పత్తి కొనుగోలు మరింత లేటు! | CCI purchasing centers that are still not open | Sakshi
Sakshi News home page

పత్తి కొనుగోలు మరింత లేటు!

Oct 19 2025 4:45 AM | Updated on Oct 19 2025 4:45 AM

CCI purchasing centers that are still not open

ఇప్పటికీ తెరుచుకోని సీసీఐ కొనుగోలు కేంద్రాలు

రాష్ట్రంలోని 220 జిన్నింగ్‌ మిల్లులు కొనుగోళ్లకు ఎంపిక 

 ‘కపాస్‌ కిసాన్‌’ యాప్‌ ద్వారా రిజిస్టర్‌ అయిన రైతుల నుంచే సేకరణ

ఇప్పటికే కొన్ని వ్యవసాయ మార్కెట్లకు పత్తి 

వర్షాలతో నాణ్యత దెబ్బతినడంతో రూ. 6 వేలకే కొంటున్న దళారులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పత్తి పంట సేకరణ వేగవంతమైనప్పటికీ కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఇంకా కొనుగోళ్లు ప్రారంభించలేదు. దళారీ వ్యవస్థను, జిన్నింగ్‌ మిల్లుల అక్రమ దందాను నిరోధించేందుకు సీసీఐ తెచ్చిన కొత్త నిబంధనలతో తలెత్తిన వివాదంతో మిల్లర్లు ఈనెల మొదటి వారందాకా పత్తి కొనుగోళ్ల టెండర్లలో పాల్గొనలేదు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చొరవతో జిన్నింగ్‌ మిల్లుల యాజమాన్యాలు కొనుగోళ్లకు ముందుకొచ్చినప్పటికీ మిల్లులను నోటిఫై చేసే ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. 

ఈ నేపథ్యంలో దీపావళి మరుసటి రోజు నుంచి కొనుగోళ్లు ప్రారంభిస్తామని రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ చెబుతున్నప్పటికీ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే పత్తికి పెద్ద మార్కెట్‌ అయిన వరంగల్‌ జిల్లాలోని ఎనుమాముల పత్తి లోడ్‌లతో నిండిపోయింది. వచ్చిన పత్తిని జిన్నింగ్‌ మిల్లుల ఏజెంట్లు, దళారీలు తక్కువ ధరకే కొంటున్నారు. పత్తికి మద్దతు ధర క్వింటాలుకు రూ.8,110 ఉండగా, రూ. 6వేల లోపే కొంటున్నారు. సీసీఐ కొనుగోళ్లు ఆలస్యమయ్యే కొద్దీ రైతులు దళారులను ఆశ్రయించడం పెరుగుతోంది.

ఎల్‌–1, ఎల్‌–2 మిల్లుల ఎంపిక తరువాతే...
పత్తి జిన్నింగ్‌ కోసం సీసీఐ విడుదల చేసిన టెండర్‌లో లింట్‌ శాతం, ఎల్‌–1, ఎల్‌–2 కింద మిల్లుల కేటాయింపు, అలాట్‌మెంట్‌ స్లాట్‌ బుకింగ్, ఏరియా మ్యాపింగ్‌ కోసం ఉన్న నిబంధనలను మిల్లర్లు తొలుత వ్యతిరేకించారు. దాంతో రెండుసార్లు టెండర్లు ఆహ్వానించినా, పాల్గొనలేదు. ఈనెల 6న మంత్రి మిల్లర్లతో సమావేశమై భరోసా ఇవ్వడంతో మిల్లులు టెండర్లు దాఖలు చేశాయి. 

రాష్ట్రంలోని 30 జిల్లాల్లోని 343 మిల్లులకు పత్తిని జిన్నింగ్‌ చేసే సామర్థ్యం ఉండగా, ఇప్పటివరకు 22 జిల్లాల కలెక్టర్లు 220 మిల్లులను నోటిఫై చేశారు. మిగతా 8 జిల్లాల్లో నోటిఫై కావాల్సి ఉంది. మిల్లులను నోటిఫై చేశాక ఎల్‌–1, ఎల్‌–2 కింద ఎంపిక చేయాల్సి ఉంది. ‘కపాస్‌ కిసాన్‌’ యాప్‌ ద్వారా రైతులు తాము విక్రయించాల్సిన పత్తి కోసం స్లాట్‌ బుక్‌ చేసుకుంటే, ముందుగా ఎల్‌–1 కింద మిల్లులకు పత్తిని కేటాయిస్తారు. ఎల్‌–1లోని మిల్లుల కెపాసిటీకి తగినంత పత్తిని పంపాక, ఎల్‌–2 మిల్లులకు పంపిస్తారు.  

వర్షాలతో దెబ్బతిన్న పంట
రాష్ట్రంలో రెండు నెలలుగా కురుస్తున్న అకాల వర్షాలతో చాలాచోట్ల పత్తి పంట దెబ్బతింది. పత్తి చేన్లలో నీరు నిలిచి దిగుబడిపై ప్రభావం చూపినట్లు వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మొదటి విడత పికింగ్‌ (ఏరిన) పత్తిని రైతులు తమ వద్ద నిల్వ చేశారు. 

రాష్ట్రంలో ఈసారి 46 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, 28.29 లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తి కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేశారు. అయితే వర్షాల కారణంగా దెబ్బతినడంతో అది 25 లక్షల మెట్రిక్‌ టన్నుల లోపే ఉండొచ్చని భావిస్తున్నారు. గత ఏడాది 44.73 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేయగా, 21 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది.

క్వింటాల్‌కు రూ.1,300 నష్టం
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం 8 శాతం తేమ ఉన్న పత్తికి రూ.8,110 చెల్లించి సీసీఐ కొను గోలు చేస్తోంది. ప్రస్తుతం అదే క్వాలి టీ ఉన్న పత్తికి ప్రైవేటు వ్యాపారులు రూ.6,800 చెల్లిస్తున్నారు. అంటే క్వింటాల్‌కు రూ.1,300 వరకు నష్టపోతున్నాం.     – రవి, పత్తి రైతు చౌళ్లపల్లి,అత్మకూరు మండలం, హనుమకొండ జిల్లా 

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
సీసీఐ లేకపోవడం వల్ల పత్తి నాణ్యత ఉన్నప్పటికీ ప్రైవేటు వ్యాపారులు మద్దతు ధర చెల్లించడం లేదు. సీసీఐ ఉంటే క్వింటాకు రూ.వేయి అదనంగా వస్తుంది. అందువల్ల వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి.– పల్లెశ్యాం, పత్తి రైతు తోగరు రామయ్యపల్లె, దుగ్గొండి మండలం, వరంగల్‌ జిల్లా 

యాప్‌లో నమోదు చేసుకోవాలి
పత్తి రైతులు తమ పంట వివరాలను మండల వ్యవసాయ అధికారుల వద్ద నమోదు చేయించుకోవాలి. తాత్కాలి కంగా నమోదు ప్రక్రియ పూర్తయితే మరోసారి నమోదు చేసే అవకాశా ల్లేవు. యాప్‌లో నమోదు చేసుకోకుంటే కొనుగోళ్ల సమ యంలో ఇబ్బందులు తప్పవు. – ఉప్పుల శ్రీనివాస్, ఆర్‌జేడీఎం, వరంగల్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement