
యూపీ ఎన్నికల్లో దళితుల దన్ను ఎటువైపు?
దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో పార్టీల జయాపజయాలు నిర్ణయించే షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీలు) ఈసారి ఎవరికి ఓటేస్తారనే ప్రశ్న కీలకంగా మారింది.
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)
దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో పార్టీల జయాపజయాలు నిర్ణయించే షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీలు) ఈసారి ఎవరికి ఓటేస్తారనే ప్రశ్న కీలకంగా మారింది. 22.5 కోట్ల జనాభాతో దేశంలో అతి పెద్ద రాష్ట్రం యూపీలో అతి పెద్ద సామాజికవర్గం దళితులు. దాదాపు 21 శాతమున్న( నాలుగున్నర కోట్ల జనాభా) యూపీ దళితులను దేశంలోనే అత్యంత చైతన్యవంతమైన బలహీనవర్గంగా పరిగణిస్తారు. ఇక్కడ దళితుల్లో భూమిలేనివారు కేవలం6.5 శాతం మాత్రమే. (మొత్తం 403 అసెంబ్లీ సీట్లలో 84 దళితులకు రిజర్వ్‌చేశారు) 63 కులాలుగా చీలిన దళితుల్లో అతి పెద్ద కులం చమార్లు(చర్మకారులైన వీరిని పశ్చిమ యూపీలో జాటవ్‌లంటారు). బహుజన్‌సమాజ్ పార్టీ నేత మాయావతి ఢిల్లీ సమీపంలోని గాజియాబాద్ జిల్లాకు చెందిన జాటవ్ కుటుంబంలో జన్మించారు. యూపీ ఎస్సీల్లో దాదాపు 55 శాతం చమార్లే. వారే బీఎస్పీకి, మాయావతికి ప్రధాన పునాది వర్గం. పార్టీ స్థాపకుడు కాన్సీరాం కూడా పంజాబీ చమార్. ఇతర ఎస్సీ కులాలతో పోల్చితే చమార్లు జనాభాలోనే గాక అన్ని రంగాల్లో ముందున్నారు.
మొదట్లో మొగ్గు కాంగ్రెస్‌కే
స్వాతంత్య్రం రాక ముందు దళితులు బీఆర్ అంబేడ్కర్ నాయకత్వంలోని రెండు పార్టీలకు ఆకర్షితులయ్యారు. 1952 ఎన్నికల నుంచి నాలుగో సాధారణ ఎన్నికల వరకూ అత్యధిక దళితులు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. 1967 లోక్‌సభ, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలు, ఇతర సామాజికవర్గాల మాదిరిగానే కాంగ్రెస్‌కు కొంత దూరమయ్యారు. దీంతో కాంగ్రెస్ మెజారిటీ అసెంబ్లీ సీట్లు సాధించలేదు. 1969లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కాంగ్రెస్‌ను చీల్చాక వరుసగా జరిగిన 1969, 74 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే అత్యధికంగా ఓట్లేశారని ఎన్నికల విశ్లేషకుల అధ్యయనాలు చెబుతున్నాయి. ఎమర్జెన్సీ అనంతరం జరిగిన 1977 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని వర్గాలతో కలిసి కాంగ్రెస్‌ను ఓడించారు. మళ్లీ బ్రాహ్మణులు, ముస్లింలతో కలిసి 1980, 85 ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్‌కు పట్టం కట్టారు దళితులు. 1980 ఎన్నికల్లో 52 శాతం దళితుల ఓట్లు పొందిన కాంగ్రెస్ వేగంగా వారి మద్దతు కోల్పోయింది. 2014 ఎన్నికల్లో వారిలో 19 శాతం మాత్రమే కాంగ్రెస్‌కు ఓటేశారు.
బీఎస్పీతో దళితుల్లో పెరిగిన చైతన్యం!
1984లో దళితులు, బీసీలు, ముస్లింలను కలుపుకుని బహుజనలని పేరుపెట్టి వారి కోసం బీఎస్పీని కాన్షీరాం స్థాపించకముందు యూపీలోనే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఉద్యోగులైన దళితులను సమీకరించారు. 1989 నుంచీ దళితులు బీఎస్పీ వైపు మొగ్గడం మొదలైంది. యూపీలో బీఎస్పీ బలం కూడా అప్పటి నుంచి వేగంగా పెరిగింది. 1989 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి లభించిన 9.41 శాతం ఓట్లలో సగం దళితులవే. అప్పటి నుంచి ఈ పార్టీ బలం 2009 వరకూ గణనీయంగా పెరిగింది. 1991లో ఒంటరిగా పోటీచేసి 9.44 శాతం ఓట్లు సాధించింది. ఎస్పీతో కలిసి పోటీచేసిన 1993 ఎన్నికల్లో బీఎస్పీ 11.2 శాతం ఓట్లతో 67 సీట్లు సాధించింది. కాంగ్రెస్‌తో కలిసి 1996 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయగా సీట్లు(67) పెరగలేదుగాని ఓట్లు(19.64) పెరిగాయి. తర్వాత 2002 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దళితుల మద్దతుతో బీఎస్పీ 21శాతం ఓట్లతో 98 సీట్లు గెల్చుకుని సొంతగా మెజారిటీ సాధించే దిశగా బలపడింది. 2007 ఎన్నికల్లో దళితులు, బ్రాహ్మణులు చేతులు కలిపి బీఎస్పీకి మెజారిటీ సీట్ల(206)తోపాటు 30.4 శాతం ఓట్లు పడేలా చూశారు. మాయావతి 1995 నుంచి నాలుగుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఏడేళ్లు పరిపాలించారు.
2012లోనూ ఎస్సీల అత్యధిక ఓట్లు బీఎస్పీకే!
అయిదేళ్ల పాలన తర్వాత 2012 అసెంబ్లీ ఎన్నికల్లో దళితులు బీఎస్పీవైపే నిలవడంతో ఈ పార్టీ 80 సీట్లే గెల్చుకున్నా, 25.9 శాతం ఓట్లు సాధించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో ఒక్క కూడా గెల్చుకోలేదు. అయితే, బలంగా వీచిన నరేంద్రమోదీ ప్రభంజనాన్ని తట్టుకుని 20 శాతం ఓట్లు పొందడం విశేషం. దళితులు మాయావతికి మద్దతుగా ఉండడమే దీనికి కారణం. మొత్తం 80 సీట్లకు 71 కైవసం చేసుకున్న బీజేపీకి దళిత ఓట్లలో 27 శాతం పడ్డాయని సర్వేల్లో తేలింది. పదేళ్ల యూపీఏ(కాంగ్రెస్) పాలన తర్వాత ప్రధాని ఎవరనే విషయంపై జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మిగిలిన కులాల జనంతో పాటు దళితులు సైతం బీజేపీవైపే చెప్పుకోదగ్గ సంఖ్యలో మొగ్గారు. ఫిబ్రవరి 11 నుంచి మార్చి 8 వరకూ జరిగే యూపీ 17వ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీలు ముఖ్యంగా దళితుల్లో సగానికి పైగా ఉన్న చర్మకారుల(జాటవ్‌లు) ఓట్లలో మూడొంతులు మాయావతి పార్టీకి పోలవుతాయని అంచనావేస్తున్నారు. బీజేపీ, మోదీ ప్రభుత్వం ఎస్సీలకు దగ్గరకావడానికి తగనన్ని చర్యలు తీసుకోలేదు. ఎస్పీ అయిదేళ్ల పాలనలో దళితులకు పెద్ద మేలు జరగకపోగా, దాడులు ఎక్కువయ్యాయని ఈ వర్గం జనం భావిస్తున్నారు. దళిత చైతన్యానికి బాటలు వేసిన బీఎస్పీ ఉనికిని కాపాడానికి ఎస్సీలు పెద్ద సంఖ్యలో మాయావతికే ఓటేస్తారని ఎన్నికల సర్వేలు సూచిస్తున్నాయి.