ఈ ఏడాది.. సెలవులే సెలవులు! | so many longest weekends this year, people planning holidays | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది.. సెలవులే సెలవులు!

Jan 18 2017 9:18 AM | Updated on Oct 2 2018 7:43 PM

ఈ ఏడాది.. సెలవులే సెలవులు! - Sakshi

ఈ ఏడాది.. సెలవులే సెలవులు!

గత సంవత్సరం దీపావళి, గాంధీ జయంతి, క్రిస్మస్.. ఇలాంటివన్నీ ఆదివారాలే రావడంతో ఉద్యోగాలు చేసుకునేవాళ్లు చాలా నీరసపడ్డారు.

గత సంవత్సరం దీపావళి, గాంధీ జయంతి, క్రిస్మస్.. ఇలాంటివన్నీ ఆదివారాలే రావడంతో ఉద్యోగాలు చేసుకునేవాళ్లు చాలా నీరసపడ్డారు. సెలవుల్నీ వృథా అయిపోయాయని తెగ బాధపడిపోయారు. అలాంటివాళ్లకు 2017 పండుగ తీసుకొస్తోంది. ఈ సంవత్సరం ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 12 లాం....గ్ వీకెండ్లు వచ్చాయట! మధ్యలో ఒక్కరోజు సెలవు పెట్టుకుంటే వరుసగా నాలుగు రోజులు ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేసి రావడానికి బోలెడంత అవకాశం ఉందట. సగటున ప్రతి నెలకు ఒక లాంగ్ వీకెండ్ వచ్చిందని ట్రావెలింగ్ సంస్థల వాళ్లు చెబుతున్నారు. ఇప్పటికే పలు ఎయిర్‌లైన్స్ సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు వెల్లువెత్తిస్తున్నాయి. ఈనెల 22వ తేదీ లోపు బుక్ చేసుకుంటే 99 రూపాయల బేస్‌ఫేర్‌కే గోవా లాంటి ప్రాంతాలకు హైదరాబాద్ నుంచి విమాన టికెట్లు అందిస్తామని ఎయిర్ ఏషియా ప్రకటించింది. జనవరి 26వ తేదీ గురువారం. మధ్యలో శుక్రవారం సెలవు పెట్టుకుంటే నాలుగు రోజులు సెలవులు. ఇలాంటివి ఏడాది పొడవునా ఏవేం ఉన్నాయో ఒక్కసారి చూసుకుంటే ముందుగానే ప్లాన్ చేసుకుని తక్కువ ధరలతోనే విమానయానం చేయడంతో పాటు సరదాగా నాలుగైదు రోజులు ఎక్కడైనా గడిపి రావచ్చని సూచిస్తున్నారు. 
 
ఫిబ్రవరి 24 శుక్రవారం మహాశివరాత్రి వచ్చింది. మార్చి 29 బుధవారం ఉగాది అయ్యింది. సోమ, మంగళవారాలు సెలవు తీసుకుంటే ఐదు రోజుల హాలిడే ఎంజాయ్ చేసి రావచ్చు. ఏప్రిల్ 14 శుక్రవారం గుడ్ ఫ్రైడే, అంబేద్కర్ జయంతి ఉన్నాయి. మే 1 మేడే సోమవారం వచ్చింది. రంజాన్ జూన్ 26 సోమవారం కావొచ్చని అంటున్నారు. ఆగస్టు 15 మంగళవారం వచ్చింది. అదేరోజు కృష్ణాష్టమి కూడా. అదే నెలలో 25వ తేదీ వినాయక చవితి శుక్రవారం వచ్చింది. అంటే ఒకే నెలలో రెండు లాంగ్ వీకెండ్లు అన్న మాట. అక్టోబర్ 2 గాంధీ జయంతి సోమవారం. అదేనెల 19వ తేదీ దీపావళి గురువారం. డిసెంబర్ 25 క్రిస్మస్ సోమవారం వచ్చింది. 
 
ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన కొన్ని ట్రావెల్స్ సంస్థలు వీకెండ్ హాలిడే ఆఫర్లు అంటూ ముందుగానే ప్రకటిస్తున్నాయి. జనవరి 26వ తేదీ గురువారం కావడంతో శుక్రవారం సెలవు పెట్టేవాళ్లు చాలామంది ఉన్నారని, ఈ వీకెండ్ ప్లాన్ల కోసం ఎంక్వైరీ చేసేవాళ్లు 25 శాతం పెరిగారని ఓ ట్రావెల్స్ సంస్థ ప్రతినిధి చెప్పారు. వాళ్లలో 60 శాతం మంది స్వదేశంలోని డెస్టినేషన్లనే చూసుకుంటుండగా, మిగిలినవాళ్లు మాత్రం దగ్గర్లోని విదేశాలకు కూడా వెళ్దామని చూస్తున్నారు. చాలామంది ఇప్పుడు రోడ్ జర్నీ కంటే విమానాల్లో వెళ్లడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. కొద్దిగా డబ్బులు ఎక్కువైనా ప్రయాణ సమయం బాగా కలిసొస్తుండటంతో అక్కడ ఎక్కువ సేపు ఎంజాయ్ చేయొచ్చన్న ఆలోచన కనిపిస్తోంది. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి గోవా వెళ్లి రావడానికి ఒక విమానయాన సంస్థ అందిస్తున్న ఆఫర్‌లో బుక్ చేసుకుంటే రానుపోను కలిపి రూ. 4500 లోపలే అవుతోంది. విడిగా వెళ్లినా దాదాపు అంతే అవుతోంది కాబట్టి ఫ్లైట్ బుక్ చేసుకుందామని కొందరు ప్లాన్ చేస్తున్నారు. ఖతార్, ఎమిరేట్స్, ఎతిహాద్, బ్రిటిష్ ఎయిర్‌వేస్, మలేషియన్ లాంటి సంస్థలు రూ. 10 వేలకే విదేశాలకు టికెట్లు ఆఫర్ చేస్తున్నాయని మేక్ మై ట్రిప్ ప్రతినిధి చెప్పారు. అందుకే ఈసారి హాలిడేస్ ఎంజాయ్ చేద్దామని అంతా సిద్ధమైపోతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement