
ఆశల సేద్యంలోనూ అవనిలో సగం!
మెట్ట సేద్యం అనగానే అప్పులు.. రైతులనగానే ఆత్మహత్యలు.. ఆత్మహత్యలనగానే పురుగుమందులు.. పత్తి పంట..
సేంద్రియ పత్తిలో లాభదాయకంగా అంతరపంటల సాగు ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ మహిళా రైతుల విజయగాథ
మెట్ట సేద్యం అనగానే అప్పులు.. రైతులనగానే ఆత్మహత్యలు.. ఆత్మహత్యలనగానే పురుగుమందులు.. పత్తి పంట.. చటుక్కున మనసులో మెదలటం పరిపాటైపోయిన రోజులివి...! ‘ప్రాణాలు తీసే పంట’గా పేరు పడిన పత్తిని సేంద్రియ సాగు పద్ధతులతో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసీ మహిళా రైతులు మచ్చిక చేసుకున్నారు! సేంద్రియ పత్తితోపాటు ఆహార పంటలనూ కలిపి పండిస్తూ.. ఆర్థిక భద్రతతోపాటు ఆరోగ్య భద్రతనూ పొందుతున్నారు. సంఘటిత స్ఫూర్తితో బతుకును పండించుకుంటున్నారు.
అత్యధిక విస్తీర్ణంలో పత్తి సాగయ్యే కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటైతే.. తెలంగాణలో అత్యధికంగా పత్తి సాగయ్యే జిల్లా ఆదిలాబాద్. ఈ జిల్లాలోని ఆదివాసీ మహిళా రైతులు పత్తి రైతులకు ఉరి పేనుతున్న సమస్యలను సంఘటిత శక్తితో అధిగమిస్తున్నారు. రైతుకు, భూమికి నష్టదాయకంగా పరిణమించిన రసాయనిక సేద్యాన్ని, పొలమంతటా ఒకే (ఏక) పంటను పండించే పద్ధతిని, అన్నదాతల మధ్య అనైక్యతను.. మొక్కవోని సహకార స్ఫూర్తితో తుత్తునియలు చేస్తున్నారు. కెరమెరి మండలం చౌపన్‌గైడలో పదేళ్ల క్రితం ఈ సాగుకు అంకురార్పణ జరిగింది. సహకార సంఘాల ద్వారా ఏకమైన చిన్న, సన్నకారు ఆదివాసీ రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను క్రమంగా అలవర్చుకున్నారు.
పత్తితోపాటే ఆహార పంటల సాగు
దేశవాళీ (నాన్ బీటీ) పత్తి విత్తనాలు, సేంద్రియ ఎరువులు, కషాయాలు వాడుతున్నారు. ఆదాయం కోసం పత్తి ప్రధాన పంటగా సాగు చేస్తూనే.. పత్తి సాళ్ల మధ్యలో కుటుంబ పోషణకు ఉపయోగపడే కూరగాయ పంటలు పండించుకుంటున్నారు. 8 పత్తి సాళ్లకు ఒక సాలు చొప్పున కూరగాయలు, పప్పుదినుసులు సాగు చేస్తున్నారు. సగటున పొలంలో 25% విస్తీర్ణం మేరకు అంతరపంటలు, 75% వరకు పత్తి వేస్తున్నారు. తమ జీవనం కొనసాగించేందుకు భూమిపైనే ఆధారపడుతూ, ఆ భూమి నిస్సారమైపోకుండా, కోల్పోయిన సారాన్ని తిరిగి సమకూర్చుకునేందుకు ఉపయోగపడే సేంద్రియ సాగు పద్ధతిని అవలంబిస్తున్నారు. తక్కువ పెట్టుబడితోనే రసాయనిక వ్యవసాయం చేసే రైతులకన్నా ఎక్కువ దిగుబడితోపాటు, ఎక్కువ నికరాదాయాన్నీ పొందుతున్నారు.
‘చేతన’ గొడుగు కింద..
ఆదిలాబాద్ జిల్లా కెరమెరి పరిసర మండలాల్లో 423 మంది మహిళా ఆదివాసీ రైతులు దేశీ పత్తితోపాటు కూరగాయలు పండిస్తూ ఆనందంగా జీవనం సాగిస్తున్నారు. చేతన ఆర్గానిక్ ఫార్మర్స్ అసోసియేషన్ గొడుగు కింద ఉన్న 154 రైతు బృందాల్లో 2 వేలకు పైచిలుకు రైతులతోపాటు ఈ మహిళా రైతులు కలసి కట్టుగా కదులుతూ ఆదాయ భద్రతను పొందుతున్నారు. కలకత్తాకు చెందిన రాజ్యలక్ష్మి స్పిన్నింగ్ మిల్లు ప్రతి ఏటా వీళ్ల దగ్గర సేంద్రియ పత్తిని కొనుగోలు చేస్తోంది. తొలుత నెదర్లాండ్ ఈటీపీ సంస్థ మూడేళ్ల పాటు తోడ్పడింది. 2007లో చేతన ఆర్గానిక్ ఫార్మర్స్ అసోసియేషన్ రిజిస్టరైంది. ఆదిలాబాద్ జిల్లాలో తొలి సేంద్రియ పత్తి రైతు అయిన ఆత్రం కుసుంభరావు (94411 38 567) సారథ్యంలోనే అసోసియేషన్ నడుస్తోంది. ‘రైతులకు నాన్‌బీటీ పత్తి విత్తనాలు, సాగు సలహాలందించడంతోపాటు సేంద్రియ సర్టిఫికేషన్, మార్కెట్ సదుపాయం వరకు అసోసియేషనే చూసుకుంటుంద’ని ఫీల్డ్ సూపర్‌వైజర్ ఎస్. అంబాదాస్ (81797 60042) తెలిపారు.
సగం ఖర్చుతోనే సేంద్రియ సాగు
ఈ అసోసియేషన్ నేతల సమాచారం మేరకు.. కెరమెరి పరిసరాల్లో రసాయనిక వ్యవసాయంలో పత్తి సాగు చేసే రైతు ఎకరానికి ఏడాదికి రూ. 15-20 వేలు ఖర్చవుతుంటే.. సేంద్రియ పత్తి సాగుకు రూ. 5-10 వేలకు మించడం లేదు. ఈ ఏడాది తక్కువ వర్షం వల్ల ఎకరానికి 4, 5 క్వింటాళ్ల సేంద్రియ పత్తి దిగుబడి వచ్చింది. మామూలు పత్తి క్వింటాలుకు రూ.3,800-రూ. 4,000 ధర వచ్చింది. సేంద్రియ పత్తికి రూ. రూ. 4,200 వరకు వచ్చింది. కొన్న ప్రతి క్వింటాలో పత్తికి రూ. 300 చొప్పున అసోసియేషన్‌కు ప్రీమియంగా కంపెనీ చెల్లిస్తుంది. ఈ డబ్బుతో రైతులకు శిక్షణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఆదివాసీ మహిళా సేంద్రియ రైతు సిడాం భీంబాయి(కెరమెరి మండలం భీమన్‌గోంది) 2006లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా బిర్లా సైన్స్ ఫౌండేషన్ అవార్డును అందుకున్నారు. భీంబాయి బాటలో వందలాది మహిళా రైతులు నడుస్తుండటం విశేషం. బడుగు రైతులు ఏకతాటిపైకి వచ్చి సేంద్రియ సేద్యం చేపడితే బతుకు ఎలా బాగుపడుతుందో వీరిని చూస్తే అర్థమవుతుంది.
- కెరమెరి, ఆదిలాబాద్ జిల్లా
పదేళ్ల నుంచి సేంద్రియ పంటలు..!
నాకు ఆరెకరాల సాగు భూమి ఉంది. పదేళ్ల నుంచి సేంద్రియ పంటలు పండిస్తున్నా. దిగుబడి, ఆదాయం బాగానే ఉంది. ఈ సంవత్సరం వర్షం తగ్గినా ఎకరానికి ఐదు క్వింటాళ్ల పత్తి పండింది. క్వింటాలోకు రూ. 4,200 ధర పలికింది.
- కుర్సెంగ మారుబాయి, పెద్దసాకడ, కెరమెరి మండలం, ఆదిలాబాద్ జిల్లా
ఎన్నడూ నష్టం రాలేదు!
సేంద్రియ పంటను పదేళ్ల నుంచి చేస్తున్న. ఏ సంవత్సరం కూడా నష్టం జరగలేదు. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతున్న.
- సిడాం భీంబాయి, భీమన్‌గోంది,
కెరమెరి మండలం, ఆదిలాబాద్ జిల్లా
సేంద్రియ పంటకు అధిక ధర
నాకు ఆరెకరాల భూమి ఉంది. చాలా సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్న. ఏడేళ్లుగా పత్తి పండిస్తున్నా. ఎకరానికి ఐదు క్వింటాళ్ల పత్తి పండుతుంది. బయటి ధరకంటే సేంద్రియ పంటకు ధర అధికంగా ఉంటుంది. ఏడాదికి కనీసం రూ. 40 వేల నికరాదాయం వస్తోంది.
- సోయం మారుబాయి, బాబేఝరి, కెరమెరి మండలం, ఆదిలాబాద్ జిల్లా
పత్తిలో అంతర పంటలు..
నాన్ బీటీ పత్తి పంటలోనే కంది, పెసర, మినుము, బొబ్బర్లు, జొన్న, మొక్కజొన్న, మినుములు వంటి అంతర పంటలు వేస్తున్నాం. సేంద్రియ పంటల వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం.
- ఆత్రం సోంబాయి, ఢబోలి,
జైనూర్ మండలం,
ఆదిలాబాద్ జిల్లా