Nov 23 2016 6:47 PM | Updated on Sep 4 2017 8:55 PM
‘రాహుల్‌గాంధీని నేను పెళ్లి చేసుకుంటా’
దేశంలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్లలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఒకరు.
దేశంలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్లలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఒకరు. త్వరలోనే పార్టీ నాయకత్వ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న రాహుల్ పెళ్లి గురించి మీడియాలో చాలా కథనాలే వచ్చాయి. కానీ, ఇటీవల అనూహ్యంగా ఓ మహిళ ఆయనను పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చింది. రాహుల్ గాంధీ అందానికి తాను ఫిదా అయ్యానని చెప్తున్న ఆమె.. తనను ఆయన ఎందుకు పెళ్లి చేసుకోవాలో వివరిస్తూ పలు బలమైన కారణాలు కూడా చెప్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ షికార్లు కొడుతున్నది.
ఉత్తరప్రదేశ్ అలహాబాద్‌కు చెందిన ఓ మహిళ ఇటీవల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం బయట మీడియాతో మాట్లాడుతూ తన మనసులోని మాటను బయటపెట్టారు. రాహుల్‌గాంధీపై తాను మనస్సు పడ్డానని, ఆయనను ప్రేమిస్తున్నాని చెప్పారు. ‘రాహుల్‌కు నేను వీరాభిమానిని.. ఎందుకంటే ఆయన దళితుల ఇళ్లలో అన్నం తిన్నారు, దళితులకు సాయపడ్డారు, కాబట్టి ఆయన దళితురాలని పెళ్లి చేసుకోవాలి’ అని చెప్పారు. ‘నిజానికి నేను ఓబీసీ మహిళను. చాలాకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్నాను. కాబట్టి నన్నే ఆయన ఎందుకు చేసుకోకూడదు’ అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ సేవా దళ్ సభ్యురాలిగా తాను చాలాకాలంగా పనిచేస్తున్నట్టు ఆమె తెలిపారు. 2006లోనే రాహుల్‌ను పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలు తనలో మొగ్గతొడిగాయని, అతను తన స్వప్నసుందరుడని చెప్పారు. 2014లో తాను కాంగ్రెస్‌లో చేరానని, అప్పటినుంచి రాహుల్‌పై తన నమ్మకం మరింత పెరిగిందని చెప్పారు. అమేథీ ఎంపీ అయిన రాహుల్ తనను పలుసార్లు కలిశారని ఆమె చెప్పుకొచ్చారు. ఎందుకు ఆయనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? అని విలేకరులు ప్రశ్నించగా.. ‘ఆయన అందగాడు. ప్రధాని కొడుకు. మంచి నేత’ అంటూ చాంతాడంతా జాబితా బయటపెట్టారు. పెళ్లి విషయంలో రాహుల్ ఏమైనా హామీ ఇచ్చారా? అని అడుగగా ‘నిజజీవితంలో ఇవ్వలేదు కానీ, కలలో తరచూ వచ్చి నిన్నే పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చేవారు’ అని పేర్కొన్నారు. తననే భార్యగా చేసుకుంటానని కలలో రాహుల్ ఎన్నోసార్లు చెప్పినట్టు ఆమె వివరించారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.