ఏదేమైనా.. ఎందాకైనా.. ఉద్యమం ఆగదు | Samaikyandhra Movement won't stop till declare united andhra | Sakshi
Sakshi News home page

ఏదేమైనా.. ఎందాకైనా.. ఉద్యమం ఆగదు

Sep 29 2013 3:14 AM | Updated on Mar 18 2019 7:55 PM

ఏదేమైనా... ఎందాకైనా... సమైక్యాంధ్రప్రదేశ్‌ను యథాతథంగా ఉంచుతామంటూ కాంగ్రెస్ అధిష్టానం స్పష్టమైన ప్రకటన చేసేవరకూ నిరంతరంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామంటూ సీమాంధ్ర ప్రజ దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తోంది.

సాక్షి నెట్‌వర్క్: ఏదేమైనా... ఎందాకైనా... సమైక్యాంధ్రప్రదేశ్‌ను యథాతథంగా ఉంచుతామంటూ కాంగ్రెస్ అధిష్టానం స్పష్టమైన ప్రకటన చేసేవరకూ నిరంతరంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామంటూ సీమాంధ్ర ప్రజ దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తోంది. వరుసగా అరవయ్యో రోజు శనివారం కోస్తా, రాయలసీమ జిల్లాలు సమైక్యవాదుల నిరసనలతో దద్దరిల్లాయి. ఇక ఏపీఎన్జీవోల సంఘం పిలుపుమేరకు వరుసగా రెండోరోజూ కేంద్రప్రభుత్వ కార్యాలయాలను, బ్యాంకులను సమైక్యవాదులు   బంద్ చేయించారు. విశాఖజిల్లా అనకాపల్లిలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు సమ్మక్క సారక్క అమ్మవార్లకు తాత్కాలిక గుడికట్టారు. అక్కడే బతుకమ్మ ఆట ఆడి రాష్ట్రం సమైకంగా ఉంచాలంటూ ప్రార్థించారు.   విజయనగరం జిల్లా భోగాపురంలో జాతీయ రహ దారిపై రజకృవత్తిదారులు దుస్తులు ఉతికి నిరసన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం రిమ్స్‌లో సమైక్యాంధ్ర జేఏసీ నేతలు, వైద్యాధికారులను పోలీసులు అరెస్ట్ చేసినందుకు నిరసనగా శనివారం చేపట్టిన జిల్లా బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. జిల్లాలోని ఐదు పురపాలక సంఘాల్లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వీధి దీపాలను ఆర్పివేసి నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా  రామచంద్రపురంలో మహిళలు బతుకమ్మ నిర్వహించారు.
 
 పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సాయంత్రం 6గంటల నుంచి ఆదివారం ఉదయం 6గంటల వరకు జన జాగారం కార్యక్రమం నిర్వహించారు. రాయలసీమ ప్రాంతంలో భవిష్యత్తులో చుక్కనీరందని దుస్థితి తలెత్తుతుందంటూ వైఎస్సార్ జిల్లా రాయచోటిలో ఆర్టీసీ కార్మికులు ఖాళీబిందెలతో నిరసన తెలిపారు. విద్యుత్ ఉద్యోగులు అనంతపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సమైక్య ఉద్యమం మొదలై శనివారం నాటికి 60 రోజులు కావడంతో ఎస్కేయూలో పీజీ, ఇంజనీరింగ్ విద్యార్థులు జాతీయ రహదారిపై ‘60 ఎస్కేయూ’ ఆకారంలో కూర్చొని రాస్తారోకో చేశారు.  తిరుపతిలో మున్సిపల్ ఉద్యోగులు శ్రీవేంకటేశ్వరస్వామి చిత్ర పటాన్ని తలపై పెట్టుకొని గోవిందనామ స్మరణలు చేస్తూ ప్రదర్శన చేశారు.
 
 కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం చుట్టూ పొర్లు దండాలు పెట్టి నిరసన తెలిపారు. విజయవాడలో శనివారం రాత్రి సమైక్యాంధ్ర విధ్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టారు. ఎన్‌జీఓలు జాతీయ రహదారిపై జాగరణ చేశారు. గుంటూరు జిల్లా  మంగళగిరిలో రైతులు రోడ్డుపై నాట్లు వేసి నిరసన  తెలిపారు. స్వర్ణకార సంఘం సభ్యులు ప్రకాశం జిల్లా కనిగిరిలో ర్యాలీ నిర్వహించారు.  వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో వేలాది మంది మహిళలు  సమైక్య జెండాలు చేతబూని నారి భేరి సభకు తరలివచ్చారు. రాష్ట్రం ముక్కలు కాకుండా సమైక్యంగానే ఉండాలని నినాదాలు చేశారు. నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరులో మహిళా గర్జన చేపట్టారు. ఇదే జిల్లా చిట్టమూరు మండలం కొత్తగుంటలో సమైక్యగర్జన పేరిట భారీసభ నిర్వహిం చారు. ఆత్మకూరులో మహిళా గర్జన,  చేజర్ల మండలం ఆదూరుబల్లి బస్టాండు సెంటర్‌లో ఉపాధ్యాయ గర్జన  నిర్వహించారు. ప్రకాశం జిల్లా  దోర్నాలలో వేలాది మంది మాదిగలు సమైక్యాంధ్ర కోసం మహాగర్జన నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం గురుశిష్య గర్జన  నిర్వహించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో కమ్మ గర్జన, మదనపల్లెలో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్య గర్జన పేరిట సభలు నిర్వహించారు. కర్నూలు జిల్లా  ఆదోని పట్టణంలో విద్యార్థి గర్జన విజయవంతమైంది. శ్రీకాకుళం జిల్లా  రణస్థలం రణభేరిలో పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
 
