
గవర్నర్ ప్రసంగంపై చర్చ తరువాత అవిశ్వాసం
శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ తరువాత చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం...
ప్రతిపక్ష నేత జగన్ వెల్లడి
* నోటీసు ఇచ్చిన పదిరోజుల్లో స్పీకర్ నిర్ణయం తెలపాలి
* 17 మంది ఎమ్మెల్యేలు నిలబడి మద్దతు ఇస్తే చర్చకు అనుమతించినట్లే..
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ తరువాత చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. గవర్నర్ ప్రసంగం పూర్తయిన తరువాత శాసనమండలి, శాసనసభ వాయిదాపడిన అనంతరం ఆయన లాబీల్లో విలేకరులడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
చంద్రబాబు ప్రభుత్వం అవినీతి సొమ్ముతో పాల్పడుతున్న ఫిరాయింపులు, రాజధాని నిర్మాణం పేరుతో సాగుతున్న బినామీ భూదందా, ఎన్నికల హామీలు నెరవేర్చడంలో చేసిన మోసాలకు నిరసనగా ఈ అవిశ్వాసం ఉంటుందని చెప్పారు. అవిశ్వాసం నోటీసు ఇచ్చినా ఈ సమావేశాలు ముగిసేలోపు స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం లేదని అధికారపక్ష సభ్యులు చెబుతున్నారని ఓ విలేకరి ప్రస్తావించగా.. ‘అలా ఉండదు. మేం నోటీసు ఇచ్చిన పది రోజుల్లోపల నిర్ణయం తెలియజేయాలి. సభలో 17 మంది ఎమ్మెల్యేలు లేచి నిలబడి మద్దతు ఇస్తే చాలు అవిశ్వాసాన్ని చర్చకు అనుమతించినట్లు అవుతుంది..’ అని జగన్ పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగంపై వ్యాఖ్యానించాలని కోరినప్పుడు ‘సభలో మాట్లాడతాను..’ అన్నారు.
నేనన్న మాటలను వక్రీకరించడం సరైనదేనా?
తాను రాజ్‌భవన్ వద్ద అన్న మాటలను మీడియా వక్రీకరించడం సరైనదేనా? అని జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘ఆరోజు నేను మాట్లాడిన 13 నిమిషాల నిడివి గల వీడియోను ప్రసారం చేస్తే వాస్తవం ఏమిటనేది తెలుస్తుంది. అసలు నేను చెప్పిందేమిటి? ఏ సందర్భంలో అన్నాను. మీరు చేసిందేమిటి? మీ మనస్సాక్షిని అడగండి.. నేను మాట్లాడింది తప్పు అంటే శిక్షకు నేను రెడీ.. తప్పయితే మీరు రెడీయా?’ అని ఆయన మీడియాను ఉద్దేశించి అన్నారు. ‘ఆరోజు నేనేమన్నాను.. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మంత్రివర్గ సమావేశంలో.. హరీశ్‌ను చూసి, కేటీఆర్‌ను చూసి బుద్ధి తెచ్చుకోండి.
వాళ్లను చూడండి.. ఎమ్మెల్యేలను ఎలా లాగుతున్నారో.. అన్నారన్నాను. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అనాల్సిన మాటలేనా అవి అన్నాను. విచ్చలవిడిగా అవినీతి చేసి సంపాదించిన సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయండని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే తన క్యాబినెట్ సహచరులకు చెప్పడం ధర్మమా! అని అడిగాను..’ అన్నారు. ‘మీరు నేను మాట్లాడిన మాటలన్నీ ప్రసారం చేయరు.. మీకు ఏది అవసరమో (కన్వీనియంట్‌గా ఉంటుందో..) దానిని మాత్రమే చూపిస్తారు. ఇది ఏ మాత్రం సరికాదు.’ అని జగన్ పేర్కొన్నారు.