ్యం.



ఎన్టీఆర్‌ రాజకీయ అరంగేట్రం చేయబోయే ముందు నాగేశ్వరరావు గారిని కూడా తనతో పాటు రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించారట. దానికి ఏఎన్నార్‌ బదులిస్తూ, బ్రదర్‌ నిజానికి నేటి రాజకీయాలను నీకంటే నేనే బాగా అర్థం చేసుకున్నాను. నీ సహజ స్వభావం నేటి రాజకీయాలకు సరి పడదు. నువ్వు ఎవర్ని నమ్మినా గుడ్డిగా నమ్ముతావు. ముక్కుసూటిగా మాట్లాడటం తప్ప నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించడం నీవల్ల కాదు. నేను మాత్రం నీతో రాలేను అన్నారట. ఎన్టీఆర్‌ మరణానంతరం నా సోదరుడు రామారావు నటుడిగా కొనసాగినట్లయితే గొప్ప పాత్రలకు ప్రాణపత్రిష్ట చేసేవారు. ఆయన విషాదాంతం చాలా బాధించింది అని ఎఎన్నార్‌ ఒక సందర్భంలో అన్నారు.



రామారావు నటుడుగా మకుటం లేని మహారాజు. రాజకీయ జీవితంలో తనదంటూ ప్రత్యేక ముద్రవేసి నిలబడిన మహానేత. రెండు రూపాయలకు కిలో బియ్యం, జనతా వస్త్రాలు, ప్రతివారికి నిలవనీడని కోట్లాది పేదలకు అందించే సంక్షేమ పథకాలు ఆయనతోనే ఆరంభం. పటేల్‌ పట్వారీ వ్యవస్థ రద్దు. ప్రజల వద్దకు పాలన తేవాలని సమితి స్థానంలో మండల పాలనా విధానం ఆయన పాలన రూపకల్పనే. అయితే.. ఎన్టీఆర్‌ రాజకీయ జీవితం ఎంత ఉన్నతమై, స్ఫూర్తిదాయకమైనప్పటికీ, విషాదాంతమని చెప్పక తప్పదు. ఆయన రాజకీయ చరమాంకంలో తాను పెంచి పెద్ద చేసిన వారు తనను విస్మరించి ఒంటరిని చేశారన్న బాధతో, పదవీభ్రష్టుడై ఆ మానసిక వేదనతో హృద్రోగం తిరగబెట్టి ఎన్టీఆర్‌ కన్నుమూయడం పెద్ద విషాదం.



ఎన్నో సినిమాలలో ఆయన హీరో. విలన్లను ఓడించిన కథానాయకుడు. తీరా తన రాజకీయ జీవితంలో అలానే వ్యవహరించగలిగారా? అలా కాపట్యంపై, విలన్లపై విజయం సాధించగలిగారా? రాజకీయాలకు సంబంధించి రామారావుకు ఏఎన్నార్‌ చేసిన హెచ్చరికే నిజమైందా? అంతటి ప్రజాభి మానం చూరగొన్న నేత రాజకీయ జీవితం ఎందుకిలా ముగిసింది? ఆ హీరోను అంతిమంగా ఓడించి, ఆయనకు ఆ పరిస్థితి దాపురించేందుకు కారణమైన విలనీ ఏమిటి? ఆ విలనీకి కారణమైన నాటి వాస్తవిక రాజకీయ పరిస్థితులు, ఆ సందర్భంగా వ్యక్తుల పాత్ర వీటిని గురించి నిష్పక్షపాతంగా నిజాయితీగా తెలుగు ప్రజలకు తెలియజేయడం కూడా రామారావు జీవితాన్ని చలనచిత్రగా నిర్మించదలిచిన వారు విస్మరించరాని బాధ్యత.



నేటి నేతలు ఆధునిక మనువులే..!