 విభజన భయానికి మరో నలుగురి బలి  
 సాక్షి నెట్‌వర్క్: విభజన కలతతో మరో నలుగురు మృత్యువాత పడ్డారు. నెల్లూరు సరస్వతీనగర్‌లో నివాసముంటున్న ఆర్టీసీ డ్రైవర్ ఎన్.రాములు(47) శనివారం ఉదయం పేపర్‌లో ఉద్యమ వార్తలు చదువుతూ ఉద్వేగానికి లోనై కుప్పకూలారు. చేజర్ల మండలం తిరుపతినాయుడుపల్లెకు చెందిన రాములు 1996 నుంచి నెల్లూరు రీజియన్‌లో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. సమైక్య ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్న ఈయన మృతితో ఆర్టీసీ వర్గాల్లో విషాదం నెలకొంది. నెల్లూరు జిల్లా సంగం మండలం ఉడ్‌హౌస్‌పేటకు చెందిన ఉక్కాల రవి(42) శుక్రవారం బుచ్చిరెడ్డిపాళెంలో జరిగిన సమైక్యభేరి సభకు హాజరై తిరిగివెళుతూ మార్గమధ్యలో తరుణవాయి వద్ద గుండెపోటుకు గురై అర్ధరాత్రి ప్రాణాలు కోల్పోయాడు. ఇక సమైక్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న అనంతపురం జిల్లా  గుంతకల్లులోని తిలక్‌నగర్‌కు చెందిన దాదావలి(25), ఉరవకొండకు చెందిన చేనేత కార్మికుడు వూడిశెట్టి శేఖర్(42) గుండెపోటుతో మృతి చెందారు.
 
 పులివెందుల పులి కేక
 వైఎస్సార్ జిల్లా పులివెందులలోని సీఎస్‌ఐ చర్చి మైదానంలో నిర్వహించిన పులికేక సభలో విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యవాదులు గర్జించారు. సభా ప్రాంగణం మహిళలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఎన్‌జీవోలు, వ్యాపారస్తులు.. ఇలా అన్నివర్గాల ప్రజలతో కిక్కిరిసిపోయింది.  మైదానంలో స్థలం లేకపోవడంతో రోడ్డుపైనే జనం నిలబడి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఇక సభలో నేతలు మాట్లాడుతూ, రాష్ట్రం ముక్కలైతే సాగు, తాగునీటి సమస్యలు తీవ్రతరం కానున్నాయని, అన్ని మార్గాలు అన్వేషించిన శ్రీకృష్ట కమిటీ సిఫార్సుల్లోని ఆరో సూచన ను పరిగణలోకి తీసుకోవాలన్నారు.
 
 మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండటమే మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి  ఆశయమని.. అందుకోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ పూర్తిస్థాయిలో కృషి చేస్తోందన్నారు.  రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే, ఎంపీల ఓట్లతోపాటు సమైక్యాంధ్రకు సంబంధించిన ఓటును కేటాయించి రెఫరండం ద్వారా తీర్పు కోరాలని డిమాండు చేశారు. విభజన జరిగితే వైఎస్ పథకాల అమలుకు విఘాతం కలుగుతుందని వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. రాయలసీమ కార్మిక, కర్షక సమితి నాయకుడు సిహెచ్ చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి, కందుల రాజమోహన్‌రెడ్డి, జెఏసీ నేత శివప్రకాష్‌రెడ్డి, రాంగోపాల్‌రెడ్డి ప్రసంగించారు.
 
 కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే
 సాక్షి, విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్రం దిగొచ్చేలా చేయనున్నట్టు ఏపీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. విశాఖలోని 11 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కార్మిక సంఘాల నాయకులతో శనివారం ఆయన సమావేశమై కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు అనుసరించాల్సిన కార్యాచరణను సిద్ధం చేశారు. గాజువాకలో 4న భారీ ర్యాలీ, 5న విశాఖలో ప్రదర్శన ఉంటుందన్నారు. 4, 5వ తేదీల్లో క్యాబినెట్ నోట్ వెలువడే అవకాశం ఉందని, ఆలోగా ఎంపీలంతా రాజీనామా చేయాలని కోరారు. కర్నూలులో ఆదివారం 3 లక్షల మందితో  భారీ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement