
సాగు నీటి ఉద్గారాలు తగ్గేదెలా?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మెట్ట ప్రాంతాల్లో వ్యవసాయం దిగుడు బావుల కన్నా ఎక్కువగా బోర్లపైనే ఆధారపడి ఉంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మెట్ట ప్రాంతాల్లో వ్యవసాయం దిగుడు బావుల కన్నా ఎక్కువగా బోర్లపైనే ఆధారపడి ఉంది. ప్రధాన పంటలైన వరి, చెరకు, మొక్కజొన్న, వేరుశనగ, కూరగాయల సాగులో విద్యుత్తు ఎంతెంత ఖర్చవుతోంది? ఎంతెంత పరిమాణంలో ఉద్గారాలు వెలువడుతున్నాయి? భూతాపాన్ని అతిగా పెంచేస్తున్న ఈ ఉద్గారాలను తగ్గించుకునే పద్ధతులేవి? భూమిలో నుంచి తోడిన నీటిని ఏ యే పంటకు, ఏ యే విధంగా వాడుకుంటే విద్యుత్తు వాడకం, ఉద్గారాలు తగ్గుతాయి? ఇటువంటి ఆసక్తికరమైన అంశాలపై కొంచెం లోతుగా తెలుసుకోవాలంటే.. హైదరాబాద్ సంతోష్‌నగర్‌లోని కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధనా సంస్థ (క్రీడా) ప్రధాన శాస్త్రవేత్తలు డా. కె. శ్రీనివాసరెడ్డి, డా. వి. మారుతి చేసిన అధ్యయనం వివరాలను పరిశీలించాల్సిందే! ప్రపంచ నీటి వారోత్సవాల (ఆగస్టు 28 - సెప్టెంబర్ 2) సందర్భంగా.. ‘సాగుబడి’ పాఠకులకు ఈ అధ్యయనం వివరాలను అందిస్తున్నాం..
ప్రపంచ వ్యాప్తంగా భూగర్భ జలాల వినియోగం 3,800 క్యూబిక్ కిలో మీటర్లు ఉండగా.. అందులో 70 శాతం వ్యవసాయానికే వాడుతున్నాం. భూగర్భ జలాలు ఒక మీటరు లోతుకు తగ్గిపోయాయంటే అర్థం ఏమిటంటే.. మరో మీటరు ఎక్కువ లోతులో నుంచి నీరు తోడుకోవాల్సి వస్తున్నదని! ఆ మేరకు విద్యుత్తు ఎక్కువ ఖర్చవడంతోపాటు.. కర్బన వాయు ఉద్గారాలు (ఒక మీటరు లోతు నీటికి 6%) ఎక్కువగా వాతావరణంలోకి వెలువడుతున్నాయి. వాతావరణాన్ని అమితంగా వేడెక్కిస్తున్నాయి.
నీటిని పొలంలో పారించడం కన్నా డ్రిప్, స్ప్రింక్లర్, రెయిన్‌గన్‌లు వాడినప్పుడు.. నీటి వినియోగ సామర్థ్యం సుమారు 30 నుంచి 70 శాతం మేరకు ఉండడమే కాకుండా.. ఇంధనం 12-44 శాతం ఆదా అవుతుంది. కానీ, పంపు ద్వారా నీటిని తోడి.. పంట పొలంలో నీటిని పారగడితే.. అధిక పరిమాణంలో కర్బన వాయు ఉద్గారాల విడుదలకు దోహదం చేస్తుంది.
సాధారణంగా వెయ్యి క్యూబిక్ మీటర్ల నీటిని ఒక మీటరు ఎత్తుకు తీసుకెళ్లడానికి గంటకు 2.73 కిలోవాట్ల శక్తి ఖర్చవుతుంది. అడుగంటిన భూగర్భ జలాలను ఒక మీటరు ఎక్కువ లోతు నుంచి తోడడానికి వాడే ఇంధన వనరులు పెరగడం వల్ల గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు సుమారు 6 శాతం ఎక్కువ విడుదలయ్యే ప్రమాదం ఉంది. మెరుగైన పద్ధతుల్లో సాగునీటిని వాడడం ద్వారా ఉద్గారాలను 40 శాతం దాకా తగ్గించే వీలుంటుంది.