రామారావు జీవితంలో విలన్‌ లక్ష్మీపార్వతి అని ఆ దుష్టశక్తి వల్లనే రామారావు జీవితం విషాదాంతం అయిందని కొందరు నేటికీ ప్రచారం చేస్తుండటం మనం చూస్తున్నాం. మనుస్మృతి ఆధారిత సామాజిక అణచివేతలో, వర్ణవివక్షతతోపాటు స్త్రీలను హీనంగా చూడటం కూడా ఆ భావజాలంలో అంతర్భాగమే. నేటికీ కొందరు పెద్దలు.. కోడలు పండంటి కొడుకును కంటాను అంటే వద్దనే అత్త ఎవరు అన్న సామెతను చెబుతారు కానీ చక్కని చుక్క, చదువుల సరస్వతి లాంటి మనవరాలిని కంటానంటే అత్త వద్దంటుందా అన్న మాట వారి నోట రాదెందుకు? లక్ష్మీపార్వతి కేవలం ఇంట్లో దీపం పెట్టి భర్తకు వండిపెడుతూ అతిథి అభ్యాగతులను ఆదరించే ఇల్లాలుగా వంట ఇంటికే పరిమితమై ఉంటే ఆ ‘పెద్ద’లకు అభ్యంతరం ఉండేది కాదేమో! శ్రీమతి బసవతారకం మరణానంతరం ఎన్టీఆర్‌ను పలకరిద్దామని నాటి సినీ నటి భానుమతి ఆయన ఇంటికెళ్లారట.



‘ఆ లంకంత కొంపలో, తనను ఆప్యాయంగా, పలకరించి ప్రేమను పంచేవారు లేక ఒంటరిగా బావురుమన్నట్లున్న రామారావును చూసి చాలా బాధ అనిపించింది. సింహంలా నలుగురిని శాసించే రామారావు ఎక్కడ? ఇలా ఆలనాపాలనా లేకుండా దైన్యంగా ఉన్న ఈ రామారావు ఎక్కడ? ఆయన ఎన్టీఆర్‌ని వివాహం చేసుకున్నారని విన్నతర్వాత అనిపించింది. లక్ష్మీపార్వతి రాక రామారావులో మునుపటి ఉత్సాహ, ఉద్వేగాలను పునరుజ్జీవింప చేస్తుంది’ అని అన్నారట. ఒక మానవ హృదయం స్పందించిన తీరు అది. పైగా లక్ష్మీపార్వతి చట్టరీత్యా తన మొదటి వివాహాన్ని రద్దు చేసుకున్నారు. రామారావు అప్పటికే కళత్రవిహీనుడు. నిజానికి వారి వివాహానికి, సహజీవనానికి ఏ లీగల్‌ అభ్యంతరాలు ఉండవు. అందునా రామారావు తమ అనుబంధాన్ని చాటుమాటు వ్యవహారంగా సాగించలేదు. దాదాపు లక్షమంది ప్రజలు పాల్గొన్న బహిరంగ సభలో ప్రజల సాక్షిగా లక్ష్మీపార్వతిని వేదికపైకి ఆహ్వానించి, తాను ఆమెను వివాహమాడుతున్నానని తన సహజ రాజసాన్ని ప్రదర్శించారు.

 

ఆయనను అడ్డం పెట్టుకుని, తెరవెనుక చక్రం తిప్పాలనుకున్న పెద్దలకు ఆయన పేరుతో తమ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకోదలిచిన వారికి రామారావు జీవితంలో లక్ష్మీపార్వతి పాత్ర పెరుగుతుండటం నచ్చకపోవడం సహజం. అందుకే ఆమె స్థానంలో ఒక వారసుడిని ప్రవేశపెట్టదలుచుకున్నారు. కానీ అందుకు తగిన మెటీరియల్‌ ఆయన వారసునిలో  కనిపించలేదు. అప్పుడు చంద్రబాబు వారి దృష్టికి వచ్చాడు. చంద్రబాబు సరసన చేరి ఎన్టీఆర్‌ సంతానాన్ని కూడా ఆయనకు దూరం చేసి చంద్రబాబు ద్వారా తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు కొన్ని శక్తులు కుటిల యత్నాలు చేశాయి. తన ఆశీస్సులతో, అండదండలతో శాసనసభ్యులైన తన తెలుగు తమ్ముళ్లను కలుసుకుందామని, లక్ష్మీపార్వతి లేకుండా వారికి వాస్తవాలు తెలిస్తే వారు తిరిగి తనకు తోడుగా ఉంటారని ఆశించిన ఎన్టీఆర్‌కు గతంలో ఏ ముఖ్యమంత్రికీ జరగనంత అవమానం ఎదురైంది. ఆదరించాల్సిన రామారావుపై చెప్పులు విసిరి ఘోరంగా పరాభవించారు.



కృతజ్ఞతను మర్చిన వారే వెన్నుపోటు పొడిచారా?

ఆ తర్వాత అప్రజాస్వామిక రీతిలో నాటి గవర్నర్‌ కృష్ణకాంత్, అసెంబ్లీ స్పీకర్‌ యనమల రామకృష్ణుడు వంటి రాజ్యాంగ పెద్దల అక్రమమైన సహకారంతో ఎన్టీఆర్‌ని పదవీభ్రష్టుడిని చేశారు. ఆయన స్థాపించిన తెలుగు దేశం పార్టీని, దాని ఎన్నికల చిహ్నం సైకిల్‌ని కూడా హైజాక్‌ చేశారు. కృతజ్ఞత అనేది మనిషికి ఉండాల్సిన సద్‌లక్షణాల్లో అత్యుత్తమమైనది. ఓటుకు అయిదువేలు అయినా ఇవ్వగలనని నిర్లజ్జగా నంద్యాల ఎన్నికల సందర్భంగా చెప్పగల ముఖ్యమంత్రి, గత ఎన్నికల్లో గెలిచేందుకు 12 కోట్లు ఖర్చుచేశానని మీడియా ముందు ప్రకటించిన సభాపతులు కొంతకాలం ప్రజలను ఎత్తులతో, జిత్తులతో ఆడుకోవచ్చు.



కానీ సాధారణమానవులెవ్వరూ నాడు రామారావుకు జరిగిన అన్యాయం తెలుసుకున్నా, గుర్తుకొచ్చినా ఆ కృతఘ్నతను క్షమించలేరు. అప్పటికే రామారావుకు గుండె జబ్బు ఉంది. అంతటి పరాభవాన్ని ఆయన భరించలేకపోయారు. కానీ తాను అంతగా నమ్మిన, సోదరతుల్యుల చేతిలో అవమానానికి గురైన బాధ ఆయన హృదయంపై ప్రభావం చూపింది. ఆయన మరణానికి ఇదీ ఓ ప్రధాన కారణం. ఆనాడు ఏఎన్నార్‌ చెప్పినట్లుగా రామారావు అపాత్రదానం, గుడ్డినమ్మకం, నిష్కర్షగా వ్యవహరించే తత్వం చివరకు ఎంతటి విషాదానికైనా దారి తీయొచ్చని ప్రపంచానికి గుణపాఠం చెప్పింది కూడా.



ఎన్టీఆర్‌ జీవిత చలనచిత్రంలో కమ్యూనిస్టుపార్టీల ప్రస్తావన రాకతప్పదు. 1984లో ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని నాదెండ్ల భాస్కరరావును అడ్డంపెట్టుకుని కేంద్రప్రభుత్వం కూల్చివేసిన సందర్భంగా టీడీపీకంటే ముందే స్పందించి ప్రజాస్వామ్య పరిరక్షణ సభను నిర్వహించి టీడీపీకి, ఎన్టీఆర్‌కి దన్నుగా నిలిచిన కమ్యూనిస్టు పార్టీలు తర్వాత 1995లో రామారావును పదవీభ్రష్ణుడిని చేసి వెన్నుపోటు రాజకీయ సందర్భంగా చంద్రబాబు కొమ్ము కాశాయి. అలా ఎందుకు చేయవలసి వచ్చిందో నేటికీ కమ్యూనిస్టుల నుంచి సమాధానం లేదు. నేడు ఏపీలో కమ్యూనిస్టు పార్టీలను కించపర్చడంలో చంద్రబాబు, ఆయన కుమారుడిదే అగ్రస్థానం.



గాంధీ జీవితాన్ని చలనచిత్రంగా తీసినవారు ఆంగ్లేయులైనా చాలా వాస్తవికంగా, అర్థవంతంగా నిర్మించారనే చెప్పాలి. దానికి గాంధీపట్లనే కాదు. చలనచిత్ర నిర్మాణం పట్ల, చరిత్ర పట్ల ఉన్న నిబద్ధత కారణం. నేటి రాష్ట్ర రాజకీయ పెద్దల దృష్టితో కాకుండా, నాటి వాస్తవిక దృష్టితో, రామారావు జీవిత చరిత్రను తెలుసుకుని ప్రజలు గుణపాఠం తీసుకునే విధంగా, స్ఫూర్తిదాయకంగా చిత్రించడం ఆ చలనచిత్ర నిర్మాతల సంస్కారానికి గీటురాయి అవుతుంది.





డాక్టర్‌ ఏపీ విఠల్‌

వ్యాసకర్త మార్క్సిస్టు విమర్శకులు ‘ మొబైల్‌ : 98480 69720

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top