కరిగిపోతున్న డాలర్‌ కలలు! | Trump effect: dollar dreams melting | Sakshi
Sakshi News home page

కరిగిపోతున్న డాలర్‌ కలలు!

Mar 27 2017 11:19 PM | Updated on Aug 25 2018 7:52 PM

కరిగిపోతున్న డాలర్‌ కలలు! - Sakshi

కరిగిపోతున్న డాలర్‌ కలలు!

కఠినతరమైన వీసా నిబంధనలు, పెచ్చురిల్లుతున్న జాతి విద్వేషపూర్వక దాడులు అమెరికా చదువులపై మోజును తగ్గిస్తున్నాయి.

ట్రంప్‌ ఎఫెక్ట్‌
వాషింగ్టన్‌: కఠినతరమైన వీసా నిబంధనలు, పెచ్చురిల్లుతున్న జాతి విద్వేషపూర్వక దాడులు అమెరికా చదువులపై మోజును తగ్గిస్తున్నాయి. భారత్, చైనా విద్యార్థులు అమెరికన్‌ వర్సిటీల్లో చదివేందుకు జంకుతున్నారని, అందుకే అడ్మిషన్లకు దరఖాస్తులు తగ్గుతున్నాయని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు.

అగ్రరాజ్యం అమెరికా నూతన అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలు భారతీయుల డాలర్‌ కలలపై నీళ్లు జల్లుతున్నాయి. కఠినతరమైన వీసా నిబంధనలు, జాతి విద్వేషపూర్వక దాడుల కారణంగా అమెరికన్‌ వర్సిటీల్లో విదేశీ విద్యార్థుల అడ్మిషన్లు తగ్గిపోతున్నాయి. ఈ విద్యాసంవత్సరం 250కి పైగా అమెరికన్‌ కాలేజీల్లో, ఆరు అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల అడ్మిషన్లకు దరఖాస్తులు 26 శాతం పడిపోయినట్టు తాజా సర్వే వెల్లడించింది. గ్రాడ్యుయేట్‌ దరఖాస్తులు కూడా 15 శాతం తగ్గాయి. మొత్తంగా అంతర్జాతీయ విద్యార్థుల దరఖాస్తుల సంఖ్య సగటున 40 శాతం పడిపోయిన్నట్టు తేలింది. అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ కాలేజెస్‌ రిజిస్ట్రార్స్‌ అండ్‌ అడ్మిషన్‌ ఆఫీసర్స్,  ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌  ఎడ్యుకేషన్, అసోసియేషన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేటర్స్‌  సంయుక్తంగా చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

సగం మంది భారత్, చైనా నుంచే..
ఇవి విడుదల చేసిన నివేదికలోని వివరాలు ఇలా ఉన్నాయి. అమెరికా వర్సిటీల అడ్మిషన్లలో చైనా, భారత్‌ నుంచే 47 శాతం ఉంటాయి. అంటే అమెరికాలో చదివే అంతర్జాతీయ విద్యార్థుల్లో సగం మంది ఈ దేశాల విద్యార్థులే ! ఇటీవలి పరిణామాలు అమెరికా యూనివర్సిటీల్లో అంతర్జాతీయ విద్యార్థుల దరఖాస్తులను తగ్గించేస్తున్నాయి. చైనా నుంచి కూడా యూజీ కోర్సుల దరఖాస్తులు 25 శాతం, గ్రాడ్యుయేట్‌ కోర్సుల దరఖాస్తులు 32 శాతం పడిపోయాయి. ట్రంప్‌ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలు అంతర్జాతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపాయి. భవిష్యత్తులోనూ అడ్మిషన్లు పెద్దగా పెరగకపోవచ్చని పోర్ట్‌లాండ్‌ స్టేట్స్‌ వర్సిటీకి చెందిన విమ్‌ వివెల్‌ చెప్పారు. ఈ ఏడాది తమ యూనివర్సిటీలో భారతీయ విద్యార్థుల అడ్మిషన్లు 26 శాతం తగ్గిపోయాయని ఆయన వివరించారు.

కొంపముంచుతున్న ట్రంప్‌ నిర్ణయాలు
అమెరికాలో ఇటీవల పలువురు భారతీయులపై జాతివిద్వేష దాడులు జరగడం, వీసాల జారీని కఠినతరం చేయడం వంటి పరిణామాలు భారత విద్యార్థులపై ప్రభావం చూపుతున్న మాట నిజమేనని న్యూయార్క్‌ స్టేట్‌ యూనివర్సిటీ అధికారి జాన్‌ జే వుడ్‌ తెలిపారు. పీజీ కోర్సు చేసిన భారతీయ విద్యార్థులు ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ తరువాత ఇక్కడే మూడేళ్లు పని చేసుకునే సదుపాయం ఉండేది. అయితే వీసా నిబంధనల్లో తాజాగా తీసుకొస్తున్న మార్పులు విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తున్నాయని వుడ్‌ చెప్పారు. అంతేకాక కొన్ని ముస్లిం దేశాల జాతీయులు అమెరికాలోకి ప్రవేశించకుండా విధించిన నిషేధమూ చెడు సంకేతాలను పంపిందని అమెరికా విద్యారంగ నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement