
భర్త కళ్ల ముందే భార్య అగ్నికి ఆహుతి
ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు రెండు కిడ్నీలు పాడై మంచానికే పరిమితమైన భర్త.. దీనికి తోడు భర్తతో జరి గిన ఘర్షణ..
ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ గొడవలతో ఇల్లాలి ఆత్మహత్య కాపాడలేని దైన్యస్థితిలో భర్త, బిడ్డ
హైదరాబాద్: ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు రెండు కిడ్నీలు పాడై మంచానికే పరిమితమైన భర్త.. దీనికి తోడు భర్తతో జరి గిన ఘర్షణ.. ఆ ఇల్లాలిని మనోవేదనకు గురిచేసింది. క్షణికావేశంలో కట్టుకున్న భర్త, కన్న కూతురు కళ్ల ముందే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయ విదారక ఘటన రాంనగర్‌లో చోటు చేసుకుంది. రాళ్ళపల్లి వినోద్ , శ్రీలక్ష్మి(36) దంపతులు రాంనగర్‌లోని మదర్స్ స్కూల్ దగ్గర నివసిస్తున్నారు. వినోద్ మొదట్లో ఆటో నడిపేవాడు. తాగుడుకు బానిస కావడంతో రెండు కిడ్నీలు పాడైపోయి.. ఏడాది నుంచి మంచానికే పరిమితమయ్యాడు. శ్రీలక్షి్ష్మ చుట్టుపక్కల ఇళ్ళలో పనిచేసి కుటుంబాన్ని పోషిస్తోంది.
తొమ్మిదేళ్ల కుమారుడు వేద పాఠశాలలో వేద విద్యను అభ్యసిస్తున్నాడు. ఆరేళ్ల పాప సాయినిఖిత జేవీ హైస్కూల్‌లో 1వ తరగతి చదువుతోంది. ఆర్థిక ఇబ్బందులు, భర్త పరిస్థితి శ్రీలక్ష్మిని మనోవేదనకు గురిచేశాయి. వారం క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. సోమవారం పాఠశాల నుంచి వచ్చిన కూతురుకు భోజనం వడ్డించగా ఆమె తండ్రి వద్దకు వెళ్లి కూర్చొని అన్నం తింటుండగా అక్కడెందుకు కూర్చున్నావ్, బయట కూర్చో అనడంతో భార్యాభర్తల మధ్య మళ్లీగొడవ జరిగింది. దీంతో క్షణికావేశానికి గురైన శ్రీలక్ష్మి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. కళ్ళ ముందే ఈ ఘోరం జరుగుతున్నా ఆపలేని స్థితిలో భర్త, కూతురు ఉండిపోయారు. కాగా, అభం శుభం తెలియని చిన్నారి అమ్మ కోసం వెక్కివెక్కి ఏడవడం అందరినీ కలచి వేసింది.