
రిజర్వేషన్లను నీరుగార్చబోం: మోదీ
బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను నీరుగార్చబోదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు
నలందా: బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను నీరుగార్చబోదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. 'సామాజికంగా వెనుకబడిన బడుగువర్గాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కులను తమ ప్రభుత్వం ఎన్నటికీ దూరం చేయబోదు' అని మోదీ పేర్కొన్నారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నలందా జిల్లాలో ఆదివారం జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు.
బిహార్‌లో జరుగబోయే తదుపరి మూడు దశల ఎన్నికల్లో అత్యంత వెనుకబడిన తరగతులకు (ఈబీసీ) చెందిన ఓటర్లు పెద్దసంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల అంశంపై స్పష్టత ఇవ్వడమే కాకుండా మోదీ ఈబీసీ కార్డును ప్రదర్శించారు. తాను కూడా వెనుకబడిన తరగతులకు చెందిన వాడినని, ఈ వాస్తవాన్ని బీజేపీ వ్యతిరేక కూటమి నేతలైన లాలూ, నితీశ్ జీర్ణించుకోవడం లేదని మోదీ పేర్కొన్నారు.
గుజరాత్‌లో పటేళ్ల రిజర్వేషన్ ఉద్యమం నేపథ్యంలో బీజేపీ మాతృసంస్థ అయిన ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ రిజర్వేషన్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లపై సమీక్ష నిర్వహించాలని ఆయన పేర్కొన్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో బిహార్ ఎన్నికల వేళ బీజేపీ ఇరుకున పడింది. ఇదే అంశంతో ప్రత్యర్థి పార్టీలు బీజేపీపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.