కశ్మీర్ పై రాజ్యసభలో వాడివేడి చర్చ | Rajya Sabha debates Kashmir, Jaitley slams Pakistan | Sakshi
Sakshi News home page

కశ్మీర్ పై రాజ్యసభలో వాడివేడి చర్చ

Jul 18 2016 5:24 PM | Updated on Sep 4 2017 5:16 AM

కశ్మీర్ పై రాజ్యసభలో వాడివేడి చర్చ

కశ్మీర్ పై రాజ్యసభలో వాడివేడి చర్చ

కశ్మీర్ లో వేర్పాటువాదులకు, దేశానికి మధ్య పోరాటం జరుగుతున్నదని, అన్ని సమస్యలకు కారణం దాయాది పాకిస్థానే అని జైట్లీ అన్నారు.

న్యూఢిల్లీ: గడిచిన 12 రోజులుగా కశ్మీర్ లోయలోని 10 జిల్లాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై రాజ్యసభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. హిజబుల్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ అనంతరం చెలరేగిన ఆందోళనలు, భద్రతా బలగాల కాల్పుల్లో 41మంది పౌరులు మరణం, దాదాపు 2 వేల మందికి గాయాలు,  సుదీర్ఘ కర్ఫ్యూతో నిత్యావసరాలకు సైతం  జనం పడుతోన్న ఇబ్బందులు  తదితర అంశాలపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి.

 

సోమవారం మధ్యాహ్నం కశ్మీర్ పై చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ ఆజాద్.. పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత బీజేపీ నేతల రెచ్చగొట్టే ప్రకటనలతో లోయలో ప్రశాంతత దెబ్బతిన్నదని ఆరోపించారు. ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు ఉపయోగించాల్సిన బుల్లెట్లను పౌరులపైకి ఎక్కుపెట్టడం దారుణమన్నారు. గడిచిన 12 రోజులుగా కశ్మీర్ లోయలో కర్ఫ్యూ కొనసాగుతున్నదని, పాలు, నీరు, ఆహారం లాంటి కనీస అవసరాలు కూడా ప్రజలకు అందడం లేదని వాపోయారు. కశ్మీర్ లో శాంతి నెలకొనేలా ప్రభుత్వం తీసుకున్న ఎలాంటి చర్యలకైనా కాంగ్రెస్ పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తుందని అన్నారు. (చదవండి: ప్రజలూ మీ దృష్టిలో మిలిటెంట్లేనా?)

తర్వాత ఆర్థిక మంత్రి, రాజ్యసభలో బీజేపీ పక్ష నేత అరుణ్ జైట్లీ మాట్లాడారు. కశ్మీర్ లో వేర్పాటువాదులకు, దేశానికి మధ్య పోరాటం జరుగుతున్నదని, అన్ని సమస్యలకు కారణం దాయాది పాకిస్థానే అని జైట్లీ అన్నారు. కశ్మీర్ భారత్ లో అంతర్భాగంగా ఉండటాన్ని పాక్ ఎన్నటికీ జీర్ణించుకోలేదని, అందుకే వీలైనంత మేరలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నదని జైట్లీ ఆరోపించారు. లోయలో ప్రశాంతత నెలకొనేలా చర్యలకు ఉపక్రమిస్తామన్నారు.

అరుణ్ జైట్లీ పదేపదే పాకిస్థాన్ ను నిందించడంపై సీపీఎం పక్ష నేత సీతారాం ఏచూరి అసహనం వ్యక్తం చేశారు. మితిమీరిన భద్రతా బలగాల వల్లే కశ్మీర్ లోయలో అశాంతిని రాజేస్తున్నదని ఆయన మండిపడ్డారు. ఈ అంశంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ తో సంబంధాల విషయంలో మోదీ ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరిస్తోందని, కొన్నిసార్లు అతి సామరస్యంగా.. మరికొన్నిసార్లు  దుందుడుకు తనాన్ని ప్రదర్శిస్తూ గందోరగోళం సృష్టిస్తున్నదని విమర్శించారు. వారంతా భారతీయులే అనే భావన కశ్మీరీల్లో కలగజేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

సీసీఐ పార్టీ ఎంపీ డి. రాజా మాట్లాడుతూ అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలన్నారు. అవసరమైతే కశ్మీర్ లోయకు పార్లమెంటరీ ప్రతినిధి బృందాన్ని పంపాలని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. జేడీయూ ఎంపీ శరద్ యాదవ్ మాట్లాడుతూ కశ్మీర్ లో ప్రస్తుత పరిణామాలు బాధకలిగిస్తున్నాయన్నారు. ఇంకా టీఎంసీ, ఏఐడీఎంకే, డీఎంకే, ఎన్సీపీ, బీఎస్పీ సభ్యులు కూడా కశ్మీర్ అంశంపై ప్రభుత్వానికి సూచనలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement