హాస్య నటుడు కుమరిముత్తు కన్నుమూత

హాస్య నటుడు కుమరిముత్తు కన్నుమూత


చెన్నై : ప్రముఖ హాస్యనటుడు కుమరిముత్తు(78) ఆదివారం అర్ధరాత్రి చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. రంగస్థలం నుంచి సినిమా రంగానికి పరిచయం అయిన నటుడు కుమరిముత్తు.ఎంఆర్.రాధ మొదలగు పలు నాటక ట్రూపుల్లో నాటకాలాడిన ఈయన సొంత ఊరు కన్యాకుమారి జిల్లా,కాట్టుప్పుదురై గ్రామం. నటుడు నంబిరాజన్, దర్శకుడు కేఎం.బాలక్రిష్ణన్‌ల తమ్ముడు కుమరిముత్తు. 1964లో నగేశ్ నటించిన పోయ్‌సొల్లాదే చిత్రం ద్వారా చిత్ర రంగప్రవేశం చేసిన కుమరిముత్తు తమిళంతో పాటు తెలుగు, కన్నడం,మలయాళం భాషల్లో వెయ్యికి పైగా చిత్రాల్లో నటించారు. కలైమామణి అవార్డుతో పాటు పలు అవార్డులను అందుకున్నా కుమరిముత్తుకు తన నవ్వే ప్రత్యేకం.



ఈయన నటుడిగానే కాకుండా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. డీఎంకే పార్టీ ప్రచారకర్తగా బాధ్యతలు నిర్వహించారు. కుమరిముత్తుకు భార్య పుణ్యవతి, కొడుకు ఐసక్ మాదవరాజన్, కూతుళ్లు సెల్వపుష్ప, ఎలిజబెత్ మేరీ, కవిత ఉన్నారు. కొంత కాలంగా గుండె సమస్యలతో బాధపడుతున్న కుమరిముత్తు వైద్య చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురవడంతో స్థానిక ఆళ్వార్‌పేట లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అయితే కుమరిముత్తుకు శ్వాస కోస సమస్య కూడా తలెత్తడంతో ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.ఆయన భౌతిక కాయానికి మంగళవారం సాయంత్రం మందవల్లిలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.

 

కరుణానిధి సంతాపం

కుమరిముత్తు మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. డీఎంకే అధినేత కరుణానిధి, స్టాలిన్ విడివిడిగా ప్రకటనలు విడుదల చేస్తూ తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ప్రకటనలో పేర్కొన్నారు. కుమరిముత్తు పార్తివదేహానికి నివాళలర్పించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top