సమైక్య ఆంధ్రప్రదేశ్‌లోని మూడు (తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ) ప్రాంతాల్లో ముఖ్య పంటలైన వరి, మొక్కజొన్న, చెరకు, కూరగాయలు, వేరుశనగలో ఉపరితల నీటి పారుదల, రెయిన్‌గన్, స్ప్రింక్లర్, డ్రిప్ మొదలైన నీటిపారుదల పద్ధతుల నీటి ఉత్పాదకత (వాటర్ ప్రొడక్టివిటీ) ను, ఖర్చయ్యే శకి ్త, వెలువడే కర్బన వాయు ఉద్గారాల (సీఓ2 ఎమిషన్స్)పై చేసిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.
బోరు బావుల సంఖ్య క్రమేణా పెరుగుతుంటే, దిగుడుబావుల సంఖ్య తగ్గుతున్నది. భూగర్భ జల అభివృద్ధి సంస్థ పూర్వపు లెక్కల ప్రకారమే.. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరమూ సుమారు 50 వేల కొత్త బోర్లు వేస్తున్నారు. వరుస కరువులతో ఇప్పుడు డెల్టా ప్రాంతాల్లోనూ బోర్లు జోరుగా వేస్తున్నారు. అయితే, దిగుడు బావితో పోల్చితే బోరు బావి వల్ల రెట్టింపు ఉద్గారాలు వెలువడుతున్నాయి.
లైనింగ్ చానళ్ల నీటితో వరి సాగు మేలు:
మూడు (తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ) ప్రాంతాల్లోనూ వరిని నీటిని నిల్వగట్టే పద్ధతిలో పండిస్తుంటారు. ఈ పద్ధతిలో ఎక్కువ ఉద్గారాలు వెలువడతాయి. బోరుబావుల నీటితో ఈ పద్ధతిలో వరి సాగు చేసినప్పుడు హెక్టారు (సుమారు రెండున్నర ఎకరాలు)కు, గంటకు 10.36 మెగావాట్ల శక్తి ఖర్చవుతుండగా.. హెక్టారులో నెలకు 1.6 టన్నుల బొగ్గుపులుసు వాయువు విడుదలవుతుంది. అయితే, దిగుడు బావుల నీటి వాడకానికయ్యే విద్యుత్తు ఖర్చు హెక్టారుకు గంటకు 5.18 మెగావాట్లు కాగా, హెక్టారుకు నెలలో 0.8 టన్నుల బొగ్గుపులుసు వాయువు విడుదలవుతున్నట్లు అంచనా. వరిలో నీటిని నిల్వగట్టే పద్ధతిలో నీటి పంపిణీలో సామర్థ్యం 30 శాతం మాత్రమే. కాబట్టి, వరి సాగుకు బోరు, దిగుడు బావుల నీటి వాడకాన్ని తగ్గించి, లైనింగ్ ఉన్న చానళ్లతో కాలువ నీటిని వాడితే.. వెలువడే ఉద్గారాలను కనిష్ట స్థాయికి తగ్గించవచ్చు.
కోస్తాలో బోర్ల కింద మొక్కజొన్న:
నీటిని పారించే పద్ధతిలో బోరు బావుల నీటితో మొక్కజొన్న పండిస్తే సాగునీటి పంపిణీ సామర్థ్యం 30 శాతానికి తగ్గింది. గంటకు హెక్టారుకు 4.53 మెగావాట్ల విద్యుత్తు ఖర్చయింది. హెక్టారుకు నెలకు 1.05 టన్నుల బొగ్గుపులుసు వాయువు ఉద్గారాలు వెలువడుతున్నట్లు అధ్యయనంలో తెలిసింది. కానీ, రెయిన్‌గన్, స్ప్రింక్లర్ పద్ధతుల ద్వారా.. బోరుబావి నీటితో మొక్కజొన్న పండిస్తే నీటి వాడుక సామర్థ్యం 35 నుంచి 37.5 శాతం దాకా పెరుగుతుంది. హెక్టారుకు గంటకు 3.63 నుంచి 3.87 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే ఖర్చవుతుందని అధ్యయనంలో తేలింది. తద్వారా బొగ్గు పులుసు వాయువు ఉద్గారాలు నెలకు హెక్టారుకు సుమారు 0.80 నుంచి 0.91 టన్నులకు తగ్గింది. ఇక దిగుడు బావుల నీటితో మొక్కజొన్న పండిస్తే విద్యుత్తు వాడకం, ఉద్గారాల బెడద సగానికి సగం తగ్గిపోతుంది. కోస్తాంధ్రలో మొక్కజొన్నను బోరు బావుల కింద రెయిన్‌గన్ లేదా స్ప్రింక్లర్లతో సాగు చేయడం ఉత్తమం.
డ్రిప్‌తో చెరకు సాగు ఉత్తమం:
తెలుగు రాష్ట్రాల్లోనూ చెరకు పంట ఎక్కువగా బోరుబావుల నీటితోనే పండిస్తున్నారు. డ్రిప్‌తో చెరకు సాగు చేస్తే 31.1 శాతం మేరకు ఉద్గారాలు తగ్గించవచ్చు. చెరకు పంటలానే కూరగాయలను ఎక్కువగా బోర్ల కిందే పండిస్తున్నారు. నీటిని పారించే పద్ధతిలో కూరగాయలను పండిస్తే హెక్టారుకు నెలకు సుమారు 1.47 టన్నుల ఉద్గారాలు వెలువడే ప్రమాదం ఉంది. రెయిన్ గన్‌తో 14%, స్ప్రింక్లర్‌తో 18%, డ్రిప్‌తో 26.3% మేర ఉద్గారాలను తగ్గించే వీలుంది.
వేరుశనగకు స్ప్రింక్లర్లు మేలు:
రాయలసీమ, తెలంగాణలలో ఒకానొక ముఖ్య పంట వేరుశనగ. నీటిని పారించే పద్ధతిలో నెలకు హెక్టారుకు 800 కిలోల ఉద్గారాలు వెలువడతాయి. రెయిన్‌గన్‌లు వాడి 13% వరకు, స్ప్రింక్లర్లు వాడి 16% మేరకు ఉద్గారాలు తగ్గించుకోవచ్చు. ఈ మూడు ప్రాంతాల్లోనూ వరిని ఆరుతడి పంటగా, శ్రీ పద్ధతిలో సాగు చేయడం మేలు. మొక్కజొన్న, వేరుశనగ పంటలను బోరుబావుల కింద పండించేటప్పుడు స్ప్రింక్లర్లు లేదా రెయిన్‌గన్లు వాడటం ఉత్తమం. చెరకు, కూరగాయలను డ్రిప్ ద్వారా పండిస్తే నీటిని ఆదా చేయడంతోపాటు ఉద్గారాలను తగ్గించవచ్చు. కూరగాయలను డ్రిప్‌తో పండిస్తే ఉద్గారాలు తగ్గుతాయి.
(డా. శ్రీనివాసరెడ్డి ఫోన్: 99480 71805 ఈ మెయిల్ ksreddy.1963@gmail.com)
‘కర్బన ఉద్గార ముద్ర’ అంటే?
ఒక ప్రాంతంలో మనుషులు చేసే పనుల వల్ల ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ వాతావరణంలోకి విడుదలయ్యే గ్రీన్‌హౌస్ వాయువుల మొత్తాన్ని బొగ్గు పులుసు వాయు సమాన పరిమాణంలో చెప్పడాన్ని ‘కర్బన వాయు ఉద్గార ముద్ర (సీఓ2 ఫుట్ ప్రింట్)’ అంటారు. ఆయా ప్రాంతాల్లో పండించే వివిధ పంటలు, నీటిపారుదల పద్ధతులను బట్టి వాటి కర్బన వాయు ఉద్గార ముద్రను అంచనా వేయవచ్చు.